దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం..? పాకిస్తాన్‌లో చికిత్స..!
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్పత్రి పాలయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పాకిస్తాన్ కరాచీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

ఇస్లామాబాద్ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్పత్రి పాలయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పాకిస్తాన్ కరాచీలోని ఓ ఆస్పత్రిలో ఇబ్రహీం చికిత్స పొందుతున్నారు. అయితే దావూద్‌పై విష ప్రయోగం జరిగిందని వార్తలు షికారు చేస్తున్నాయి. విష ప్రయోగాన్ని అటు వైద్యులు కానీ, ఇటు దావూద్ కుటుంబ సభ్యులు కానీ ధృవీకరించలేదు.
ఆస్పత్రి పాలైన దావూద్ ఇబ్రహీం మరో రెండు రోజుల పాటు చికిత్స పొందనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. దావూద్ చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దావూద్ ఉన్న ఫ్లోర్‌లో ఆయన ఒక్కరే చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. కేవలం ఆస్పత్రి వర్గాలు, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ ఫ్లోర్‌లోకి అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది.
దావూద్ ఇబ్రహీం ఆస్పత్రి పాలైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఇబ్రహీం ఆరోగ్య పరిస్థితిపై వివరాలను తెలుసుకునేదుకు అతని బంధువులైన అలిసాహ్ పర్కర్, సాజిద్ వాగ్లేను ముంబై పోలీసులు సంప్రదించారు. ఎందుకంటే 1993 ముంబై పేలుళ్ల ప్రణాళిక, అమలులో అతని ప్రమేయం ఉందనే ఆరోపణలలో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడిగా దావూద్ ఇబ్రహీం ఉన్నారు. కరాచీలో దావూద్ ఇబ్రహీం ఉన్నాడని భారత్ సాక్ష్యాధారాలను సమర్పించినప్పటికీ, పాకిస్తాన్ అతనికి తాము ఆశ్రయం ఇవ్వలేదని తిరస్కరిస్తూ వస్తోంది. 2008లో 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులకు దావూద్ ఇబ్రహీం దేశ ఆర్థిక రాజధానిలో తన నెట్‌వర్క్ ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసినట్లు భారత ప్రభుత్వం ఆరోపించింది.
అయితే దావూద్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలో ఉంటున్నట్టు ఆయన సోదరి హసీనా పర్కర్ కుమారుడు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కు ఈ ఏడాది జనవరిలో తెలిపాడు. కరాచీ ఎయిర్‌పోర్టులో దావూద్ ఇబ్రహీంతో పాటు అతని ముఖ్య అనుచరులను నియంత్రించాలని ఎన్ఐఏ తన ఛార్జీషీటులో పేర్కొంది.