Chandrayaan3 | చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్.. జాబిల్లిపై సేఫ్‌గా దిగిన విక్రమ్ ల్యాండర్
Chandrayaan3 | చందమామ అందిన రోజు! చంద్రునిపై కాలుమోపిన విక్రం భయానక క్షణాల్లోనూ తొణకని విశ్వాసం కొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలు సాఫ్ట్ ల్యాండ్ చేసిన నాలుగో దేశం దక్షిణ ధృవంపై దిగిన తొలి దేశంగా రికార్డ్ చంద్రునిపైకి దిగి.. నడయాడిన ప్రజ్ఞ రోవర్ ఇస్రో, మూడు సింహాల చిహ్నాల ముద్రణ ఎట్టకేలకు కల నిజమైంది! దేశ సంకల్పం నెరవేరింది! కోట్ల మంది భారతీయుల విశ్వాసం విజయహాసం చేసింది! ఉత్కంఠ.. ఉల్లాసంగా మారిపోయింది! ఇస్రో కఠోర […]

Chandrayaan3 |
- చందమామ అందిన రోజు!
- చంద్రునిపై కాలుమోపిన విక్రం
- భయానక క్షణాల్లోనూ తొణకని విశ్వాసం
- కొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలు
- సాఫ్ట్ ల్యాండ్ చేసిన నాలుగో దేశం
- దక్షిణ ధృవంపై దిగిన తొలి దేశంగా రికార్డ్
- చంద్రునిపైకి దిగి.. నడయాడిన ప్రజ్ఞ రోవర్
- ఇస్రో, మూడు సింహాల చిహ్నాల ముద్రణ
ఎట్టకేలకు కల నిజమైంది! దేశ సంకల్పం నెరవేరింది! కోట్ల మంది భారతీయుల విశ్వాసం విజయహాసం చేసింది! ఉత్కంఠ.. ఉల్లాసంగా మారిపోయింది! ఇస్రో కఠోర శ్రమకు సాక్షాత్తూ చందమామే అబ్బురపడి.. చేతులుచాచి మరీ అందివచ్చింది! విరామం లేకుండా 44 రోజులపాటు.. లక్షల కిలోమీటర్లు ప్రయాణించి.. ‘భయానక నిమిషాల్లో’ సైతం తొణకని విక్రం ల్యాండర్.. విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపింది ‘నా గమ్యం చేరుకున్నా’ అంటూ విజయ సందేశం పంపింది! ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్.. చంద్రుని ఒడిలో సయ్యాటలాడుతూ.. పరిసరాలను ఫొటోలు తీసింది. ఇన్నాళ్లూ మనం ఆకాశంలోనే చూసిన చందమామ ఇప్పుడు మన చెంతకు వచ్చేసింది! ఒకవైపు సూర్యాస్తమయం అవుతున్న వేళ.. చంద్రుడిపై భారత్ ఉదయించింది!
విధాత, బెంగళూరు: భారతదేశం కొత్త చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా నిలిచింది. అంతేకాదు.. ఇంత వరకూ ఎవరూ దిగని దక్షిణ ధృవంలో కాలుమోపి తన సత్తా చాటింది. చంద్రయాన్-3 చంద్రయాన్-3 దిగ్విజయమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. బుధవారం సాయంత్రం 544 గంటలకు మొదలైన కీలక దశ దాటుకుని.. అనుకున్న సమయానికే సరిగ్గా 6.04 గంటలకు విక్రం ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిపింది.
చంద్రయాన్-2 వైఫ్యం, తాజాగా రష్యా ల్యాండర్ కూలిపోవడం నేపథ్యంలో క్షణక్షణానికి ఉత్కంఠతో గడిపిన ఇస్రో శాస్త్రవేత్తలు.. ప్రయోగం విజయవంతం కాగానే చేసిన కరతాళ ధ్వనులతో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం మారుమోగిపోయింది. అదే సమయంలో విక్రం ల్యాండింగ్‌ను టీవీల్లో చూసిన యావత్ దేశ ప్రజలు పులకించిపోయారు.
ఈ కార్యక్రమాన్ని దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్ బర్గ్ నుంచి వీక్షించిన ప్రధాని నరేంద్రమోదీ.. త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ దూర తీరాల్లో ఉన్న చందమామ మన చెంతకు వచ్చిందని అన్నారు. ప్రయోగంలో పాలుపంచుకున్న ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని ఆయన అభినందించారు. తన బృందాన్ని ఉద్దేశించి మాట్లాడిన సోమనాథ్.. ‘భారతదేశం ఇప్పుడు చంద్రుడిపై ఉన్నది’ అని చెప్పారు. ప్రయోగం విజయవంతం కాగానే ఇస్రో కార్యాలయంలో ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు మిన్నంటాయి.
14 రోజులపాటు పరిశోధనలు
చంద్రునిపై దిగే సమయంలో కీలకమైన రఫ్ బ్రేకింగ్, ఆల్టిట్యూడ్ హోల్డింగ్, ఫైన్ బ్రేకింగ్, టెర్మినల్ డిసెంట్ వంటి ప్రక్రియలు.. అంటే వేగం తగ్గించుకుని, సాఫీగా దిగేందుకు అవసరమైన అన్ని చర్యలను విక్రం విజయవంతంగా నిర్వహించుకున్నది. చంద్రయాన్-3 రెండు వారాలపాటు చంద్రునిపై క్రియాశీలకంగా ఉంటుంది. చంద్రునిపై దక్షిణ ధృవంలో 14 రోజులపాటు వెలుతురు ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని ఇస్రో ఎంచుకున్నది. ఈ పద్నాలుగు రోజులు చంద్రుడి ఉపరితలంపై రోవర్ ‘ప్రజ్ఞ’ తిరుగుతూ అక్కడి ఖనిజాల మిశ్రమాలను విశ్లేషించనున్నది. చంద్రునిపై ఆక్సిజన్, నీటిమంచు ఉన్నాయా? అనే విషయాలను కూడా పరిశీలించనున్నది.
భారత స్పేస్ బిజినెస్‌కు ఊతం
ఇప్పటి వరకూ ఈ ఘనత సాధించిన అమెరికా, రష్యా, చైనా తర్వాత నాలుగో దేశంగా నిలిచింది. మరోసారి చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిపేందుకు రష్యా ప్రయత్నించి విఫలమైన తరుణంలో.. ఈ ప్రయోగంతో భారతదేశ అంతరిక్ష పరిజ్ఞానం సత్తా ఏమిటో యావత్ ప్రపంచానికి మరోసారి తెలిసివచ్చింది. దీంతో ప్రైవేటు అంతరిక్ష ప్రయోగాలు, ఉపగ్రహ ఆధారిత వ్యాపారంలో భారత్‌కు అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
ప్రధాని అభినందనలు
చంద్రయాన్-3ని విజయవంతం చేసిన ఇస్రో చైర్మన్ సోమనాథ్, ఆయన శాస్త్రవేత్తల బృందాన్ని ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. బ్రిక్స్ సమావేశం కోసం ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని.. జొహాన్నెస్‌బర్గ్ నుంచి ఇస్రో చైర్మన్ సోమనాథ్‌కు ఫోన్ చేశారు. శాస్త్రవేత్తలను, సిబ్బందిని అభినందించేందుకు తాను తర్వలోనే బెంగళూరులోని ఇస్రో కార్యాలయానికి వస్తానని తెలిపారు. ‘సోమనాథ్ గారూ.. మీపేరు సోమనాథ్ అనేది కూడా చంద్రుడితో సంబంధం కలిగి ఉన్నదే. మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందిస్తారు. మీకు, మీ బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని మోదీ చెప్పారు.
Chandrayaan3 | చంద్రుడిపై ఆశల బండి! ఇది కదిలితేనే మిషన్ సక్సెస్
జాబిల్లి పైకి ప్రయాణం సాగిందిలా
జూలై 14: చంద్రునిపై కాలుమోపాలన్న లక్ష్యంతో శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకుపోయిన ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్.. చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది.
జూలై 15: మొదటి కక్ష్య దశ అయిన ఎర్త్ బౌండింగ్ ఫైరింగ్-1ను ISTRAC/ISRO, బెంగళూరు విజయవంతంగా 41762 కి.మీ. x 173. కి.మీ. అంతరిక్ష కక్ష్యలో విజయవంతంగా తీసుకుపోయింది.
జూలై 17: రెండవ దశలో ప్రవేశించి 41,603 కి.మీ. x 226 కి.మీ. కక్ష్యలో తిరిగింది.
జూలై 22: ఎర్త్-బౌండ్ పెరిజీ ఫైరింగ్‌ను ఉపయోగించి మరో కక్ష్య పూర్తి చేసింది.
జూలై-25న ఇస్రో 71,351 కి.మీ. x 233 కి.మీ. కక్ష్యను పూర్తి చేసింది. ట్రాన్సులార్ ఇంజక్షన్‌ను విజయవంతం చేసిన ఇస్రో ట్రాన్సులార్ కక్ష్యలోకి ప్రవేశింపజేసింది. ఈ క్రమంలో నౌక 288 కి.మీ. x 3,69,328 కి.మీ. చేరుకుంది.
ఆగస్ట్ 5: చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన చంద్రయాన్-3. అనుకున్న విధంగానే 164 కి.మీ. x 18,074 కి.మీ. చేరుకున్నది.
ఆగస్ట్ 6: రెండవ లూనార్ బౌండ్ దశను ఇస్రో విజయవంతం చేసింది. ఇందులో చంద్రుడిపై 170 కి.మీ. x 4,313 కి.మీ. కక్ష్యలో తిరిగింది. అదే రోజు చంద్రయాన్-3 లూనార్ ఆర్బిట్‌లోకి ప్రవేశించే క్రమంలో తీసిన విడియోను ఇస్రో విడుదల చేసింది.
ఆగస్ట్ 9: చంద్రయాన్-3,174 కి.మీ. x 1,437 కి.మీ.లకు కక్ష్యను తగ్గించుకుంది.
ఆగస్ట్ 14: సర్క్యులేషన్ కక్ష్య దశలో ఉంది. అప్పుడు 151 కి.మీ. x 179 కి.మీ. కక్ష్యలో తిరిగింది.
ఆగస్ట్ 16: చంద్రయాన్ 153 కి.మీ. x 163 కి.మీ. కక్ష్యలోకి దిగింది.
ఆగస్ట్ 17: ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విజయవంతంగా వేరయింది.
ఆగస్ట్ 19: ఇస్రో ల్యాండర్ మాడ్యూల్‌ను డీ బూస్టింగ్ చేస్తూ కక్ష్యను కుదించింది. అప్పుడు ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడిపై 113 కి.మీ. x 157 కి.మీ. కక్ష్యలో తిరిగింది.
ఆగస్ట్ 20: మరో డీబూస్టింగ్ ప్రక్రియను ల్యాండర్ మాడ్యూల్ నిర్వహించింది. ఈ క్రమంలో ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడికి దగ్గరగా 25 కి.మీ. x 134 కి.మీ.ల కక్ష్యలోకి ప్రవేశించింది.
ఆగస్ట్ 21: చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రయాన్-2 ఆర్బిటార్ ‘వెల్‌కం బడ్డీ’ అంటూ లాంఛన ఆహ్వానం పలికింది. దీంతో మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ (MOX) ఇప్పుడు ల్యాండర్ మాడ్యూల్‌తో పరస్పర సంబంధాలు నెలకొల్పుకున్నది.
ఆగస్ట్ 22: చంద్రుడిపై 70 కిమీ దూరంలో ఉన్న చంద్రయాన్-3 ల్యాండర్ పోజిషన్ డిటెక్షన్ కెమెరా చిత్రీకరించిన జాబిల్లి ఫొటోలను ఇస్రో విడుదల చేసింది.
ఆగస్ట్ 23: అనుకున్న విధంగానే చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై దక్షిణ దృవ ప్రాంతంలో సాయంత్రం 6.04 గంటలకు విజయవంతంగా ల్యాండ్ అయింది.
చంద్రయాన్ 3 సక్సెస్ దేశానికి గర్వకారణం: సీఎం కేసీఆర్
విధాత: చంద్రయాన్ 3 విజయవంతం కావడం దేశానికి గర్వకారణమని, ఇది ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ సందర్భం అని సీఎం కేసీఆర్ అన్నారు. విక్రమ్ ల్యాండర్ సేఫ్ లాండింగ్ తో చంద్రయాన్ 3 ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.
చంద్రుని దక్షిణ ధ్రువం మీదకు లాండర్ మాడ్యూల్ ను విజయవంతంగా చేర్చిన మొట్ట మొదటి దేశంగా, ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత దేశం సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని, అరుదైన చరిత్రను సృష్టించిందని, సీఎం తెలిపారు.
ఈ సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇస్రో, శాస్త్రవేత్తలకు, సిబ్బందికి, ఈ ప్రయోగం విజయవంతం కావడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. చిరకాల ఆకాంక్ష నెరవేరిన సందర్భంలో యావత్ భారతదేశ ప్రజలకు ఇది పండుగ రోజని సీఎం అన్నారు.
భవిష్యత్ లో ఇస్రో చేపట్టబోయే అంతరిక్ష పరిశోధనలకు, ప్రయోగాలకు చంద్రయాన్ 3 విజయం గొప్ప ప్రేరణినిస్తుందని సీఎం పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, దేశ కీర్తి ప్రతిష్టలను మరింతగా పెంచే దిశగా, అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో తన విజయపరంపరను కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
చంద్రయాన్ 3 సక్సెస్ పై రేవంత్‌రెడ్డి హర్షం
విధాత : చంద్రయాన్ 3 విజయవంతం పట్ల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్ 3 సక్సెస్ చేసిన ఇస్రో శాస్త్ర వేత్తలను అభినందించారు. ఇది భారత దేశ చారిత్రాత్మకమైన ఘట్టమని, ఇస్రో చరిత్రలో ఇదొక శుభ దినమని ప్రశంసించారు.
ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలించడం వారిలో మరింత ఆత్మవిశ్వాసం పెంచిందన్నారు. మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు స్థాపించిన ఇస్రో ప్రపంచ చరిత్రలో ఇంతటి ఘనవిజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.