New Secretariat | తెలంగాణ పాలనా సౌధం ప్రారంభం.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా..
New Secretariat | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశం గర్వించ తగిన స్థాయిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరిట నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సచివాలయ నూతన భవంతిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రారంభించారు. తొలుత నూతన సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అక్కడి యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి సచివాలయం ప్రధాన ద్వారానికి […]

New Secretariat |
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశం గర్వించ తగిన స్థాయిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరిట నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సచివాలయ నూతన భవంతిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రారంభించారు. తొలుత నూతన సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అక్కడి యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు.
అక్కడి నుంచి సచివాలయం ప్రధాన ద్వారానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. రిబ్బన్ కట్ చేసి సచివాలయంలోకి అడుగు పెట్టారు. తన ఛాంబర్ లోకి వెళ్లిన ముఖ్యమంత్రి.. కేసీఆర్ పోడు భూముల పంపిణీ పై తొలి సంతకం చేశారు. మరోవైపు వివిధ శాఖల మంత్రులు కూడా తమ తమ చాంబర్లకు చేరుకుని ఫైళ్లపై సంతకాలు చేస్తూ తమ విధులను ప్రారంభించారు.
సొంత స్థలం ఉన్నవారికి డబుల్ ఇండ్లపై కేటీఆర్ సంతకం
సొంత స్థలం ఉన్న ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పై మంత్రి కేటీఆర్ తొలి సంతకం చేశారు. హోం మంత్రి మహమూద్ అలీ..రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేసిన పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఫైలుపై సంతకం చేయగా జంట నగరాల్లోని హిందూ దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల ఫైల్ పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతకం చేశారు. శ్రమశక్తి అవార్డుల ఫైలు పై మంత్రి మల్లారెడ్డి సంతకం చేశారు.
అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం పంపిణీ పై మంత్రి గంగుల కమలాకర్ సంతకం చేయగా, రెండవ విడత దళిత బంధు పథకం ఫైలు పై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతకం చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సీతారామ ప్రాజెక్టు ఫైలు పై సంతకం చేయగా, కొత్త మండలాలకు ఐకెపి భవన నిర్మాణాల అనుమతి ఫైలుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకం చేశారు.
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.. అంగన్వాడీ కేంద్రాల్లో ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసున్న చంటి పిల్లలకు ఉచితంగా పాలు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ఫైలు పై సంతకం చేయగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లు చెరువులలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి ఉద్దేశించిన ఫైలుపై సంతకం చేశారు.
ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు
నూతన సచివాలయం ఆవరణలో ఆదివారం తెల్లవారుజాము నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. వేద పండితులు హోమాలు, పూజలు ప్రారంభించారు. అయితే సీఎం తన చైర్‌లో ఆశీనులు అయ్యే సమయంలో మంత్రులకు, ఉన్నతాధికారులకు అనుమతి లేదు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా అదే సమయంలో తమకు కేటాయించిన చాంబర్లలో ఆశీనులు అయి పలు దస్త్రాలపై సంతకాలు చేసి పరిపాలనను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1:58 గంటల నుంచి 2:04 గంటల మధ్య ముగించాలని ఆదేశించింది.
ఈ ప్రక్రియ ముగియగానే మంత్రులు, ఉన్నతాధికారులు నేరుగా గ్రౌండ్ ఫ్లోర్‌లోని సమావేశ ప్రాంతానికి చేరుకుని, తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. మధ్యాహ్నం 2:15 గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సచివాలయ సిబ్బంది మధ్యాహ్నం 12:30 గంటలకే సమావేశ ప్రాంతానికి చేరుకునేలా అన్ని విభాగాల కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.