అమెరికాలో తొలిసారి నైట్రోజన్‌తో మరణశిక్ష.. చావు అత్యంత భయంకరం!
అమెరికాలో తొలిసారి కొత్త పద్ధతిలో మరణశిక్షను అమలు చేయనున్నారు. నైట్రోజన్ వాయువును ఉపయోగించి ప్రాణాలు తీసే పద్ధతిని అలబామా అమలు చేయనుంది.

విధాత: అమెరికాలో తొలిసారి కొత్త పద్ధతిలో మరణశిక్షను అమలు చేయనున్నారు. నైట్రోజన్ వాయువును ఉపయోగించి ప్రాణాలు తీసే పద్ధతి (Nitrogen Hypoxia) ని అలబామా రాష్ట్రం మరో నెల రోజుల్లో అమలు చేయనుంది. ఈ పద్ధతిలో మరణశిక్షను అమలు చేయడానికి ఫెడరల్ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ రకంగా మరణశిక్ష అమలు చేయనున్న దేశంగా అమెరికా (America) నిలవనుంది.
కెన్నెత్ స్మిత్ అనే నేరస్థునిపై ఈ శిక్షను అమలుచేయనుండగా అతడి తరఫు న్యాయవాదులు ఫెడరల్ కోర్టులో దీనిని సవాలు చేశారు. నైట్రోజన్ ద్వారా మనిషి ప్రాణాలు తీయడం అత్యంత క్రూరమని.. పైగా పరిశోధనకు తమ క్లయింట్ను వాడుకుంటున్నారని వాదించారు. అయినప్పటికీ కోర్టు వీరి వాదనలు తోసి పుచ్చుతూ.. మరణాశిక్ష అమలుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పును తాము యూఎస్ సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నైట్రోజెన్ ఆధారిత మరణశిక్షను నిలిపివేసేలా ప్రయత్నిస్తామని న్యాయవాదులు తెలిపారు.
ఈ విధానంపై సంబంధిత అధికారులు మాట్లాడుతూ… నైట్రోజన్ గ్యాస్ ద్వారా అమలు చేసే మరణశిక్షలో ఖైదీకి ఆక్సిజన్, నైట్రోజన్ వాయువులు అందించే ఒక మాస్క్‌ను పెడతారు. తొలుత మామూలుగా ఆక్సిజన్ ను మాస్క్‌లోకి విడుదల చేస్తారు. కాసేపటికి ఖైదీకి తెలియకుండా ఆక్సిజన్‌ను నిలిపివేసి నైట్రోజన్‌ను వదులుతారు. ఆక్సిజన్ లేకపోవడం, నైట్రోజన్‌ను పీల్చుకోవడంతో ఖైదీ మరణిస్తాడు. దీనిని శాస్త్రీయంగా నైట్రోజన్ హైపోక్సియా అని పిలుస్తారు. అమెరికాలోని అలబామా, మిసిసిపీ, ఒక్లహామా రాష్ట్రాలు ఈ విధానాన్ని శాస్త్రీయమైనవిగా అంగీకరించాయి.
అయితే ఇప్పటి వరకు ఎవరిపైనా ఈ విధానాన్ని ప్రయోగించలేదు. ఒకవేళ స్మిత్‌కు ఈ శిక్షను అమలు చేస్తే ఇదే తొలి ఘటనగా నమోదయ్యే అవకాశముంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎలాంటి అధ్యయనం చేయని విధానాన్ని తమ క్లయింట్‌పై ప్రయోగిస్తున్నారని న్యాయవాదులు చెబుతున్నారు. వారు తమ వాదనకు బలం చేకూర్చేందుకు అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ 2020లో ఇచ్చిన మార్గదర్శకాలను ప్రస్తావిస్తున్నారు.
ఇందులో నైట్రోజన్ హైపాక్సియా అనేది పందులకు మాత్రమేనని.. మనిషి సహా ఇతర ప్రాణులకు ఇది అత్యంత భయానకమైన పరిస్థితిని కలగజేస్తుందని ఉంది. ఒక వేళ ఇది అమలు చేస్తే స్మిత్‌కు అత్యంత భయంకరమైన చావు సంభవిస్తుందని, అతడు నరకం చూస్తాడని యూఎన్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. 58 ఏళ్ల స్మిత్.. ఒక ఫాదర్ భార్యను హత్య చేసిన కేసులో దోషిగా తేలాడు. 1988లో ఈ హత్య జరగగా.. 2024లో మరణశిక్షను అమలు చేయనున్నారు.
అయితే స్మిత్‌కు సంబంధించి మరో ఆశ్చర్యకరమైన అంశాన్ని పోలీసులు పంచుకున్నారు. అతడికి 2022 నవంబరులో ఇంజక్షన్ ద్వారా మరణశిక్షను అమలు చేద్దామని ప్రయత్నించారు. అయినప్పటికీ ఇంట్రావెనోస్ నాళాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ఆ పద్ధతి విఫలమైంది. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకూ ఇంజక్షన్ విధానంలో మరణశిక్షను ఎదుర్కొని బతికి బయటపడ్డ వారిలో స్మిత్ రెండోవాడని పోలీసులు తెలిపారు.