స‌ముద్రంలోకి చ‌మురు లీక్‌

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీసీఎల్‌) శుద్ధి కర్మాగారం నుంచి పెద్ద ఎత్తున‌ లీకైన చ‌మురు స‌ముద్రంలోకి చేరింది

స‌ముద్రంలోకి చ‌మురు లీక్‌
  • 20 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల మేర వ్యాపించిన తెట్టు
  • వేల‌ సంఖ్యలో చ‌నిపోయిన జలచరాలు, చేప‌లు
  • సీపీసీఎల్ శుద్ధి క‌ర్మాగారం నుంచి ఆయిల్ లీక్‌
  • మైచాంగ్ తుఫానుతో న‌ది నుంచి స‌ముద్రంలోకి


విధాత‌: చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీసీఎల్‌) శుద్ధి కర్మాగారం నుంచి పెద్ద ఎత్తున‌ లీకైన చ‌మురు స‌ముద్రంలోకి చేరింది. ఇటీవ‌ల త‌మిళ‌నాడును అత‌లాకుత‌లం చేసిన మైచాంగ్ తుఫాను వరద నీటిలో చమురు కలిసి కోసస్తలైయార్ న‌ది ద్వారా స‌ముద్రంలోకి చేరింది. చెన్నై ఆయిల్ తెట్టు 20 చదరపు కిలోమీటర్ల మేర సముద్రంలో వ్యాపించిన‌ట్టు కోస్ట్‌గార్డు అధికారులు తెలిపారు.


కోసస్తలైయార్ నది అంతటా చమురు తేలుతున్న‌ది. స‌ముద్ర తీరప్రాంతం వెంబడి అనేక ప్రాంతాల్లో తారు బంతులు, మందపాటి నూనె పొరలు కనిపిస్తున్నాయి. ఒడ్డున, ఫిషింగ్ బోట్లలో చమురు క‌నిపిస్తున్న‌ది. వేల‌ సంఖ్యలో జలచరాలు, చేప‌లు చ‌నిపోయాయి. త‌మ బ‌తుకుదెరువు దూర‌మైంద‌ని మత్స్య‌కారులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


ఆయిల్ హాట్ స్పాట్ల‌ను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సీపీసీఎల్ అధికారులను ఆదేశించింది. సీపీసీఎల్ కంపెనీ నుంచి ఆయిల్ లీక్‌కు గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని కోరింది. మైచాంగ్ తుపాను కారణంగా వచ్చిన వరదల్లో చమురు కూడా ఇళ్లలోకి ప్రవేశించ‌డంతో ప్రజలు శ్వాసకోశ, చ‌ర్మ‌, ఇన్ఫెక్షన్ల సమస్యల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఆయిల్ లీక్ కార‌ణంగా ఆస్తి నష్టం లేదా అనారోగ్యానికి గురైన వారికి పరిహారం అందించడానికి తాము ప్ర‌య‌త్నిస్తామ‌ని అధికారులు తెలిపారు.