లోక్‌సభ ఎన్నికలు.. శివసేన, కాంగ్రెస్ మధ్య విబేధాలు..!
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే కూటమిగా ఉన్న ఆయా పార్టీల మధ్య సీట్ల పంపకాలపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. అయితే మహారాష్ట్రలో శివసేన(యూబీటీ), కాంగ్రెస్ మధ్య స్వల్ప విబేధాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే లోక్‌సభ సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య బేదాభిప్రాయాలు ఏర్పడినట్లు సమాచారం. మహారాష్ట్రలో శివసేన(యూబీటీ), కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కూటమిగా ఉన్నాయి.
మొత్తం 48 ఎంపీ స్థానాలున్న మహారాష్ట్రలో తమకు 23 స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని శివసేన(యూబీటీ) ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. అయితే ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనకు మహారాష్ట్రలో సరిపోయినంత బలం లేదని, అభ్యర్థులు కూడా లేరనేది కాంగ్రెస్ అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో శివసేనకు అధికమొత్తంలో సీట్లు కేటాయించకపోవడం మంచిదనే అభిప్రాయానికి సీనియర్లు వచ్చినట్లు సమాచారం. శివసేన, ఎన్సీపీ కంటే కాంగ్రెస్ పార్టీకే మహారాష్ట్రలో మంచి ఫాలోయింగ్ ఉందని కాంగ్రెస్ లీడర్ సంజయ్ నిరూపం పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ లీడర్ అశోక్ చవాన్ మాట్లాడుతూ.. పార్టీల మధ్య సీట్ల పంపకాలపై కసరత్తు జరుగుతుందన్నారు. బలం లేని పార్టీలు అధిక సీట్లు అడగడం సమంజసం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో శివసేనకు 23 సీట్లు కేటాయించడం సరికాదన్నారు. శివసేనకు అభ్యర్థుల కొరత ఉందని ఆయన చెప్పారు.
ఇక గత వారం శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రే కలిసి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో చర్చలు జరిపారు. అయితే ఏ పార్టీ ఏయే స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదని సంజయ్ రౌత్ చెప్పారు.