తెలంగాణ మట్టిబిడ్డ DGP మహేందర్ రెడ్డి ఇంటికా.. ప్రగతి భవన్‌కా?
DGP Mahender Reddy | విదాత: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం మరో నెలన్నర రోజుల్లో ముగియనుంది. డిసెంబర్ 31వ తేదీన ఆయన పదవీ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి దారెటు అని తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు. పదవీ విరమణ పొందిన అనంతరం ప్రశాంత జీవనం గడుపుతారా? లేక కేసీఆర్ చెప్పినట్టు రాజకీయాల్లోకి వస్తారా? లేక ప్రభుత్వానికి సలహాదారుగా ఉండి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు అవుతారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో.. […]

DGP Mahender Reddy | విదాత: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం మరో నెలన్నర రోజుల్లో ముగియనుంది. డిసెంబర్ 31వ తేదీన ఆయన పదవీ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి దారెటు అని తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు. పదవీ విరమణ పొందిన అనంతరం ప్రశాంత జీవనం గడుపుతారా? లేక కేసీఆర్ చెప్పినట్టు రాజకీయాల్లోకి వస్తారా? లేక ప్రభుత్వానికి సలహాదారుగా ఉండి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు అవుతారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో.. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కర్త, రూపకర్త మహేందర్ రెడ్డినే అని నాడు కేసీఆర్ ప్రశంసించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ ఉంది. ఆయన ఏదో రూపంలో తెలంగాణకు సేవ చేస్తూనే ఉండాలి. ఒక వేళ డ్రస్సు మారినా ఆయన సేవ మాత్రం మారదు అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసి.. అందరి దృష్టిని ఆకర్షించారు.
అయితే కేసీఆర్, మహేందర్ రెడ్డి సఖ్యత తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి ఇంటికా? ప్రగతి భవన్‌కా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మహేందర్ రెడ్డి నేపథ్యాన్ని పరిశీలిస్తే.. రాష్ట్ర రెండో డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాకుండా తెలంగాణ మట్టిబిడ్డ. ఐపీఎస్ సాధించిన తర్వాత మొదటి పోస్టింగ్ కూడా కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా. ఆయన సేవలన్నీ తెలంగాణలోనే కొనసాగాయి. కర్నూల్ జిల్లా ఎస్పీగా కొంతకాలం మాత్రమే పని చేశారు.
వారికి సముచిత స్థానం.. మరి మహేందర్ రెడ్డికి..?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ శర్మ, తొలి డీజీపీగా సేవలందించిన అనురాగ్ శర్మలు పదవీ విరమణ పొందిన అనంతరం.. వారిని ప్రభుత్వ సలహాదారులుగా సీఎం కేసీఆర్ నియమించారు. వారి సేవలను ఉపయోగించుకుంటున్నారు. తర్వాత సీఎస్‌లుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్ చంద్ర, ఎస్పీ సింగ్, ఎస్‌కే జోషిలకు ఎలాంటి సముచిత స్థానం కల్పించలేదు.
ఇక డీజీపీల విషయానికి వస్తే అనురాగ్ శర్మను ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ తెలంగాణేతరులే అయినప్పటికీ వారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు కేసీఆర్. మరి తెలంగాణ మట్టి బిడ్డ అయిన మహేందర్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తారా? లేదా? అన్నది చర్చానీయాంశమైంది. గతంలో చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ కట్టుబడి ఉంటారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
గతంలో మహేందర్ రెడ్డిపై కేసీఆర్ ప్రశంసలు..
ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మహేందర్ రెడ్డిపై కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కర్త, రూపకర్త మహేందర్ రెడ్డినే అని ప్రశంసించారు. నిజం చెప్పాలంటే పొగడ్తలు నాకు అందించారు. కానీ ఈ పొగడ్తకు అర్హులు మహేందర్ రెడ్డినే అని సీఎం పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించాలన్న ఆలోచన వారిదే. అనేక సందర్భాల్లో అనేక విషయాలు చర్చిస్తున్నప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. అనేక సందర్భాల్లో జరిగిన చర్చల్లో పటిష్టమైన పద్ధతుల్లో ఏ విధంగా ముందుకు పోవాలని చర్చించాం. మహేందర్ రెడ్డి ఆలోచన మేరకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించాం. ఈ ఏడాది డిసెంబర్‌లో డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ ఉంది ఆయన ఏదో రూపంలో తెలంగాణకు సేవ చేస్తూనే ఉండాలి. ఒక వేళ డ్రస్సు మారినా ఆయన సేవ మాత్రం మారదు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మహేందర్ రెడ్డిని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారనే చర్చ అప్పట్లో జరిగింది. ప్రస్తుతం ఇదే చర్చ మళ్లీ జరుగుతోంది. అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. మొత్తంగా ఈ అంశానికి తెర పడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.