Drugs Smuggling  | జోధ్‌పూర్‌ టు హైదరాబాద్‌.. పచ్చిమిర్చిలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌.. షాకింగ్‌ వీడియో

డ్రగ్‌ స్మగ్లింగ్‌లో అంతర్రాష్ట్ర ముఠాలు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. అధికారులు, పోలీసులు డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. స్మగ్లర్లు డ్రగ్స్‌ సరఫరా కోసం కొత్త కొత్త దారుల్ని వెతుక్కుంటున్నారు. తాజాగా జోధ్‌పూర్‌ పచ్చిమిర్చి (Jodhpur Green Chilies) డ్రగ్స్‌ అక్రమ రవాణాకు కొత్త మార్గంగా మారాయి.

Reported by: Jagan Mohan Talluri | హైదరాబాద్​ | Feb 02, 2026, 8:08 pm IST
Read Time: 5 mins
Drugs Smuggling  | జోధ్‌పూర్‌ టు హైదరాబాద్‌.. పచ్చిమిర్చిలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌.. షాకింగ్‌ వీడియో

Drugs Smuggling  | డ్రగ్‌ స్మగ్లింగ్‌లో అంతర్రాష్ట్ర ముఠాలు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. అధికారులు, పోలీసులు డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. స్మగ్లర్లు డ్రగ్స్‌ సరఫరా కోసం కొత్త కొత్త దారుల్ని వెతుక్కుంటున్నారు. తాజాగా జోధ్‌పూర్‌ పచ్చిమిర్చి (Jodhpur Green Chilies) డ్రగ్స్‌ అక్రమ రవాణాకు కొత్త మార్గంగా మారాయి.

హైదరాబాద్‌కు డ్రగ్స్‌ అక్రమ రవాణా కోసం..

జోధ్‌పూర్‌లోని మథానియా, సోయ్లాలోని పచ్చి మిరపకాయలు సువాసన, ఘాటుకు ప్రసిద్ధి చెందాయి. ఈ మిరపను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇదే అదునుగా భావించిన డ్రగ్స్‌ ముఠా.. మాదకద్రవ్యాల రవాణాకు ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను అక్రమ రవాణా (Smuggle Drugs To Hyderabad) చేసేందుకు స్మగ్లర్లు ఈ పచ్చిమిర్చిని ఉపయోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

పార్శిల్‌పై డ్రైవర్‌కు అనుమానం..

హైదరాబాద్‌లో అలాంటి మిరప దొరకదు. ఇటీవలే జోధ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తు్న్న ఓ ప్రైవేట్‌ బస్సులో ఈ మిరపకాయల పార్శిల్‌ ఇచ్చారు. ఈ మిరప హైదరాబాద్‌లో అందుబాటులో లేదని.. అందుకని వాటిని హైదరాబాద్‌లోని తమ బంధువులకు పంపుతున్నట్లు ఓ వ్యక్తి బస్సు డ్రైవర్‌కు ఆ పార్శిల్‌ ఇచ్చాడు. అది నమ్మిన డ్రైవర్‌ ఆ పార్శిల్‌తో హైదరాబాద్‌కు బయల్దేరాడు. కానీ కొంతదూరం వెళ్లాక బస్సు డ్రైవర్‌కు ఆ పార్శిల్‌పై అనుమానం వచ్చింది. అందులో ఏదో అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించాడు.

ఒక్కో పచ్చిమర్చిలో నాలుగు ప్యాకెట్ల పొడి..

వెంటనే పార్శిల్‌ను తెరిచి చూడగా.. మిరపకాయలకు ఘాట్లు ఉండటాన్ని గమనించాడు. వాటిని చీల్చి చూడగా లోపల చిన్న చిన్న గోలీలు (tablets), పాలితిన్‌ కవర్‌లో చుట్టిన పొడి కనిపించింది. ఒక్కో మిరపకాయలో మూడు నుంచి నాలుగు ప్యాకెట్లు ఉండటాన్ని గమనించాడు. సదరు డ్రైవర్‌ దీన్ని వీడియో కూడా తీశాడు. అయితే, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు డ్రైవర్‌ను బెదిరించి ఆ పార్శిల్‌ను తీసుకెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనపై బస్సు డ్రైవర్‌ హైదరాబాద్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటపడింది.

ఈ ఘటనపై జోధ్‌పూర్‌లోని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో డైరెక్టర్‌ ఘనశ్యామ్‌ సోనీ విచారణకు ఆదేశించారు. బస్సుల్లో వెళ్తున్న పార్శిల్స్‌పై నిఘా ఉంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.