LK Adavani | అస్వస్థతకు గురైన ఎల్‌కే అద్వానీ.. అపోలో ఆసుపత్రిలో చికిత్స..!

LK Adavani | బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన బుధవారం రాత్రి అపోలో ఆసుపత్రిలో చేర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 96 సంవత్సరాల అద్వానీ ఇటీవల ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) చేరిన విషయం తెలిసిందే.

LK Adavani | అస్వస్థతకు గురైన ఎల్‌కే అద్వానీ.. అపోలో ఆసుపత్రిలో చికిత్స..!

LK Adavani | బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన బుధవారం రాత్రి అపోలో ఆసుపత్రిలో చేర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 96 సంవత్సరాల అద్వానీ ఇటీవల ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) చేరిన విషయం తెలిసిందే. పలు ఆరోగ్య పరీక్షలు, చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జి అయ్యారు. తాజాగా మరోసారి అస్వస్థతకు గురైన అద్వానీ అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం స్థిరంగా ఉండగా.. వైద్యుల పరిశీలనలో ఉన్నారు. ఆయనకు న్యూరాలజీ విభాగం సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ వినిత్‌ సూరి ఆధ్వర్యంలో ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. ఆయన రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఆయన అస్వస్థతకు గురవడానికి కారణాలు తెలియరాలేదు.

దేశ విభజన అనంతరం ముంబయికి..

అద్వానీ విషయానికి వస్తే ఆయన 1927 నవంబర్‌ 8న ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న కరాచీలో జన్మించారు. కరాచీలోనే ఉన్న సెయింట్‌ పాట్రిక్స్‌ హైస్కూల్‌లో అద్వానీ పాఠశాల విద్య అభ్యసించారు. 1941లో పద్నాలుగేళ్ల వయసులో అద్వానీ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్‌‌)లో చేరారు. 1947లో ఆర్ఎస్ఎస్ కరాచీ విభాగం కార్యదర్శిగా పని చేశారు. పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో ఉన్న డీజీ నేషనల్‌ కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు. దేశ విభజన అనంతరం ఆయన కుటుంబం పాకిస్థాన్‌ను విడిచి ముంబయికి వచ్చింది. 1951లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జన్ సంఘ్ స్థాపించారు. అప్పటి నుంచి ఆయన 1957 వరకు ఆ పార్టీ కార్యదర్శిగా కొనసాగారు. తొలుత రాజస్థాన్‌లో సంఘ్‌ ప్రచారక్‌గా సేవలందించారు. 1957లో ఢిల్లీకి వెళ్లి జన్‌సంఘ్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. అద్వానీ 1965 ఫిబ్రవరి 25న కమల అద్వానీని వివాహం చేసుకున్నారు.

జన సంఘ్‌ అధ్యక్షుడిగా..

1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కౌన్సిల్‌ మధ్యంతర ఎన్నికల్లో అద్వానీ గెలిచారు. 1967లో ఆ కౌన్సిల్‌ చైర్మన్‌గా గెలుపొందారు. 1970-72లో భారతీయ జనసంఘ్‌ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా నియామకమయ్యారు. అద్వానీ 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. 1973 నుంచి 1977 వరకు జన్ సంఘ్ అధ్యక్షుడిగా అద్వానీ పనిచేశారు. 1976లో గుజరాత్‌ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు. 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ పార్టీ ప్రభుత్వంలో 1977-79 మధ్య కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా సేవలందించారు. 1980లో జనతా పార్టీ ఓటమి పాలైన అనంతరం రాజ్యసభలో కొంతకాలం పాటు ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. 1980 ఏప్రిల్‌ 6న వాజ్‌పేయీతో కలిసి భారతీయ జనతా పార్టీని అద్వానీ స్థాపించారు. 1982లో మధ్యప్రదేశ్‌ నుంచి మూడోసారి రాజ్యసభకు అద్వానీ ఎన్నికయ్యారు.

రామ మందిరం ఉద్యమాన్ని ముందుండి నడిపిన నేత

అద్వానీ 1980 నుంచి 1986 వరకు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 1986 నుంచి 1991 వరకు బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. 1990వ దశకంలో అయోధ్య రామజన్మభూమి ఉద్యమాన్ని అద్వానీ ముందుండి నడిపారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి అయిన సెప్టెంబర్ 25న 1990వ సంవత్సరంలో సోమ్‌నాథ్ నుంచి రథయాత్ర ప్రారంభించారు. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్‌పేయీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది. 1998లో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి అద్వానీ గెలిచారు. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో అద్వానీ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. లోక్‌సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా సేవలందించారు.

క్రియాశీల రాజకీయాలకు దూరం..

2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అద్వానీ పోటీచేశారు. కానీ, ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైంది. 2014లో మరోసారి గాంధీనగర్‌ నుంచి అద్వానీ గెలిచినప్పటికీ.. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. అద్వానీ తన కెరీర్‌లో మూడుసార్లు బీజేపీ అధ్యక్షుడిగా, ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా, నాలుగు సార్లు రాజ్యసభ ఎంపీగా సేవలందించారు. ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ 1999లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అద్వానీకి అందజేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఏడాది అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న పురస్కారంతో సత్కరించారు.