తెలంగాణ సెక్రటేరియట్ హౌసింగ్ సొసైటీ పర్సన్ ఇన్‌చార్జ్‌లపై రగడ
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత సొసైటీకి ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్ ఇన్‌చార్జ్‌లతో పదేళ్లు నెట్టుకొచ్చేశారు. కోర్టుల్లో కేసులు, పునర్విభజన చట్టం అడ్డంకులు వంటి కారణాల మూలంగా ఎన్నికలు జరగలేదు. దీన్ని సాకుగా చూపి పదేళ్లు గతంలో ఎన్నికైన తెలంగాణ సచివాలయం సంఘం పెద్ద ఎన్నికలు జరపలేదనే వాదనలు కూడా ఉన్నాయి.

- పదేళ్లుగా సొసైటీకి ఎన్నికలు లేవు
- పర్సన్ ఇన్‌చార్జ్‌లతో నడిపించేశారు
- తాజాగా ముగ్గురి పేర్లను ప్రతిపాదించిన
తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ - పరిగణనలోకి తీసుకోని అధికారులు
- సెక్రటేరియట్ గెజిటెడ్ ఆఫీసర్స్
అసోసియేషన్ లేఖ పరిగణనలోకి - ఆ అసోసియేషన్‌కు గుర్తింపే లేదు
ఎలా పరిగణనలోకి తీసుకున్నారని ప్రశ్నలు
హైదరాబాద్‌లోని ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మ్యుచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ పర్సన్ ఇన్‌చార్జ్‌ల ఎంపికపై రగడ మొదలైంది. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా ఏ ప్రాతిపదికన ముగ్గురు పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమిస్తారని వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మూడు కీలక ప్రాంతాల్లో ఉద్యోగులకు భూములు
ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మ్యుచువల్టీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సొసైటీకి నగరం చుట్టూ మూడు ప్రాంతాల్లో ప్రభుత్వం భూములను కేటాయించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయించారు. అయితే ఇంటి స్థలాలు రాష్ట్ర విభజనకు ముందే లాటరీ విధానంలో ఉద్యోగులకు కేటాయిస్తూ అప్పగించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత సొసైటీకి ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్ ఇన్‌చార్జ్‌లతో పదేళ్లు నెట్టుకొచ్చేశారు. కోర్టుల్లో కేసులు, పునర్విభజన చట్టం అడ్డంకులు వంటి కారణాల మూలంగా ఎన్నికలు జరగలేదు. దీన్ని సాకుగా చూపి పదేళ్లు గతంలో ఎన్నికైన తెలంగాణ సచివాలయం సంఘం పెద్ద ఎన్నికలు జరపలేదనే వాదనలు కూడా ఉన్నాయి. కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ప్రకారం హౌసింగ్ సొసైటీ సభ్యుల హక్కులను కాపాడాల్సిన, సమర్థవంతంగా సేవలు అందించేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికార యంత్రాంగంపై ఉంది. మూడేళ్లకు మించి పర్సన్ ఇన్‌చార్జిలను కొనసాగించడానికి అవకాశమే లేదు. ప్రభుత్వ అనుమతితో మరో మూడేళ్లు పొడిగించవచ్చు. హౌసింగ్ సొసైటీ సభ్యుల హక్కులను పరిరక్షించేందుకు, సజావుగా పాలన సాగించేందుకు ముగ్గురిని పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ ఈ నెల 22న వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శికి లేఖ అందచేసింది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిప్యూటీ సెక్రటరీ ఆర్ శోభన్ బాబు, సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) అసిస్టెంట్ సెక్రటరీ ఎం సురేందర్ రెడ్డి, సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) సెక్షన్ ఆఫీసర్ ఎన్ విజయ సింహను నియమించాల్సిందిగా ఆ లేఖలో తెలియచేసింది. కాగా అంతకు ముందే మరో సంఘం ముగ్గురి పేర్లతో మరో సిఫారసు లేఖను అందచేసింది.
సెక్రటేరియట్ అసోసియేషన్ లేఖ బుట్టదాఖలు
బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ అందచేసిన లేఖను వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. కొత్తగా పుట్టుకువచ్చిన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇచ్చిన లేఖను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర సహకార శాఖ రిజిస్ట్రార్ కు సిఫారసు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే సెక్రటేరియట్ అసోసియేషన్ నాయకులు కార్యదర్శి వద్దకు వెళ్లి తీవ్ర అసహనం, అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ గుర్తింపు లేని, కేవలం 175 మంది సభ్యులు ఉన్న అసోసియేషన్ లేఖను ఎలా పరిగణనలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. సిఫారసు చేసిన మూడు పేర్లను వెనక్కి తీసుకోవాలని, ఆ అసోసియేషన్ కు హక్కు లేదని వివరించారు. గత ప్రభుత్వంలో తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ సిఫారసుతో సాధారణ పరిపాలన విభాగం సెక్షన్ ఆఫీసర్ షేక్ యూసుఫ్ మియా, మరో సెక్షన్ ఆఫీసుర్ కే మనోహర్ రావు, ఆర్థిక శాఖలో సెక్షన్ అసిస్టెంట్ ఎస్ ముఖేష్ సింగ్‌ను ఎలా ఎంపిక చేశారని ప్రశ్నించారు. అప్పుడు సిఫారసు చేసిన విధంగానే ఇప్పుడు కూడా తాము ప్రతిపాదించిన ముగ్గురిని పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని అసోసియేషన్ కోరింది. అయినప్పటికీ సెక్రటరీ వినిపించుకోకపోవడంతో, సెక్రటేరియట్ అసోసియేషన్ కార్యవర్గం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.