Rahul Gandhi | రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ

Rahul Gandhi విధాత: కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు రాహుల్ గాంధీపై వేసిన అన‌ర్హ‌త‌ను ఎత్తివేసిన‌ట్లు లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్ సోమ‌వారం ప్ర‌క‌టించింది. దీంతో రాహుల్ మ‌ళ్లీ లోక్‌స‌భ‌లో అడుగు పెట్ట‌నున్నారు. రాహుల్‌పై అన‌ర్హ‌త ఎత్తివేయ‌డంతో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా రాహుల్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. సుప్రీం స్టే త‌రువాత లోక్ స‌భ‌ రాహుల్ గాంధీనీ లోక్ స‌భ స‌భ్యునిగా తిరిగి పున‌రుద్దిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. పార్ల‌మెంట్‌కు వ‌చ్చిన రాహుల్ గాంధీ విగ్ర‌హానికి పూల‌మాల […]

Rahul Gandhi | రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ

Rahul Gandhi

విధాత: కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు రాహుల్ గాంధీపై వేసిన అన‌ర్హ‌త‌ను ఎత్తివేసిన‌ట్లు లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్ సోమ‌వారం ప్ర‌క‌టించింది. దీంతో రాహుల్ మ‌ళ్లీ లోక్‌స‌భ‌లో అడుగు పెట్ట‌నున్నారు. రాహుల్‌పై అన‌ర్హ‌త ఎత్తివేయ‌డంతో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా రాహుల్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.

సుప్రీం స్టే త‌రువాత లోక్ స‌భ‌ రాహుల్ గాంధీనీ లోక్ స‌భ స‌భ్యునిగా తిరిగి పున‌రుద్దిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. పార్ల‌మెంట్‌కు వ‌చ్చిన రాహుల్ గాంధీ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళి అర్పించారు. అనంత‌రం కాంగ్రెస్ స‌భ్యులు, ఇత‌ర స‌భ్యులు రాహుల్ గాంధీకి స్వాగ‌తంప‌లికారు. సుప్రీం తీర్పు త‌రువాత ఏఐసీసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. మిఠాయిలు తినిపించి శుభాకాంక్ష‌లు తెలిపుకున్నారు. రాహుల్ గాంధీ త‌న సామాజిక మాధ్య‌మాల ఖాతాలో త‌న ప్రొఫైల్‌లో బ‌యోను మార్చుకున్నారు. ఇంత‌కు ముందు అన‌ర్హ‌త పార్ల‌మెంటు స‌భ్యునిగా ఉన్న పేరును మార్చుతూ పార్ల‌మెంటు స‌భ్యునిగా మార్చారు.

మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్య‌ల కేసులో రాహుల్‌కు దిగువ‌స్థాయి కోర్టు విధించిన 2 ఏండ్ల జైలు శిక్ష‌పై సుప్రీంకోర్టు స్టే విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాహుల్ స‌భ్య‌త్వాన్ని లోక్‌స‌భ స‌చివాల‌యం పున‌రుద్ద‌రించింది. దీంతో లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. లోక్‌స‌భ స‌భ్య‌త్వాన్ని పున‌రుద్ధ‌రించ‌డంతో.. రాహుల్ నేటి నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు హాజ‌రు కానున్నారు. మోదీ స‌ర్కార్‌పై ప్ర‌తిప‌క్షాలు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానంపై జ‌రిగే చ‌ర్చ‌లో రాహుల్ పాల్గొన‌నున్నారు. ఈ చ‌ర్చ ఆగ‌స్టు 8 నుంచి జ‌ర‌గ‌నుంది.

అసలేం జ‌రిగిందంటే..?

2019 సాధార‌ణ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్య‌ల‌పై గుజ‌రాత్‌లో కేసు న‌మోదైంది. ఈ కేసులో ఈ ఏడాది మార్చి 23న సూర‌త్‌లోని సెష‌న్స్ కోర్టు రాహుల్‌కు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. తీర్పు వెలువ‌డిన 24 గంట‌ల్లోపే లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్ రాహుల్‌పై అన‌ర్హ‌త వేటు వేసింది.

ఈ తీర్పుపై అహ్మ‌దాబాద్ హైకోర్టులో రాహుల్‌కు ఊర‌ట ల‌భించ‌క‌పోవ‌డంతో.. ఆయ‌న ఇటీవ‌ల సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. రాహుల్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు ఆగ‌స్టు 4వ తేదీన ఆయ‌న జైలు శిక్ష‌పై స్టే విధిస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో అన‌ర్హ‌త ముప్పు నుంచి రాహుల్ బ‌య‌ట‌ప‌డ్డారు. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే సాధార‌ణ ఎన్నిక‌ల్లోనూ రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు మార్గం సుగ‌మ‌మైంది.

అయితే ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టం ప్ర‌కారం.. రెండేండ్లు అంత‌కంటే ఎక్కువ కాలం జైలు శిక్ష ప‌డితే.. ఆ తీర్పు వ‌చ్చిన రోజు నుంచే అన‌ర్హ‌త అమ‌ల్లోకి వ‌స్తుంది. దీంతో స‌ద‌రు స‌భ్యుడి స‌భ్య‌త్వం ర‌ద్దు అవుతుంది. అంతేగాక జైలు నుంచి విడుద‌లైన త‌ర్వాత మ‌రో ఆరేండ్ల పాటు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి వీలుండ‌దు.