తెలంగాణ‌లో 82 మంది ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు..

తెలంగాణ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆస్తులు, క్రిమిన‌ల్ కేసులు, ఇత‌ర‌త్రా విష‌యాల‌ను ఏడీఆర్ వెల్ల‌డించింది.

  • By: Somu    latest    Dec 06, 2023 11:22 AM IST
తెలంగాణ‌లో 82 మంది ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు..

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆస్తులు, క్రిమిన‌ల్ కేసులు, ఇత‌ర‌త్రా విష‌యాల‌ను ఏడీఆర్ వెల్ల‌డించింది. 119 మంది ఎమ్మెల్యేల్లో 114 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వ‌రులు అని తేల్చింది ఏడీఆర్. ఇక 119లో 82 మంది ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదైన‌ట్లు ఆ నివేదిక వెల్ల‌డించింది. సీరియ‌స్ క్రిమిన‌ల్ కేసులు 59 మంది ఎమ్మెల్యేల‌పై ఉన్నాయి. ఈ వివ‌రాలను అభ్య‌ర్థుల ఆఫిడ‌విట్‌ల ఆధారంగా ఏడీఆర్ వెల్ల‌డించింది. 2018 ఎన్నిక‌ల ఆఫిడ‌విట్‌ల‌ను ప‌రిశీలిస్తే 73 మంది ఎమ్మెల్యేల‌పై మాత్ర‌మే క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయ్యాయి.


ఒక ఎమ్మెల్యేపై మ‌ర్డ‌ర్ కేసు ఉండ‌గా, ఏడుగురిపై హ‌త్యాయ‌త్నం కేసులు న‌మోదైన‌ట్లు వెల్ల‌డించింది. ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌పై మ‌హిళల‌ను వేధించిన కేసులు న‌మోదు అయ్యాయి. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేల్లో 51 మంది క్రిమిన‌ల్ కేసుల‌ను ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ నుంచి 19, బీజేపీ నుంచి ఏడుగురు, సీపీఐ నుంచి ఒక‌రు, ఎంఐఎం నుంచి న‌లుగురు ఎమ్మెల్యేలపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఏడీఆర్ రిపోర్టు వెల్ల‌డించింది. సీరియ‌స్ క్రిమిన‌ల్ కేసుల విష‌యానికి వ‌స్తే.. కాంగ్రెస్ నుంచి 31 మంది, బీఆర్ఎస్ నుంచి 17 మంది, బీజేపీ నుంచి ఏడుగురు, సీపీఐ నుంచి ఒక‌రు, ఎంఐఎం నుంచి ముగ్గురు ఉన్నారు