జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ బల పరీక్షలో విజయం సాధించారు. చంపై సోరెన్ సర్కార్‌కి వ్యతిరేకంగా 29 ఓట్లు పడగా అనుకూలంగా 47 ఓట్లు పడ్డాయి
Jharkhand | విధాత: జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ బల పరీక్షలో విజయం సాధించారు. చంపై సోరెన్ సర్కార్‌కి వ్యతిరేకంగా 29 ఓట్లు పడగా అనుకూలంగా 47 ఓట్లు పడ్డాయి. బల పరీక్షకు కోర్టు అనుమతితో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా హాజరయ్యారు. తన అరెస్టు వెనక రాజ్ భవన్ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎవరీ చంపై సోరెన్..?
చంపై సోరెన్ ప్రముఖ గిరిజన నాయకుడు. రాజకీయ నాయకుడు కూడా. 67 ఏండ్ల చంపై ప్రస్తుతం జార్ఖండ్ గవర్నమెంట్లో రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. సిరైకేలా – ఖర్సవాన్ జిల్లాలోని జిలిన్గోరా గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు. ప్రత్యేక జార్ఖండ్ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో చంపై కీలకపాత్ర పోషించారు. దీంతో ఆయన జార్ఖండ్ పులిగా ప్రసిద్ధి చెందారు. ఇప్పటికీ చంపైని జార్ఖండ్ పులిగా పిలుస్తుంటారు. ఇక జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రెసిడెంట్ శిబూ సోరెన్‌కు చంపై అత్యంత సన్నిహితుడు. శిబూ సోరెన్‌కు అన్ని వేళలా అండగా నిలిచారు.
రుజువు చేస్తే రాజకీయాలు వదిలేస్తా
ఈడీ కస్టడీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కూడా పీఎంఎల్ఏ కోర్టు అనుమతితో సోమవారం నాటి విశ్వాస పరీక్షకు హాజరయ్యారు. విశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా హేమంత్ మాట్లాడుతూ.. భూముల కుంభకోణంలో తన పాత్రను రుజువు చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారుకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు ఆయన సవాలు విసిరారు. ‘వారు కనుక నిరూపించగలిగితే.. నేను రాజకీయ వదిలేస్తాను’ అని ప్రకటించారు.
1991లో రాజకీయ ప్రవేశం..
1991లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సిరైకేలా నియోజకవర్గానికి 1991లో ఉప ఎన్నికలు రావడంతో.. ఆ స్థానం నుంచి చంపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందారు. నాటి నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2005, 2009, 2014, 2019 ఎన్నికల్లోనూ సిరైకేలా నుంచి గెలుపొందారు. 2009 నుంచి 2014 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, కార్మిక, గృహ శాఖ మంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం ప్రభుత్వంలో రవాణా, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. చంపై సోరెన్‌కు యంగేజ్‌లోనే వివాహమైంది. ఆయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు సంతానం.