పథకాల లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదా? రేవంత్ క్లారిటీ
ప్రజాపాలన సభల్లో పథకాల కోసం కొత్త వారే దరఖాస్తులు చేసుకోవాలని, ఇప్పటికే లబ్ధిదారులుగా ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు
- దరఖాస్తులు విక్రయిస్తే కఠిన చర్యలు
విధాత: ప్రజాపాలన సభల్లో అభయ హస్తం పథకాల కోసం కొత్త వారే దరఖాస్తులు చేసుకోవాలని, ఇప్పటికే లబ్ధిదారులుగా ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో ‘ప్రజా పాలన’ దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలనపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తులు విక్రయిస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నామన్నారు.
రైతుభరోసా, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ‘ప్రజా పాలన’ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ‘ప్రజా పాలన’ దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ‘ప్రజా పాలన’ క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు సీఎం మరోసారి స్పష్టంగా సూచించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram