ట్యాంక్ బండ్‌పై చాక‌లి ఐల‌మ్మ‌, స‌ర్వాయి పాప‌న్న విగ్ర‌హాలు!

ట్యాంక్ బండ్ పై ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న వక్తల సూచనలు పరిగణనలోకి తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

ట్యాంక్ బండ్‌పై చాక‌లి ఐల‌మ్మ‌, స‌ర్వాయి పాప‌న్న విగ్ర‌హాలు!
  • త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం
  • దుద్దిళ్ల శ్రీ‌పాద‌రావు జ‌యంతి స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి


విధాత‌: ట్యాంక్ బండ్ పై ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న వక్తల సూచనలు పరిగణనలోకి తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు ట్యాంక్ బండ్‌పై చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్నలాంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటును పరిశీలిస్తామ‌న్నారు. ఇందు కోసం త్వరలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి విధానపరంగా మంచి నిర్ణయం తీసుకుంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు.


శ‌నివారం ర‌వీంధ్ర భార‌తిలో జ‌రిగిన దుద్దిళ్ల శ్రీ‌పాద‌రావు 87వ జ‌యంతి స‌భ‌లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్ గా శ్రీపాదరావు కీలక పాత్ర పోషించారని, మంథని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారన్నారు. శ్రీపాదరావు లాంటి నాయకులు తెలంగాణకు గర్వకారణమ‌న్నారు. శ్రీపాదరావు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన శ్రీధర్ బాబు తనను తాను నిరూపించుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్నారు.


ప్రయోజకుడిగా మారిన శ్రీధర్ బాబును ఇప్పుడు చూస్తే శ్రీపాదరావు సంతోషించేవారన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఇతర నేతలు హ‌జ‌రై శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. రవీంద్రభారతి ఆవరణలో శ్రీపాదరావు ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు.


మా తండ్రి శ్రీ‌పాద‌రావు జ‌యంతి ఉత్సవాలను ప్రభుత్వం తరపున జరుపుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మా నాన్న దేశానికి స్పూర్తిదాయకమైన పీవి నర్సింహ రావు కు ప్రధాన శిష్యుడుగా ఉన్నారన్నారు. ప్రజల కోసం సేవ చేస్తూ మా నాన్న ప్రాణాలు కోల్పోయారన్నారు. నా తండ్రి ఆశయాలకు నెరవేర్చేందుకు నేను రాజకీయాలలోకి వ‌చ్చ‌న‌న్నారు.