Imran Khan: పాక్‌ జైల్లో.. ఇమ్రాన్‌ ఖాన్‌ హత్య? నిజమా? నకిలీనా?

  • By: sr    news    May 10, 2025 8:56 PM IST
Imran Khan: పాక్‌ జైల్లో.. ఇమ్రాన్‌ ఖాన్‌ హత్య? నిజమా? నకిలీనా?

ఒకవైపు భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన నుంచి తేరుకోకముందే.. పాకిస్తాన్‌లో మరో సంచలన వార్త వైరల్‌ అయింది. అది.. పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌.. జైల్లో చనిపోయారనేది. ఈ విషయంలో భిన్న కథనాలు వెలువడుతున్నాయి. ఇమ్రాన్‌ఖాన్‌ ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. జ్యుడిషయల్‌ కస్టడీలో ఉండగా ఆయన అనుమానాస్పద రీతిలో చనిపోయారని ఒక లేఖ వైరల్‌ అయింది.

పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ లెటర్‌హెడ్‌గా భావిస్తున్నదానిపై వచ్చిన ఈ లేఖలో.. ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్టు, ఆయన మరణంపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపిస్తామని రాసి ఉన్నది. అయితే.. దీనిపై విశ్వసనీయ ధృవీకరణలు ఇంకా లభించడం లేదు. ఇమ్రాన్‌ లీగల్‌ టీమ్‌ నుంచి లేదా ఆయన రాజకీయ పార్టీ పీటీఐ నుంచి కానీ ఈ వార్త పోస్ట్‌ చేసే సమయానికి ఎలాంటి స్పందనలు రాలేదు. ఇది నకిలీది అయి ఉండొచ్చనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

ప్రధాన మీడియాలో కాకుండా.. సామాజిక మాధ్యమాల్లోనే ఈ వార్త చక్కర్లు కొడుతుండటం విశేషం. అయితే.. ఆయన చక్కగానే ఉన్నారని పాక్‌ మీడియా చెబుతున్నది. ఫేక్‌ వార్తలను వైరల్‌ చేసి, పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం సృష్టించేందుకు భారతదేశం నుంచి నడుస్తున్న కుట్ర ఇదని కొన్ని పాక్‌ మీడియా సంస్థలు ఆరోపించాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.