Pragyan Rover | ప్రజ్ఞ మూన్‌వాక్‌.. చంద్రునిపై విక్రం తొలి సెల్ఫీ: వీడియో విడుదల

Pragyan Rover | ర్యాంప్‌పై నుంచి దిగిన రోవర్‌ బుధవారమే వీడియో చిత్రీకరణ.. శుక్రవారం విడుదల చేసిన ఇస్రో న్యూఢిల్లీ: యావత్‌ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న దృశ్యం రానే వచ్చింది. విక్రం ల్యాండింగ్‌ను బుధవారం సాయంత్రం గ్రాఫిక్‌ ప్రజెంటేషన్‌లో వీక్షించగా.. తాజాగా శుక్రవారం విక్రం చంద్రునిపై నుంచి తన తొలి సెల్ఫీని భూమికి పంపించింది. ఆ వీడియోలో మన కలల వాహనం.. ప్రజ్ఞ రోవర్‌ విక్రం నుంచి ర్యాంపు మీదుగా చంద్రునిపైకి మెల్లగా దిగుతుండటం కనిపిస్తున్నది. […]

  • By: Somu    latest    Aug 25, 2023 11:38 AM IST
Pragyan Rover | ప్రజ్ఞ మూన్‌వాక్‌.. చంద్రునిపై విక్రం తొలి సెల్ఫీ: వీడియో విడుదల

Pragyan Rover |

  • ర్యాంప్‌పై నుంచి దిగిన రోవర్‌
  • బుధవారమే వీడియో చిత్రీకరణ..
  • శుక్రవారం విడుదల చేసిన ఇస్రో

న్యూఢిల్లీ: యావత్‌ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న దృశ్యం రానే వచ్చింది. విక్రం ల్యాండింగ్‌ను బుధవారం సాయంత్రం గ్రాఫిక్‌ ప్రజెంటేషన్‌లో వీక్షించగా.. తాజాగా శుక్రవారం విక్రం చంద్రునిపై నుంచి తన తొలి సెల్ఫీని భూమికి పంపించింది. ఆ వీడియోలో మన కలల వాహనం.. ప్రజ్ఞ రోవర్‌ విక్రం నుంచి ర్యాంపు మీదుగా చంద్రునిపైకి మెల్లగా దిగుతుండటం కనిపిస్తున్నది.

ఈ వీడియోను విక్రం చంద్రుడిపై ల్యాండ్‌ అయిన కొద్ది గంటలకు చిత్రీకరించగా.. దానిని ఇస్రో అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ‘ఇదిగోండి.. చంద్రయాన్‌ -3 రోవర్‌ ల్యాండర్‌ లోపలి నుంచి ర్యాంపు మీదుగా చంద్రుని ఉపరితలంపైకి దిగుతున్నది..’ అని ఆ వీడియో కింద ఇస్రో ట్వీట్‌ చేసింది. ఈ వీడియోలో ప్రజ్ఞ రోవర్‌పై ఉన్న సోలార్‌ ప్యానెల్‌ సూర్యరశ్మిని గ్రహిస్తూ దాని నల్లటి నీడలు అద్భుతంగా కనిపిస్తున్నాయి.

బుధవారం సాయంత్రం అనుకున్న సమయానికి సరిగ్గా 6.04 గంటలకు విక్రం చంద్రునిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరిపిన విషయం తెలిసిందే. దీంతో చంద్రునిపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేసిన నాలుగో దేశంగా భారత్‌ వినుతికెక్కింది. అంతేకాకుండా ఇంత వరకూ ఎవరూ చూడని దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. తదుపరి సుమారు నాలుగు గంటల తర్వాత ప్రజ్ఞ రోవర్‌ బయటకు వచ్చింది. దాని పాదముద్రలు చంద్రునిపై ఆచంద్రతారార్కం నిలిచిపోతాయి.

చంద్రయాన్‌-3 అతిపెద్ద విజయం.. దక్షిణ ధృవంపై కాలుమోపడమే. భారీ బిలాలు, లోతైన గొయ్యలు ఉన్న ఈ ప్రాంతంలో కాలుమోపేందుకు గతంలో సిబ్బందితో కూడిన అపోలో వంటి ప్రయోగాలు ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. ఎక్కడ ల్యాండ్‌ అవ్వాలనేది విక్రం తన ల్యాండింగ్‌ కెమెరాల ఆధారంగా నిర్ణయించుకున్నదన్న సంగతి తెలిసిందే. వీడియోను జాగ్రత్తగా గమనిస్తే.. విక్రం నిర్దిష్ట సమయంలోనే అనువైన ప్రాంతంలో దిగినట్టు కనిపిస్తున్నది. తద్వారా చంద్రునిపై ప్రజ్ఞ మూన్‌వాక్‌ సజావుగా సాగిపోయేందుకు దారులు వేసింది.

బుధవారం మొదలుకుని.. భూమిపై 14 రోజులతో సమానమైన ఒక పగలు అంతా రోవర్‌ తన అన్వేషణలు చేయనున్నది. సమయం తక్కువ ఉండటంతో ఇప్పటికే తన శాస్త్రీయ పరిశోధనలను రోవర్‌ మొదలు పెట్టింది. చంద్రునిపై ఉన్న మంచురూపంలో ఉన్న జల నిక్షేపాలపై పరిశోధనలు చేయనున్నది. ప్రధాని నరేంద్రమోదీ శనివారం బెంగళూరులోని ఇస్రో కార్యాలయానికి చేరుకుని, శాస్త్రవేత్తలను అభినందించనున్నారు. ఈ సందర్భంగా మరింత నాణ్యతతో కూడిన వీడియోను ప్రధానికి శాస్త్రవేత్తలు చూపించే అవకాశం ఉన్నది.