Peddapally: పత్తి రైతుల ఆందోళన.. ఒక్క రోజులో క్వింటాల్ పత్తికి రూ.1000 తగ్గిన ధర

మరో 50 రూపాయలు అదనంగా చెల్లిస్తామన్న వ్యాపారులు అంగీకరించని రైతులు విధాత బ్యూరో, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రైతులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో బుధవారం పత్తి రేటు గణనీయంగా తగ్గడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఎదురుగా రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. దీనితో రాజీవ్ రహదారిపై రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి ఎస్సై కే రాజేష్ ఆధ్వర్యంలో […]

Peddapally:  పత్తి రైతుల ఆందోళన.. ఒక్క రోజులో క్వింటాల్ పత్తికి రూ.1000 తగ్గిన ధర
  • మరో 50 రూపాయలు అదనంగా చెల్లిస్తామన్న వ్యాపారులు
  • అంగీకరించని రైతులు

విధాత బ్యూరో, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రైతులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో బుధవారం పత్తి రేటు గణనీయంగా తగ్గడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఎదురుగా రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. దీనితో రాజీవ్ రహదారిపై రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

పెద్దపల్లి ఎస్సై కే రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి ఆందోళనకారులను శాంతింప చేసి వ్యవసాయ మార్కెట్ అధికారులతో చర్చలు జరిపారు. బుధవారం నిర్ణయించిన పత్తి రేటుకు అదనంగా మరో 50 రూపాయలు చెల్లిస్తామని వ్యాపారులు తెలిపారు. అందుకు రైతులు అంగీకరించలేదు. దీనితో మళ్లీ రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రైతుల ఆందోళనలో బీఎస్పీ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మాట్లాడుతూ పత్తి రేటు తగ్గించడంతో ఆందోళన చేపట్టామని అన్నారు. అధికారులు మాట్లాడతామని చెప్పి కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి ఉష మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి సమక్షంలో ఈరోజు ఉదయం జిన్నింగ్ మిల్లు యజమానులు, ఖరీదు దారులు, కమిషన్ ఏజెంట్లు సమావేశమై మార్కెట్ నిర్వహణ‌పై చర్చించుకున్నారు. రైతులు పత్తికి నీళ్లుచల్లి మార్కెట్ కు తీసుకురావద్దని, తేమ 8 నుండి 12 శాతం లోపే ఉండాలని, యంత్రాల ద్వారా తేమను రికార్డు చేస్తామని, పత్తి బస్తా 70 కిలోలలోపు ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఈ సమావేశ ఫలితమే ఈరోజు మార్కెట్లో పత్తి రేటు గణనీయంగా తగ్గటానికి కారణమని పలువురు రైతులు పేర్కొన్నారు. నిన్నటికి ఈరోజుకు క్వింటాలుకు వెయ్యి రూపాయలు తేడా ఉండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ అధికారులు, జిన్నింగ్ మిల్ యజమానులు, ఖరీదుదారులు, కమిషన్ ఏజెంట్లు కుమ్మక్కై పత్తి రేటు గణనీయంగా తగ్గించార‌ని రైతులు ఆరోపిస్తున్నారు.