BJP | బీజేపీది ధృత‌రాష్ట్ర కౌగిలి! దాని రాజకీయానికి బలి కాని పార్టీ లేదు

BJP గత పదేళ్లలో పార్టీలను చీల్చి.. తనలో చేర్చుకున్న సభ్యుల సంఖ్య 200 పైనే! ప్రాంతీయ శక్తుల పైనే ప్రధాన దృష్టి బీహార్‌లో పాశ్వాన్‌ కుటుంబంలో చిచ్చు బీజేపీ దెబ్బకు కకావికలమైన తృణమూల్‌ ఎంపీలో సింధియాను ఎగదోసిన బీజేపీ కర్ణాటకలోనూ అదే తరహా ప్రయత్నం తాజాగా శివసేన, ఎన్సీపీ సరేసరి తెలంగాణలో బీఆర్ఎస్‌ను చీల్చే యత్నం బెంగళూరులో ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడిన రోజే 38 రాజకీయ పార్టీలు తమకు అండగా ఉన్నాయని బీజేపీ చాటుకున్నది. […]

BJP | బీజేపీది ధృత‌రాష్ట్ర కౌగిలి! దాని రాజకీయానికి బలి కాని పార్టీ లేదు

BJP

  • గత పదేళ్లలో పార్టీలను చీల్చి..
  • తనలో చేర్చుకున్న సభ్యుల సంఖ్య 200 పైనే!
  • ప్రాంతీయ శక్తుల పైనే ప్రధాన దృష్టి
  • బీహార్‌లో పాశ్వాన్‌ కుటుంబంలో చిచ్చు
  • బీజేపీ దెబ్బకు కకావికలమైన తృణమూల్‌
  • ఎంపీలో సింధియాను ఎగదోసిన బీజేపీ
  • కర్ణాటకలోనూ అదే తరహా ప్రయత్నం
  • తాజాగా శివసేన, ఎన్సీపీ సరేసరి
  • తెలంగాణలో బీఆర్ఎస్‌ను చీల్చే యత్నం

బెంగళూరులో ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడిన రోజే 38 రాజకీయ పార్టీలు తమకు అండగా ఉన్నాయని బీజేపీ చాటుకున్నది. ప్రతిపక్షాల కూటమిది అవకాశవాదమైతే.. తమది మాత్రం దేశం కోసం ఏర్పడిందని ప్రకటించుకున్నది. తమ కూటమిలో ప్రతి ఒక్కరూ తమకు గొప్పవారేనని చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి చూస్తే.. పార్టీలను చీల్చడమే బీజేపీ సంస్కృతిగా కనిపిస్తున్నది. ఇందుకు ఎన్నో నిదర్శనాలు కనిపిస్తున్నాయి.

(విధాత‌ ప్రత్యేకం)
కాంగ్రెస్ ఒక‌ప్పుడు ప్రతిపక్ష రాజ‌కీయ పార్టీల‌ను చీల్చి, ఫిరాయింపు చ‌ట్టాల‌ను తుంగ‌లో తొక్కి రాజ‌కీయాల‌ను ఎలా భ్రష్టుపట్టించిందో ఇప్పుడు బీజేపీ అందుకు ప‌దిరెట్లు భ్ర‌ష్ట‌ రాజ‌కీయాల‌ను చేస్తున్న‌ది. దేశంలో బీజేపీ ఫిరాయింపు రాజ‌కీయాల‌కు బ‌లికాని పార్టీ లేదు. గుంపులు గుంపులుగా పార్టీల‌ను చీల్చ‌డం, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను టోకున కొనుగోలు చేసి ప్ర‌భుత్వాల‌ను మార్చేయ‌డం ఇప్పుడు నిత్య కృత్యం.

ఒక విశ్లేష‌కుడి అంచ‌నా ప్ర‌కారం గ‌త ప‌దేళ్ల‌లో బీజేపీ ఇత‌ర పార్టీల నుంచి త‌మ పార్టీలో చేర్చుకున్న ప్ర‌జాప్ర‌తినిధుల సంఖ్య 200 మందికి పైనే ఉంటుంది. బీహార్‌ మొద‌లు అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ దాకా ఏ రాష్ట్రాన్నీ బీజేపీ వ‌దిలిపెట్ట‌లేదు. విభ‌జించి పాలించు అన్న సూత్రాన్ని నూటికి నూరుపాళ్లు అమ‌లు చేస్తున్న పార్టీ బీజేపీ. బీహార్‌లో రాంవిలాస్ పాశ్వాన్ మ‌ర‌ణానంత‌రం ఆయన కుటుంబంలో చిచ్చుపెట్టి, ఆయ‌న పార్టీ లోక్ జ‌న‌శ‌క్తి పార్టీని చీల్చింది.

బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ నుంచి అనేక మందిని చీల్చింది. పంజాబ్‌లో శిరోమ‌ణి అకాలీద‌ళ్‌లో చీలిక‌ను ఉప‌యోగించుకుంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా నాయ‌క‌త్వంలో కాంగ్రెస్‌ను చీల్చి వారంద‌రినీ బీజేపీలో చేర్చుకుని ప్ర‌జాతీర్పును వ‌మ్ము చేసింది. క‌ర్ణాట‌క‌లో అదే ప్ర‌యోగం చేసింది. మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన‌ను రెండు ముక్క‌లు చేసింది. పెద్ద సంఖ్య‌లో శివ‌సేన ఎమ్మెల్యేల‌ను విమానంలో ఎక్కించుకుని అహ్మ‌దాబాద్‌కు అటు నుంచి అస్సాంకు త‌ర‌లించి మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వాన్ని చేజిక్కించుకుంది.

bjp

త‌ర్వాత ఎన్‌సీపీని రెండు ముక్క‌లు చేసింది. ఎన్‌సీపీ నేత‌ల‌పై ర‌క‌ర‌కాల అభియోగాలు మోపి, వారు పెద్ద పెద్ద కుంభ‌కోణాల‌కు పాల్ప‌డ్డార‌ని కేసులు పెట్టి, వారి ఆస్తులు జ‌ప్తు చేసి, చివ‌ర‌కు వారంద‌రినీ పార్టీలో చేర్చుకోవ‌డం నిన్న‌గాక మొన్న జ‌రిగిన విష‌య‌మే. అన్నా డీఎంకేలో చిచ్చుపెట్టి ప్ర‌యోజ‌నం పొందాల‌ని చూస్తున్న‌ది.

తెలంగాణ‌లో కూడా అధికార బీఆర్ ఎస్‌ను చీల్చుతున్నామ‌ని, 16 మంది ఎమ్మెల్యేలు త‌మ‌తో మాట్లాడుతున్నార‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అది జ‌రుగ‌లేదు కానీ చీలిక‌ల‌కోసం బీజేపీ స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డింద‌ని బయటపడింది. న‌లుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం చేసిన‌ కుట్ర బ‌హిర్గ‌తం కావ‌డంతో గుట్టురట్టయింది.

జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ను, ముక్తి మోర్చాను రెండింటినీ చీల్చేందుకు బీజేపీ విఫ‌ల‌య‌త్నం చేసింది. తాజాగా క‌ర్ణాట‌క‌లో కొత్త‌గా ఏర్పాటైన కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డానికి మ‌ళ్లీ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. బీహార్‌లో అధికార పార్టీని చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. బీజేపీకి అవ‌కాశం, అవ‌స‌రం రానంత‌వ‌ర‌కే ఏ పార్టీ అయినా చీలిక ముప్పును త‌ప్పించుకోగ‌లుగుతుంది.

ప్ర‌తిప‌క్షాలు, ప్రాంతీయ పార్టీలు ఏమాత్రం బ‌ల‌హీన‌ప‌డిన‌ట్టు క‌నిపించినా బీజేపీ చీలిక అస్త్రాన్ని ప్ర‌యోగిస్తుంద‌ని పై అనుభ‌వాల‌న్నీ చెబుతున్నాయి. బీజేపీ 2019 ఎన్నిక‌ల్లో న‌రేంద్ర‌మోడీ ప‌ట్ల ఉన్న సానుకూల ప‌వ‌నాల‌తో ఘ‌న విజ‌యం సాధించింది. ఈసారి అటువంటి అనుకూల ప‌వ‌నాలు లేక‌పోగా కేంద్ర ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కూడా బ‌లంగా వ్యాపించింది. న‌రేంద్ర‌మోడీ స్వ‌యంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసినా క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు బీజేపీని గెలిపించ‌లేదు.

వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉండే అవ‌కాశం లేదు. అందుకే ప్ర‌తిప‌క్షాల‌ను ఛిన్నాభిన్నం చేసి, వాటి ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీసి ఎన్నిక‌ల‌లో త‌ల‌ప‌డాల‌ని బీజేపీ భావిస్తున్న‌ది. మెజారిటీ ప్ర‌తిప‌క్షాలు ఒక‌తాటిపైకి రావ‌డం బీజేపీ స్థైర్యాన్ని దెబ్బ‌తీస్తున్న‌ది. అయితే బీజేపీ చేస్తున్న ఈ చీలిక మంత్రం ఈసారి బూమ‌రాంగ్ అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి.