బీఆరెస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేకు పోలీసుల షాక్
బీఆరెస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు కుటుంబ సభ్యుల కేసుల ద్వారా గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

- రాహీల్ పై కేసు నమోదు.. మధుసూధన్‌రెడ్డికి కస్టడీ
విధాత: బీఆరెస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు కుటుంబ సభ్యుల కేసుల ద్వారా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో 2022మార్చి 17న జరిగిన కారు ప్రమాదంలో బోధన్ బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహీల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన సందర్భంలో డ్రైవర్ అఫ్సాన్ కారు నడిపినట్లుగా లొంగిపోవడంతో అప్పట్లో అతడిని అరెస్టు చేసి రిమాండ్ చేశారు.
కేసు విచారణ క్రమంలో తాజాగా ప్రమాద సమయంలో కారును స్వయంగా రాహీల్ నడిపినట్లుగా గుర్తించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాహీల్ రాష్ డ్రైవింగ్‌తో అప్పట్లో జరిగిన ప్రమాదంలో రెండు నెలల బాలుడు చనిపోగా, మరో ఇద్దరు యాచకులు తీవ్రంగా గాయపడ్డారు.
వాహనం వదిలేసి నిందితులు పారిపోగా, కారుపై స్టిక్కర్ ఆధారంగా షకీల్ కారుగా గుర్తించారు. అయితే కారులో తన కుమారుడు లేడని షకీల్ పోలీసులకు తెలిపారు. అదే సమయంలో అఫ్సాన్ తానే కారు నడిపినట్లుగా లొంగిపోయాడు. స్టీరింగ్‌పై వేలిముద్రలు అతడివే అని పోలీసులు సైతం అప్పట్లో వెల్లడించారు.
బాధితుల విచారణ వాంగ్మూలం మేరకు ప్రమాద సమయంలో డ్రైవింగ్ సీటు నుంచి దిగి పారిపోయిన వ్యక్తి ఆఫ్సాన్ కాదని, రాహీల్ అని పోలీసులు గుర్తించి కేసు నమోదు చేయడంతో ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. కొన్ని నెలల క్రితం రాహీల్ సచివాలయం వద్ధ మరోసారి రాష్ డ్రైవింగ్ కేసులో ఇరుక్కోవడం ఈ కేసు కూడా జూబ్లీహిల్స్ కేసు తరహాలోనే సాగుతుండటం గమనార్హం.
ఎమ్మెల్యే మహిపాల్ సోదరుడికి కస్టడీ
మరోవైపు పటాన్ చెరు బీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని అక్రమ మైనింగ్ కేసులో పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇప్పటికే 14రోజుల రిమాండ్ విధించిన కోర్టు, గురువారం మూడు రోజుల కస్టడీకి అనుమతించడంతో ఈ కేసు విచారణ ముందుకు దూకనుంది.