Medak: వ్యవసాయాన్ని పండగగా మార్చిన CM KCR: మంత్రి హరీష్‌రావు

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి.. అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి హరీష్‌రావు టెలీకాన్ఫరెన్స్…. పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్ల‌వాత్మకమైన చర్యల వల్ల వ్యవసాయం పండుగగా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, సాగునీటి వసతి వల్ల పంట సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు, పంట దిగుబడి […]

Medak: వ్యవసాయాన్ని పండగగా మార్చిన CM KCR: మంత్రి హరీష్‌రావు
  • ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి..
  • అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి హరీష్‌రావు టెలీకాన్ఫరెన్స్….
  • పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్ల‌వాత్మకమైన చర్యల వల్ల వ్యవసాయం పండుగగా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, సాగునీటి వసతి వల్ల పంట సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు, పంట దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు.

తెలంగాణ రాకముందు 2014 లో యాసంగి వరి సాగు 12 లక్షల ఎకరాలుంటే నేడు అది 56.54 లక్షల ఎకరాలకు విస్తరించిందని, దేశంలో యాసంగిలో ఇంత పెద్ద‌ మొత్తంలో వరి సాగు ఏ రాష్ట్రంలో కూడా జరగ‌లేదని అన్నారు. యాసంగి 2023 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పకడ్బందీగా నిర్వహించుటకు తీసుకోవలసిన చర్యలపై గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ 2014లో రూ.3392 కోట్ల ధాన్యం సేకరిస్తే నేడు రూ.26,600 కోట్లకు చేరిందని అన్నారు. ఈ యాసంగిలో రాష్ట్రంలో 80 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొని 7000 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు.

ఒక్క మెదక్ జిల్లాలోనే 2 లక్షల 60 వేల ఎకరాల్లో పంట సాగయ్యిందని, ఎకరాకు 24 క్వింటాళ్ల పంట చొప్పున 6 లక్షల 19 వేల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. ఇందులో సొంత వినియోగం, ప్రైవేటు అమ్మకం పోను కొనుగోలు కేంద్రాల వద్దకు నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని, ఈ పంటను కొనుగోలు చేయడం మన లక్ష్యమని, దీన్నిసకాలంలో సజావుగా పూర్తి చేయుటలో అధికారాలు, ప్రజాప్రతినిధులు కంకణబద్దులై పనిచేయాలని కోరారు.

ప్రభుత్వం మద్దతు ధరకు రైతుల నుండి ప్రతి గింజ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, రైతులు నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా కేంద్రాలకు ధాన్యం తెచ్చేలా వ్యవసాయాధికారులు అవగాహన కలిగించాలన్నారు. అదేవిధంగా అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఎత్తైన ప్రాంతంలో ధాన్యం కుప్పలు పోయాలని, కల్లం లలో ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకురావాలన్నారు.

ప్రతి కేంద్రంలో ప్యాడి క్లీనర్లు, వేయింగ్ మిషన్లు, మాయిశ్చర్ మీటర్లు, టార్పలిన్స్, అవసరమైన గన్ని బ్యాగులు ముందస్తుగా సమకూర్చుకోవాలని అన్నారు. గొనె సంచుల కొరత లేకుండా అవసరానికి తగ్గట్టుగా PPC కేంద్రాలకు సరఫరా చేయాలన్నారు. అదేవిధంగా రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్లు, PACS, IKP, గన్నీ బ్యాగ్ సరఫరాదారులతో, పోలీసులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని మైక్రో లెవల్ ప్లానింగ్ సిద్దం చేసుకోవాలని మంత్రి సూచించారు.

వేసవి నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద నీడ‌ కల్పించే విధంగా షామియానా, తాగు నీటి వసతి కల్పించాలని సూచించారు. రైతులు నష్టపోకుండా ఉండాలంటే తాళ్లు లేకుండా ఆరబెట్టిన ధాన్యం కేంద్రాలకు తెచ్చేలా అవగాహన కలిగించాలన్నారు. పర్యవేక్షణకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని కలెక్టర్‌కు సూచించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వీలైనంత త్వరగా రైస్ మిల్లులకు తరలించి అకనాలెడ్జ్మెంట్ ఇస్తూ ట్యాబ్ ఎంట్రీ చేసి రైతులకు త్వరగా డబ్బులు చెల్లించే విధంగా చూడాలన్నారు.

రైస్ మిల్లులలో ధాన్యం వెంటనే దించుకునే విధంగా అంకితభావంతో పనిచేసే హమాలీలను అధిక సంఖ్యలో పెట్టుకునేలా చూడాలని, తరుగు పేరుతో ఏ మాత్రం కోత విధించడానికి వీలులేదని స్పష్టం చేశారు. సి.ఏం.ఆర్. పెట్టని మిల్లులకు ధాన్యం ఇవ్వొద్దని, బాగా పని చేస్తున్న నిఖార్సైన మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించాలని, అవసరం అయితే Intermediate Godowns ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు.

ఎక్కడా తరుగు వస్తున్నదనే మాట రాకుండా కొనుగోలు జరగాలని, రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందని అన్నారు. ఏమైనా సమస్యలుంటే కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేసేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ధాన్యం లోడింగ్ వేగంగా అయ్యేలా చూడాలని, ఎలాంటి కోతలు విధించరాదని అన్నారు. ప్రతి రోజు అధికారులు రెండు లేదా మూడు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. వ్యవసాయ శాఖ అందించిన క్రాప్ బుకింగ్ ఆధారంగా కొనుగోలు చేయడం ద్వారా సరిహద్దు ప్రాంతాల నుండి వచ్చే ధాన్యాన్ని అరికట్టవచ్చని, ఇందుకు పోలీసు, సివిల్ సప్లయిస్, రెవెన్యూ విభాగాలతో సమన్వయం చేసుకొని కట్టుదిట్టమైన నిఘా పెట్టాలన్నారు.

రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సంయమనం, ఓపిక పాటించాలని రైతులకు అవగాహన కలిగిస్తూ చిన్న చిన్న సమస్యలను తక్షణం పరిష్కరించుకుంటూ నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనుగోలు పక్రియ పూర్తి చేయాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశామని అన్నారు. లారీలు, గోనె సంచులు సమస్య ఉత్పన్నం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రికి వివరించారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఏం.పి . కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్ , భూపాల్ రెడ్డి ,ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, రెడ్డి, జిల్లా పరిషద్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, రైస్ మిల్లుల సంఘం అధ్యక్షులు చంద్ర పాల్, మునిసిపల్ చైర్మన్లు, రైతు సేవా సమితి అధ్యక్షులు, జిల్లా అధికారులు శ్రీనివాస్, కరుణ, ఆశా కుమారి, డిఆర్ డిఓ శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారులు, వ్యవసాయాధికారులు, ఆర్.డి.ఓ.లు, తహసీల్ధార్లు, ఎంపిడిఓలు , ఎంపీఓ లు, ఐకెపి సిబ్బంది, పాక్స్ చైర్మన్లు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు, జెడ్పిటిసిలు, ఎంపిపిలు తదితరులు పాల్గొన్నారు.