18 ఏళ్లు దాటిన మహిళలందరికీ నెలకు వెయ్యి రూపాయలు.. ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం

ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిశి సోమవారం 2024-25 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీకి సమర్పించారు. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్‌ యోజన పేరిట కొత్త స్కీంను ప్రకటించారు

18 ఏళ్లు దాటిన మహిళలందరికీ నెలకు వెయ్యి రూపాయలు.. ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం

న్యూఢిల్లీ : ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిశి సోమవారం 2024-25 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీకి సమర్పించారు. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్‌ యోజన పేరిట కొత్త స్కీంను ప్రకటించారు. దీనికింద దేశ రాజధాని నగరంలో 18 ఏళ్ల వయసుపైబడిన మహిళలందరికీ నెలకు వెయ్యి రూపాయలు అందిస్తారు. రామరాజ్యం ఆదర్శాల స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అతిశి తెలిపారు. మొత్తం 76వేల కోట్లతో బడ్జెట్‌ను ఆమె సమర్పించారు.


ఇది ఆప్‌ ప్రభుత్వానికి పదో బడ్జెట్‌. కొత్త పథకాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా అమలు చేసేందుకు ఆప్‌ ప్రభుత్వం 2,714 కోట్లను కేటాయిస్తున్నట్టు అతిశి ఢిల్లీ అసెంబ్లీకి తెలిపారు. అయితే.. దీనికి మార్గదర్శకాలను ఇంకా రూపొందించాల్సి ఉన్నది. 18 ఏళ్లు నిండిన మహిళ బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ సొమ్మును జమ చేస్తారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ పథకం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఓటు హక్కు కలిగినవారికే ఇది వర్తిస్తుంది. ఇందుకోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.