తెలంగాణకు పట్టిన చీడ, పీడ.. కమీషన్ల కేసీఆర్: రేవంత్ రెడ్డి

  • By: krs    latest    Oct 01, 2023 9:49 AM IST
తెలంగాణకు పట్టిన చీడ, పీడ.. కమీషన్ల కేసీఆర్: రేవంత్ రెడ్డి
  • తెలంగాణకు పట్టిన చీడ, పీడ కమీషన్ల కేసీఆర్
  • నిరుద్యోగుల జీవితాల‌తో బీఆరెస్ చెల‌గాటం
  • అయ్యకు కాళేశ్వరం, కొడుక్కు టీఎస్పీఎస్సీ,
  • కవితకు సింగరేణి ఏటీఎంగా మారాయి..
  • టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి

విధాత‌, హైద‌రాబాద్‌: తెలంగాణకు పట్టిన చీడ, పీడ కమీషన్ల కేసీఆర్ అని, అయ్యకు కాళేశ్వరం, కొడుక్కు టీఎస్పీఎస్సీ, కవితకు సింగరేణి ఏటీఎంగా మారాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై జరిగిన నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. గుమస్తా స్థాయి లేని వారు గ్రూప్-1 పరీక్ష ఎలా నిర్వహిస్తారని ప్ర‌శ్నించారు. రాజకీయాల్లో పదవులు ఇవ్వలేని వారికి బోర్డు సభ్యులుగా నియమించారని ఆరోపించారు.




నియామకాల్లో అవకతవకలపై ఉద్యమిస్తూనే ఉన్నామ‌ని, టీఎస్పీఎస్సీని ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకుందని విమ‌ర్శించారు. గ్రూప్ -1 ప‌రీక్ష‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఐటీ మంత్రి అని చెప్పుకునే క‌మీష‌న్ల తారాక‌రామారావు ఏం స‌మాధానం చెబుతార‌ని మండిప‌డ్డారు. నిరుద్యోగుల జీవితాలతో చెలాగాటమాడిన కేసీఆర్ ను గద్దె దించాలన్నారు. పేప‌ర్ లీకేజీ నిర్ల‌క్ష్యానికి సీఎం కేసీఆర్ కార‌ణ‌మ‌ని విమ‌ర్శించారు. రాజకీయ ఖాళీలు భర్తీ చేసే కేసీఆర్, ఉద్యోగ నియామకాలు ఎందుకు చేయరని ధ్వ‌జ‌మెత్తారు.




నియామకాలు చేపట్టాల్సిన బోర్డులోనే శాశ్వత నియామకాలు లేవని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ అవకతవకలకు మూలాలైన‌ సీఎంవో అధికారులు రాజశేఖర్ రెడ్డి, లింగారెడ్డిల‌ను ఎందుకు అరెస్టు చేయలేద‌ని ప్ర‌శ్నించారు. టీఎస్పీఎస్సీ పరిణామాలపై సీఎం ఎందుకు సమీక్ష చేయలేదన్నారు. టీఎస్పీఎస్సీ రద్దు కాదు, కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమ‌న్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని, తక్షణమే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.




ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప, కనీస మానవత్వం లేదని, ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలాగాటమాడుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిరుద్యోగుల నిరసనతో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేస్తామ‌ని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామ‌ని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.