హెచ్చార్డీలోనే క్యాంప్ కార్యాలయం: సీఎం రేవంత్ రెడ్డి
శాసన సభ కోసమో..ఇతర కార్యాలయాల కోసమో ఎలాంటి కొత్త భవనాలు నిర్మించబోమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

- భారీ బంగ్లాలు కట్టం… కొత్త కార్లు కొనం
- హెచ్చార్డీలోనే సాదాసీదా ఇల్లు కడతాం
- హైదరాబాద్‌లోనే 24 గంటల కరెంటు
- 12 గంటలకు మించి ఇవ్వడం లేదు
- రాయదుర్గం మెట్రో కొనసాగింపు దండగ
- మీడియాతో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి
విధాత, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్చార్డీ)లో ఒక ఎకరం స్థలం ఖాళీగా ఉందని, అక్కడే సాదాసీదాగా సీఎం క్యాంప్ కార్యాలయం నిర్మించుకుని ఉంటానని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ వాయిదా తరువాత రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఆధునిక హంగులు, ఆర్భాటాలతో బహుళ అంతస్తుల భవనం నిర్మించుకోవాలనే ఆలోచన తనకు లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సాదాసీదా భవనం సరిపోతుందని చెప్పారు. బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవనంలో ఇంకో భవనం ఖాళీగా ఉందని, దాన్ని మరో మంత్రికి కేటాయిస్తామని తెలిపారు. అదే విధంగా మంత్రుల కోసం కొత్తగా కార్లను కొనుగోలు చేయడం లేదని కూడా రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం మినహా రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదన్నారు.
మండల కేంద్రాలు, గ్రామాలలో 12, 13 గంటలకు మించి విద్యుత్ ఇవ్వడం లేదని ఆయన వివరించారు. పాత అసెంబ్లీ భవంతిలో శాసన మండలి సమావేశాలు జరుగుతాయని, అసెంబ్లీ భవనంలో శాసన సభ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పార్లమెంటు తరహాలో అసెంబ్లీ పరిసరాలు ఉండబోతున్నాయని రేవంత్ తెలిపారు. వీటి కోసం కొత్తగా భవనాలు నిర్మించడం లేదని చెప్పారు.
గత బీఆరెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, పథకాలపై శాఖలవారీగా శ్వేతపత్రాలు రూపొందించాలనే యోచనలో ఉన్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అవసరమైనప్పుడు వాటిని ప్రజల ముందుంచుతామని చెప్పారు. రాయదుర్గం నుంచి అప్పా మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు ప్రతిపాదించిన మెట్రో రైలు ప్రజలకు అంతగా ఉపయోగం ఉండదని రేవంత్‌రెడ్డి చెప్పారు.
ఇప్పటికే ఆ మార్గంలో అవుటర్ రింగ్ రోడ్డు ఉన్నందున పాతబస్తీలో మెట్రోను పొడిగించి శంషాబాద్ వరకు తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా, అక్కడి నుంచి చంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్ పోర్టు వరకు అలైన్ మెంట్ ఉండనున్నదని చెప్పారు. ఈ మార్గం పై ప్రతిపాదనలు రూపొందించాల్సిందిగా మున్సిపల్ వ్యవహారాల శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.