Chandrayaan3 | చంద్రుడిపై ఆశల బండి! ఇది కదిలితేనే మిషన్ సక్సెస్

Chandrayaan3 | ఊసులు మోసుకెళ్లిన బండి ఆరు చిన్ని చక్రాల ‘ప్రజ్ఞాన్’ రోవర్ ‘చంద్రయాన్-3’లో హీరో ఇదే ‘ప్రజ్ఞాన్’ రోవర్.. జాబిలి నేలపై ఒంటరి సంచారి. చంద్రుడిపై పగటిపూట అంటే.. భూమ్మీద 14 రోజుల వ్యవధిలో దాదాపు అర కిలోమీటరు దూరం ప్రయాణించనున్న రోవర్. ‘విక్రమ్’ ల్యాండర్ తాను దిగిన చోటనే ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటుంది. ల్యాండరు లోంచి ‘ప్రజ్ఞాన్’ రోవర్ ర్యాంపు మీదుగా కిందికి దొర్లుతుంది. సౌర ఫలకాల రేకు విచ్చుకుంటుంది. రోవర్ ముందుభాగంలో […]

  • By: krs    latest    Aug 23, 2023 2:42 PM IST
Chandrayaan3 | చంద్రుడిపై ఆశల బండి! ఇది కదిలితేనే మిషన్ సక్సెస్

Chandrayaan3 |

  • ఊసులు మోసుకెళ్లిన బండి
  • ఆరు చిన్ని చక్రాల ‘ప్రజ్ఞాన్’ రోవర్
  • ‘చంద్రయాన్-3’లో హీరో ఇదే

‘ప్రజ్ఞాన్’ రోవర్.. జాబిలి నేలపై ఒంటరి సంచారి. చంద్రుడిపై పగటిపూట అంటే.. భూమ్మీద 14 రోజుల వ్యవధిలో దాదాపు అర కిలోమీటరు దూరం ప్రయాణించనున్న రోవర్. ‘విక్రమ్’ ల్యాండర్ తాను దిగిన చోటనే ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటుంది. ల్యాండరు లోంచి ‘ప్రజ్ఞాన్’ రోవర్ ర్యాంపు మీదుగా కిందికి దొర్లుతుంది. సౌర ఫలకాల రేకు విచ్చుకుంటుంది.

రోవర్ ముందుభాగంలో ఎడమపక్క ఒకటి, కుడిపక్క మరొకటి వంతున 2 నేవిగేషన్ కెమెరాలు ఉంటాయి. ఇవి పరిసరాలను గమనిస్తాయి. రోవర్ ముందు భాగంలోనే ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (APXS) పరికరం ఉంటుంది. చంద్రుడి ఉపరితలంపై సేకరించిన మట్టి, రాళ్ల శాంపిల్స్ మీద ఆల్ఫా కణాలు, ఎక్స్ కిరణాలను ఈ APXS సాయంతో ప్రయోగిస్తారు.

చంద్ర నమూనాలను రసాయనికంగా పరిశీలించి, మూలకాల కూర్పును విశ్లేషించడం ఈ స్పెక్ట్రోమీటర్ పని. ‘ప్రజ్ఞాన్’ రోవర్ మాటామంతీ అంతా ల్యాండర్ ‘విక్రమ్’తో మాత్రమే! అంటే.. ల్యాండరుతో మాత్రమే ‘ప్రజ్ఞాన్’ రోవర్ ‘టచ్’లో ఉంటుంది. ల్యాండరుతో మాత్రమే రోవర్ కమ్యూనికేషన్స్ (సమాచార సంబంధాలు) నెరపుతుంది. మనం (మిషన్ కంట్రోల్) పంపే ఆజ్ఞలు, సూచనల సంకేతాలను ల్యాండర్ సాయంతో రోవర్ స్వీకరిస్తుంది. తాను కనుగొన్న విశేషాలను ల్యాండరుకు ప్రసారం చేస్తుంది.

ఇందుకు రోవర్లో యాంటెనా ఉంది. రోవర్ ‘ప్రజ్ఞాన్’లోని ముఖ్యాంశం.. ‘రాకర్- బోగీ’ మెకానిజం. చంద మామ ఉపరితలంపై బుల్లి చక్రాల రోవర్ సంచారం అనుకున్నంత సులభం కాదు. అక్కడ రాళ్లూరప్పలు ఉంటాయి. దారిలో రోవర్ చక్రాలకు చంద్రశిలలు అడ్డుపడితే వాటిని ఎక్కే క్రమంలో రోవర్ అదుపుతప్పి పడిపోవచ్చు. మార్గమధ్యంలో ఈ అవరోధాలను అధిగమించేందుకు ‘రాకర్-బోగీ’ వ్యవస్థ దోహదపడుతుంది.

‘రాకర్-బోగీ’ అనేది.. రోవర్ స్థిరత్వం కోల్పోకుండా, కింద పడిపోకుండా చేసే ఒక విధమైన సస్పెన్షన్ ఏర్పాటు. ఎగుడుదిగుళ్ల అంగారక గ్రహపు ఉపరితలంపై తమ ‘సోజర్నర్’ రోవర్ బోల్తా కొట్టకుండా సాఫీగా తిరిగేందుకు ‘నాసా’ 1980ల్లో ఈ సురక్షిత ఏర్పాటు చేసింది. దీన్ని ‘నాసా’ తమ తదుపరి అంగారక రోవర్లు స్పిరిట్, ఆపర్చూనిటీ, క్యూరియాసిటీ, పెర్సవరన్స్ రోవర్లకూ వర్తింపజేసింది.

మన ‘ప్రజ్ఞాన్’ రోవర్ కూడా ఆ బాటలోనే వెళుతోంది. ‘రాకర్-బోగీ’ సిస్టమ్ ఏమిటంటే.. రోవర్లో ఎడమవైపు లేదా కుడివైపు మూడు చక్రాల్ని కలుపుతూ పూర్తిగా ఒకే ఇరుసు ఉండదు. ఒక ఇరుసుకు బదులు చక్రాలపై వేర్వేరుగా 2 యాక్సిల్స్ పరస్పరం అనుసంధానమై పనిచేస్తాయి.

ఫలితంగా రోవర్లోని అన్ని చక్రాలపై బరువు సమానంగా పడుతుంది. దీంతో ఎత్తుపల్లాల ప్రాంతంలో చక్రం వ్యాసానికి రెట్టింపు సైజున్న ప్రతిబంధక శిలలనూ ‘ప్రజ్ఞాన్’ రోవర్ కిందపడిపోకుండా అవలీలగా ఎక్కి దిగగలదు. సురక్షితంగా దిగే ల్యాండర్, అందులోంచి వెలుపలికొచ్చి షికారు చేసే రోవర్… వీటిపై ‘చంద్రయాన్-3’ మిషన్ జాతకం ఆధార పడి వుంది.

ల్యాండర్‌, రోవర్‌ పని ఇదీ..

చంద్రునిపైకి విక్రం ల్యాండర్‌ దిగింది.. అందులో నుంచి ప్రజ్ఞ రోవర్‌ బయటకు వచ్చింది.
రోవర్‌తో కలుపుకొంటే ల్యాండర్‌ విక్రమ్‌ బరువు 1749.8 కిలోలు. దీని జీవితం 14 రోజులు. చంద్రునిపై ఒక పగలు భూమిపై14 రోజులతో సమానం. రెండు మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు కలిగిన ల్యాండర్‌ మూడు పేలోడ్‌లను తీసుకుపోయింది.

రంభ: రేడియో అనాటమీ ఆఫ్‌ మూన్‌ బౌండ్‌ హైపర్‌సెన్సిటివ్‌ ఐనోస్పియర్‌ అండ్‌ అట్మాస్పియర్‌ (ఆర్‌ఏఎంబీహెచ్‌ఏ) చంద్రుని ఉపరితలంపై అయాన్లు, ఎలక్ట్రాన్ల వంటి ప్లాస్మా సాంద్రతపై అధ్యయనం చేస్తుంది.

చాస్టే: చంద్రాస్‌ సర్ఫేస్‌ థర్మో ఫిజికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (చాస్టే) చంద్రుడి ఉపరితలం కలిగి ఉన్న ఉష్ణ లక్షణాలను కొలుస్తుంది.

ఇల్‌సా : ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ లూనార్‌ సీస్మిక్‌ యాక్టివిటీ (ఐఎల్‌ఎస్‌ఏ) చంద్రయాన్‌-3 అడుగిడిన ప్రాంతంలో భూకంపాల తీవ్రతపై ప్రయోగాలు నిర్వహిస్తుంది. చంద్రుని పొరలు, మట్టి స్వభావంపై పరిశీలన జరుపుతుంది. భవిష్యత్తులో ప్రయోగాలకు ఇది ఉపయోగపడుతుంది.

ఎల్‌ఆర్‌ఏ: లేజర్‌ రెట్రోరిఫ్లెక్టర్‌ అర్రే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన పరికరం. చంద్రుడిపై గతిశాస్త్రాన్ని అర్థం చేసుకునేందుకు ఇది దోహదపడుతుంది. ఇందులో ఏడు సెన్సర్లు ఉంటాయి. ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవాయిడెన్స్ కెమెరా కూడా ఇందులోనే ఉన్నది.

ఇక ల్యాండర్‌లో పంపించిన రోవర్‌ పేరు ప్రజ్ఞ. ఇది 26 కిలోల బరువు ఉంటుంది. ఆరు చక్రాల సహాయంతో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ 14 రోజులు పనిచేస్తుంది. ఇందులో రెండు పేలోడ్‌లు ఉన్నాయి.

లిబ్స్‌: లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌ గుణాత్మక, నిర్మాణాత్మక మూలకాలను విశ్లేషిస్తుంది. దీనిలోని లేజర్‌ మట్టిపై పడి.. దాన్ని కరిగించడం ద్వారా అందులోని రసాయన మూలకాలు, ఖనిజ సంపదను గుర్తిస్తుంది.

ఏపీఎక్స్‌ఎస్‌: ఆల్ఫా పార్టికల్‌ ఎక్స్‌-రే స్పెక్టోమీటర్‌ విక్రం దిగిన ప్రదేశంలోని మట్టి, రాళ్లలో ఉన్న రసాయనాలను గుర్తిస్తుంది. మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్‌, పొటాషియం, కాల్షియం, టైటానియం వంటి మూలకాలను గుర్తింపుపై కేంద్రీకరిస్తుంది.

14 రోజులే అయినప్పటికీ..

సౌర ప్యానెళ్ల ద్వారా పనిచేసే విక్రం, ప్రజ్ఞ జీవితం కాలం 14 రోజులు. అంటే.. చంద్రునిపై ఒక పగలు (భూమిపై 14 రోజులు) సూర్యరశ్మి ఉన్నంతసేపే ఈ వ్యవస్థలన్నీ నిర్దిష్టంగా పనిచేయగలుగుతాయి. సూర్యాస్తమయం తర్వాత అంధకారం నెలకొని, ఉష్ణోగ్రతలు మైనస్‌ 180 డిగ్రీలకు పడిపోతాయి.

ఈ స్థితిలో ల్యాండర్‌, రోవర్‌ వ్యవస్థలు పనిచేయలేవు. అదృష్టవశాత్తూ ల్యాండర్‌, రోవర్‌లు 14 రోజుల తర్వాత లభించే సూర్యరశ్మితో మళ్లీ పనిచేయడం మొదలు పెడితే.. ఇస్రోకు రెట్టింపు ప్రయోజనమే!