జాతీయ రహదారులపై 9వేల బ్లాక్ స్పాట్స్..!
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వచ్చే ఏడాది మార్చి నాటికి జాతీయ రహదారులపై ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్‌ను సరిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నది

- వచ్చే ఏడాది మార్చినాటికి సరిదిద్దాలని కేంద్రం ప్లాన్..!
Black Spots | కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వచ్చే ఏడాది మార్చి నాటికి జాతీయ రహదారులపై ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్‌ను సరిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై మంత్రిత్వ శాఖ 9వేల బ్లాక్ స్పాట్స్‌ను గురించింది. ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (IRF) నిర్వహించిన కార్యక్రమంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడేళ్లలో 4వేల బ్లాక్‌స్పాట్స్‌ను సరిదిద్దామన్నారు. ప్రస్తుతం 9వేల కంటే ఎక్కువగా బ్లాక్‌స్పాట్‌ను గుర్తించామని.. దేశవ్యాప్తంగా అన్ని బ్లాక్ స్పాట్‌ను సరిదిద్దేందుకు మంత్రిత్వ శాఖ 2025 మార్చి నాటికి లక్ష్యాన్ని నిర్ధేశించుకుందని ఆయన తెలిపారు.
మూడేళ్ల వ్యవధిలో కనీసం ఐదు ప్రమాదాలు జరిగి 10 మంది మృతి చెందిన జాతీయ రహదారులపై దాదాపు 500 మీటర్ల మేర విస్తరించిన వాటిని యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించారు. దేశంలోని అన్ని జాతీయ రహదారుల (NH) రహదారి భద్రత ఆడిట్ త్వరలో పూర్తవుతుందని జైన్ తెలిపారు.రహదారి నిర్వహణ కోసం ‘జీరో కంప్లయింట్’ ప్రవేశపెట్టాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోందన్నారు.
గుంతలు, రోడ్ల నిర్వహణ సక్రమంగా జరగకపోవడానికి త్వరలో సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా గాయపడిన ప్రమాద బాధితులందరికీ నగదు రహిత వైద్య చికిత్సను త్వరలో ప్రారంభించాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఐఆర్‌ఎఫ్ గౌరవాధ్యక్షుడు కేకే కపిల మాట్లాడుతూ సురక్షితమైన రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలంటే రోడ్ ఇంజినీరింగ్, వెహికల్ ఇంజినీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ కేర్ తదితర సమగ్ర విధానం అవసరమని స్పష్టం చేశారు.