Congress | రాజస్థాన్‌లో గెలుపే ముఖ్యం.. ముఖ్యమంత్రిపై తర్వాతే నిర్ణయం
Congress సీఎం ఎవరనేది ఆ తర్వాతే నిర్ణయం రాష్ట్ర నాయకులతో అధిష్ఠానం భేటీ గెహ్లాట్, పైలట్ మధ్య సయోధ్యకు కృషి జైపూర్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజస్థాన్‌లో ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి తీరాలని, అందుకు తగిన విధంగా వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆ రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసింది. ‘కలిసికట్టుగా పోరాడాలని, కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకున్నారు’ అని సమావేశం అనంతరం పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాష్ట్రంలో […]

Congress
- సీఎం ఎవరనేది ఆ తర్వాతే నిర్ణయం
- రాష్ట్ర నాయకులతో అధిష్ఠానం భేటీ
- గెహ్లాట్, పైలట్ మధ్య సయోధ్యకు కృషి
జైపూర్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజస్థాన్‌లో ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి తీరాలని, అందుకు తగిన విధంగా వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆ రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసింది. ‘కలిసికట్టుగా పోరాడాలని, కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకున్నారు’ అని సమావేశం అనంతరం పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.
రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ తీసుకువెళ్లేందుకు ఇంటింటి ప్రచారాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్టు ఆయన చెప్పారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రానున్న 90 రోజులు పార్టీ నాయకులు ప్రజల్లో ఉంటారని వివరించారు.
ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ సుఖ్‌జిందర్ రణ్‌ధావా, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటాస్రా, సచిన్‌పైలట్ తదితరులు పాల్గొన్నారు. కాలి గాయంతో చికిత్స పొంది, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలుస్తున్నది.
ముఖ్యమంత్రిపై తర్వాతే నిర్ణయం
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు.. ‘అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని మేం ప్రకటించం అన్న సంగతి మీకు తెలియంది కాదు. ఎన్నికలను కలిసికట్టుగా ఎదుర్కొంటాం’ అని ఆయన చెప్పారు. పార్టీలో అంతర్గత విషయాలపై మీడియాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దని గట్టిగా చెప్పామని తెలిపారు. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం కోసం త్వరలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటిస్తారని వేణుగోపాల్ చెప్పారు.
వసుంధరరాజె నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై గెహ్లాట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సచిన్‌పైలట్ ముఖ్యమంత్రిపై ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రద్దు చేసి, దానిని పునర్వ్యవస్థీకరించాలని, కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు.
పేపర్ లీక్ అక్రమాలపై చర్యలు తీసుకోవడమే కాకుండా.. బాధితులకు నష్టపరిహారం కూడా చెల్లించాలని పట్టుబడుతున్నారు. అయితే.. ఈ సమావేశానికి రెండు రోజుల ముందు మీడియాతో మాట్లాడిన సచిన్‌పైలట్.. రిక్రూట్‌మెంట్ పేపర్ల లీకేజీ కేసులో నిందితుకు గరిష్ఠంగా పదేళ్లు శిక్ష విధించే అంశంలో వచ్చే అసెంబ్లీలో తమ ప్రభుత్వం చట్టం తీసుకొస్తుందని చెప్పడం విశేషం.