ఈడీయే జడ్జి.. ఈడీయే జ్యూరీ, ఈడీయే తలారి

ఈడీయే జడ్జి.. ఈడీయే జ్యూరీ, ఈడీయే తలారిగా మారిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు.

ఈడీయే జడ్జి.. ఈడీయే జ్యూరీ, ఈడీయే తలారి
  • ఎన్నికల్లో నా ప్రచారాన్ని అడ్డుకునేందుకే అరెస్ట్‌
  • ఎన్నికలకు ముందే ఎందుకు అరెస్టు చేయలేదు?

న్యూఢిల్లీ: ఈడీయే జడ్జి.. ఈడీయే జ్యూరీ, ఈడీయే తలారిగా మారిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తాను ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు ఎన్నికలకు ముందు తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. గురువారం రాత్రి అరెస్టయిన కేజ్రీవాల్‌ను శుక్రవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించారు. ఎన్నికల దాకా ఎందుకు ఆగారు? ఎన్నికలకు ముందే ఎందుకు అరెస్టు చేయలేదు? అని ప్రశ్నించారు.


‘సమన్ల విషయంలో ఈడీ ఫిర్యాదు కేసులో నేను బెయిల్‌పై విడుదలయ్యాను. అప్పుడు ఈడీయే జడ్జి.. ఈడీయే జ్యూరీ, ఈడీయే తలారిగా మారింది. అదే రోజు నోటీసులు జారీ చేసింది’ అని కేజ్రీవాల్‌ తరఫున విక్రమ్‌ చౌదరి పేర్కొన్నారు. ‘రిమాండ్‌ రిపోర్టులో మొదటి వాక్యంలో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ ప్రధాన సూత్రధారి అని పేర్కొన్నారు. కానీ జనవరిలో నన్ను సీఎంగా పిలవడం లేదని చెప్పారు’ అని పేర్కొన్నారు. ‘నేను వ్యక్తిగతంగా హాజరవడం ద్వారా కోర్టుకు సహకరించాను. కోర్టు నిర్ణయం తీసుకునేందుకే నేను సహకరించాను.


క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థ పరిపాలన ప్రమాదంలో ఉన్నది. నిన్న నా విషయం హైకోర్టు ముందు ఉన్నది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని హైకోర్టు పేర్కొన్నది. కానీ.. గంటల వ్యవధిలోనే నన్ను అరెస్టు చేశారు’ అని తెలిపారు. ‘నేను ఏం ఇవ్వాలో దయచేసి చెప్పాలని రాజ్యాంగయుతంగా ఎన్నికైన ఒక వ్యక్తి ఈడీని అడిగారు. నన్నెందుకు ప్రశ్నిస్తున్నారనే సీఎం వారిని అడిగారు’ అని కేజ్రీవాల్‌ తరఫున చౌదరి అన్నారు.


ఒక దశలో తనను నిలువరించేందుకు అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు ప్రయత్నించగా.. ‘లాయర్ల వాక్‌స్వాతంత్ర్యాన్ని మీరు గుంజుకుంటున్నారు. మీరు భయపడుతున్నారా?’ అని చౌదరి ప్రశ్నించారు. ‘జనవరి 12న నాకు సీఎం హోదాలో కాకుండా వ్యక్తిగతంగా సమన్లు ఇచ్చారు. నేను నిందితుడిని కాదు’ అని కేజ్రీవాల్ తరఫున చౌదరి చెప్పారు. నా నుంచి ఏం రికవరీ చేశారు? నా దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా. అది సెల్‌ఫోన్‌. ఆ పని ముందే చేయలేరా సూత్రధారి అని చెబుతున్న వ్యక్తి వారి వద్ద సమాచారం అంతా ఉన్నది. కొత్తగా వెలుగులోకి రావాల్సింది ఏమీ లేదు’ అని పేర్కొన్నారు.


అరెస్టు చేయాల్సిన అవసరమేంటి?: సింఘ్వి


కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాల్సిన అవసరమేంటో ఈడీ చెప్పాలని ఆయన తరఫున వాదించిన సీనియర్‌ అడ్వొకేట్‌ అభిషేక్‌ మను సింఘ్వి అన్నారు. సొమ్ము జాడ కనిపెట్టడానికి అరెస్టు ప్రాతిపదిక కాబోదని, అది ప్రశ్నావళికి మాత్రమే ప్రాతిపదిక అవుతుందని పేర్కొన్నారు. ‘మీవద్ద ప్రాథమిక సమాచారం ఉండగా కస్టోడియల్‌ కస్టడీని మీరు ఎందుకు కోరుతున్నారు? అని సింఘ్వి ఈడీని నిలదీశారు.


భద్రతపై సందేహాలు


ఇదిలా ఉంటే ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ భద్రతపై తమకు సందేహాలు ఉన్నాయని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు చెప్పారు. బీజేపీ కుట్రపూరితంగా కేజ్రీవాల్‌ను అరెస్టు చేయించిందని ఆరోపించారు. కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ శుక్రవారం కూడా ఆందోళనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనలతో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌ సమస్యలు ఎదురయ్యాయి.