సీనియర్ నేత కుట్రతో చేజారిన పీసీసీ పీఠం?.. ఒంటరైన జీవన్ రెడ్డి.. పొమ్మన లేక పొగ
ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వారసుడిగా సీనియర్ నాయకులు టీ.జీవన్ రెడ్డి లేదా జి.చిన్నారెడ్డికి పీసీసీ పదవి ఇవ్వాలని అధిష్టానం పెద్దలు అనుకున్నారని కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తున్నారు.
- సీనియర్ నేత కుట్రతో చేజారిన పీసీసీ పీఠం?
- రేవంత్ రెడ్డికి మార్గం సుగమం చేసింది ఆయనేనా!
- పీసీసీ సీటు ఎక్కలేకపోయిన జీవన్ రెడ్డి
- మావాడే అంటూ చిన్నారెడ్డి వైదొలిగారు
- వరుస అవమానాలతో ఉక్కిరి బిక్కిరి
విధాత, హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు తరువాత టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన రేవంత్ రెడ్డికి కొద్ది నెలలకే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేజిక్కించుకున్నారు. ఇలా పార్టీలో చేరి అలా పీసీసీ పీఠం దక్కించుకోవడం వెనకాల దక్షిణ తెలంగాణ సీనియర్ నేత అండదండలు ఉన్నాయని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జోరందుకున్నది. వాస్తవానికి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వారసుడిగా సీనియర్ నాయకులు టీ.జీవన్ రెడ్డి లేదా జి.చిన్నారెడ్డికి పీసీసీ పదవి ఇవ్వాలని అధిష్టానం పెద్దలు అనుకున్నారని కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తున్నారు. ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా సర్వశక్తులు ఒడ్డారు. అయితే అందుకు భిన్నంగా సీనియర్ నేత, కురువృద్ధుడి ప్రోద్బలంతో ఆ పదవిని రేవంత్ రెడ్డిని చేజిక్కించుకున్నారని, తమకు అన్యాయం జరిగిందని ఒక నేత తన స్నేహితుల ముందు కొద్ది రోజుల క్రితం వాపోవడం గమనార్హం. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అధీష్టించగా, ఆ ఇద్దరు నేతల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని, పార్టీలో, ప్రభుత్వంలో సముచిత గౌరవం లభించడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక నేత అయితే పార్టీ ఉండాలా, పోవాలా అనే విధంగా పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనంత తానే వెళ్లిపోయేలా పొగబెడుతున్నారని కార్యకర్తల ముందు ఆవేదన వ్యక్తం చేయడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.
ఉత్తమ్ వారసుడిగా పలువురి పేర్లు తెరమీదికి
పీసీసీ అధ్యక్షుడిగా ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సుధీర్ఘకాలం పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన స్థానంలో కొత్తగా నియమించే వారిపై 2021లో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అన్వేషించారు. పార్టీకి విధేయంగా పనిచేస్తున్న సీనియర్ నేతలు, ప్రాంతాలు, కులాల వారీగా ఆరా తీయగా. పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్న రాష్ట్ర నాయకులు ఎవరికి వారుగా కొందరి పేర్లను సూచించారు. వారిలో కరీంనగర్ జిల్లా కు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు టీ.జీవన్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జీ.చిన్నారెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు కే.జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు మరికొందరు పేర్లు తెరమీదికి వచ్చాయి.
సాగర్ ఉప ఎన్నిక ఓటమితో జానారెడ్డి ఆశలు గల్లంతు
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అకాల మరణంతో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. 2021 ఏప్రిల్ నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో నర్సింహ్మయ్య కుమారుడు భగత్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కే.జానారెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి భగత్, జానారెడ్డి పై 18,872 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఉప ఎన్నికకు రెండు మూడు నెలల ముందుగా పీసీసీ అధ్యక్షుడి పీఠంపై ఎవరిని నియమించాలనే దానిపై ఢిల్లీ పార్టీ పెద్దలు వివరాలు సేకరించారు. ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, పార్టీకి విధేయతతో పనిచేసే వారు ఇలా పలు వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించగా, ఆ సమయంలో కే.జానారెడ్డి ని కూడా ఢిల్లీ దూతలు సంప్రదించినట్లు సమాచారం. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని, ఆ తరువాత పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని జానారెడ్డి ఢిల్లీ పెద్దలకు వివరించడంతో ఎంపిక తాత్కాలికంగా వాయిదా పడిందంటున్నారు. ఈ లోపు ఉప ఎన్నికల పోలింగ్ జరగడం, ఫలితాలు వెలువడడం, బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. జానారెడ్డి ఓటమి పాలు కావడంతో అధిష్టానం కూడా ఆయన విషయంలో పునరాలోచనలో పడిందని కాంగ్రెస్ నాయకులే అప్పట్లో చర్చించుకున్నారు.
ప్రత్యర్థులకు దక్కకుండా రేవంత్ ను రంగంలోకి
తనకు దక్కని పీసీసీ పీఠం పదవి ప్రత్యర్థులకు రాకుండా చేసేందుకు రేవంత్ రెడ్డిని పురమాయించారని అంటున్నారు. పీసీసీ పీఠం కోసం ప్రయత్నాలు చేసుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డికి సూచించారని గాంధీ భవన్ వర్గాలు అంగీకరిస్తున్నాయి. అధిష్టానం పెద్దల వద్ద రేవంత్ కు అనుకూలంగా చక్రం తిప్పారని, ఆయనకే పదవి దక్కేలా చక్రం తిప్పారంటున్నారు. జానారెడ్డి తనదైన శైలిలో రాజకీయం చేశారని ఒక నాయకుడు పేర్కొన్నారు. అయితే అప్పటికే రేసులో ఉన్న చిన్నారెడ్డి, మా జిల్లా వాడే పీసీసీ అధ్యక్షుడు అవుతున్నాడంటూ వెనక్కి తగ్గాడని మరో సీనియర్ నేత పేర్కొన్నారు. అయితే జీవన్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తనవంతు ప్రయత్నాలు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి బలం ముందు జీవన్ రెడ్డి నిలబడలేకపోయారని సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అన్నీ అనుకూలించడంతో రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. 2021 జూలై నెలలో నాంపల్లిలోని గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. రేవంత్ రెడ్డి నియామకంపై అసంతృప్తితో ఉన్న వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీ వీ.హన్మంతరావు, అప్పటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గాంధీ భవన్ కార్యక్రమానికి రాలేదు. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఒకరిద్దరు సీనియర్ నేతలను నిద్రపట్టకుండా చేస్తున్నాయనేది అందరికీ తెలిసిందే. పార్టీలో ఉండలేని పరిస్థితులను కల్పిస్తున్నారనే కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తుండడం విశేషం.
జగిత్యాలలో సత్తా నిరూపించుకున్న జీవన్ రెడ్డి
జగిత్యాల నియోజకవర్గం నుంచి ఓడిపోయిన జీవన్ రెడ్డి పార్టీకి ఇప్పటికీ విధేయుడిగానే పనిచేస్తున్నారు. అదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సన్నిహితంగా ఉంటున్నారు. ఇది నచ్చని జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వైఖరి పై ఆగ్రహంతో కుతకుతలాడుతున్నారు. మొన్న జరిగిన జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గం వారిని బరిలో నిల్చోబెట్టి ప్రజల్లో తనకున్న సత్తా ఏంటో నిరూపించారు. మున్సిపాల్టీలో మొత్తం 50 వార్డులు ఉండగా 45 వార్డులలో తన వర్గం వారిని బరిలో నిలిపారు. కాంగ్రెస్ పార్టీ బీ పారం ఇచ్చిన 15 వార్డులలో జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించకుండా, స్వతంత్రులుగా నిల్చోబెట్టిన 30 వార్డులలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. మొత్తంగా 18 మంది అభ్యర్థులను గెలిపించుకుని సత్తా నిరూపించారు. సంజయ్ కుమార్ 19 మందిని గెలిపించుకున్నారు. మాజీ అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా తన వర్గం వారిని గెలిపించుకుని స్థానికంగా తన పట్టు ఏమాత్రం తగ్గలేదని పార్టీ పెద్దలకు సంకేతాలు పంపించారు.
పొమ్మనలేక పొగబెడుతున్నారా
పార్టీలో ఉండాలా వద్దా అనే విధంగా పరిస్థితులు చుట్టుముడుతుండడంతో జీవన్ రెడ్డి భవితవ్యం గందరగోళ పరిస్థితుల్లో ఉందని సీనియర్ నాయకులు వాపోతున్నారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదని, ఇప్పటికీ సామాన్య నాయకుడిగా ప్రజల్లో తిరుగుతారని, పీసీసీ పీఠం వరకు వెళ్లిన నాయకుడిని పొమ్మన లేకుండా పొగపెడుతున్నారని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. పార్టీలో కొనసాగడంపై ఆలోచన చేస్తున్నానని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సంచలనం రేపాయి. పార్టీలో ఇంకెంతకాలం అవమానం భరించాలని ఆయన ప్రశ్నించడం కాంగ్రెస్ కార్యకర్తలను ఆందోళనకు గురిచేసింది. ఆయనకు అవమానం జరగకుండా చూడాలని, పార్టీ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేసి అండగా ఉన్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మీనాక్షీ నటరాజన్ కు గత నెలలో విన్నవించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు అన్యాయం చేయడం, అవమానాలకు గురి చేయడం సరికాదన్నారు. ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా కాంగ్రెస్ నే నమ్ముకుని పనిచేశారని, అలాంటి నేతకు సముచితమైన గౌరవం ఇవ్వాలని కోరారు.
సీనియార్టీకి గుర్తింపు లేదా
ఇక చిన్నారెడ్డి విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆయన వనపర్తి అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించగా లభించలేదు. గెలుపొందితే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే ముందు చూపుతో టికెట్ నిరాకరించారని వనపర్తి కార్యకర్తలు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. అయితే పదవికి తగ్గట్టుగా ఆయనకు సముచితమైన గౌరవం లభించడం లేదని అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన ఆయనకు పదవి అలంకారప్రాయమే కాని నియోజకవర్గ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదంటున్నారు. ప్రజా వాణిలో కంప్యూటర్ల కోసం ఆయన ఆర్థిక శాఖ అధికారులతో పలుమార్లు సంప్రదించిన సందర్భాలు ఉన్నాయంటే, ఏ పాటి గౌరవం లభిస్తుందో అర్థమవుతుందని ఒక నాయకుడు వెల్లడించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా తన సిఫారసులకు విలువ ఇవ్వడం లేదని, ఇలా అయితే ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలంటూ తన అనూయాయుల ముందు వాపోయినట్లు గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram