Dharani | MEIL.. చేతికి ధ‌ర‌ణి? మేఘాకు మ‌రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు

Dharani | ధ‌ర‌ణిపై కుప్ప‌లు తెప్ప‌లుగా ఫిర్యాదులు ప్ర‌తిప‌క్షాల‌కు ఆయుధంలా ధ‌ర‌ణి ఎన్నికల అజెండాలో ఇప్పటికే చోటు నష్టనివారణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం (విధాత ప్రత్యేక ప్రతినిధి) తెలంగాణ‌లో భూ రికార్డుల స‌మీకృత‌ నిర్వ‌హ‌ణ కోసం రూపొందించిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణను మేఘా ఇంజ‌నీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ సంస్థ‌కు అప్ప‌గించ‌నున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ధ‌ర‌ణిపై నిత్యం భూ య‌జ‌మానుల నుంచి వ‌స్తున్న ఫిర్యాదులు, ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ పోర్ట‌ల్‌ను అత్యంత స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావించిందని […]

Dharani | MEIL.. చేతికి ధ‌ర‌ణి? మేఘాకు మ‌రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు

Dharani |

  • ధ‌ర‌ణిపై కుప్ప‌లు తెప్ప‌లుగా ఫిర్యాదులు
  • ప్ర‌తిప‌క్షాల‌కు ఆయుధంలా ధ‌ర‌ణి
  • ఎన్నికల అజెండాలో ఇప్పటికే చోటు
  • నష్టనివారణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం

(విధాత ప్రత్యేక ప్రతినిధి)
తెలంగాణ‌లో భూ రికార్డుల స‌మీకృత‌ నిర్వ‌హ‌ణ కోసం రూపొందించిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణను మేఘా ఇంజ‌నీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ సంస్థ‌కు అప్ప‌గించ‌నున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ధ‌ర‌ణిపై నిత్యం భూ య‌జ‌మానుల నుంచి వ‌స్తున్న ఫిర్యాదులు, ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ పోర్ట‌ల్‌ను అత్యంత స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావించిందని సమాచారం.

ఇన్నాళ్లు విదేశీ కంపెనీల చేతుల్లో ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో పెట్టి చేతులు కాల్చుకున్న కేసీఆర్ ప్ర‌భుత్వం, ఇక‌పై దీని నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను అంత‌ర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న తెలుగు కంపెనీ మేఘా ఇంజ‌నీరింగ్ సంస్థ‌కు ఇవ్వ‌డానికి నిర్ణ‌యం జ‌రిగిన‌ట్లు తెలుస్తున్నది. కొద్దిరోజుల్లోనే అధికారిక ఉత్త‌ర్వులు వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని పేరు వెల్ల‌డించ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఒక స‌చివాల‌య అధికారి చెప్పారు.

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ నుంచి మేఘా వరకు..

తెలంగాణ ప్ర‌భుత్వం రెవెన్యూ శాఖ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌ను మొద‌ట ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ (ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియ‌ల్ సర్వీసెస్‌) సంస్థ‌కు అప్ప‌గించింది. ఇది దివాలా తీయ‌డంతో దాని అనుబంధ సంస్థ టెర్రాసిస్‌ టెక్నాలజీస్ లిమిటెడ్ ధ‌ర‌ణి బాధ్య‌త‌ల‌ను చూసేది.

ఈ రెండు కంపెనీల‌కు సంబంధించిన మేజ‌ర్ షేర్లను ఫిలిప్పీన్స్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఫాల్క‌న్ ఎస్‌జీ హోల్డింగ్స్ ఇంక్ చేజిక్కించుకోవ‌డంతో ధ‌ర‌ణి నిర్వ‌హ‌ణ ఈ కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. ఫాల్కన్ ఎస్‌జీ అనేది సింగపూర్‌కు చెందిన ఫాల్కన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ.

ధరణి పోర్టల్‌ను నడుపుతున్న కంపెనీలో 52.26 శాతం వాటాను రూ. 1,275 కోట్లకు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఈ సంస్థ‌కు అమ్మేసింది. తెలంగాణ ధరణి పోర్టల్‌తో పాటు, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశాలో ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌లను నిర్వహించే బాధ్య‌త‌ల‌ను కూడా టెర్రాసిస్‌ చూస్తున్నది.

కార్పొరేట్ వ్యవహారాల శాఖ పోర్ట‌ల్‌లో అందుబాటులో ఉన్న స‌మాచారం మేర‌కు.. ధరణి పోర్టల్‌ను నడుపుతున్న ప్ర‌స్తుత సంస్థ టెర్రాసిస్‌ కొత్త యజమాని అయిన ఫిలిప్పీన్స్ కంపెనీ ఐదుగురు డైరెక్టర్లను నియమించింది.

గాధి శ్రీధర్ రాజు, కార్తీక్ కృష్ణన్, ఆశిష్ శుక్లా, వీయాంగ్ మార్క్ లిమ్, మెయి మెయి మిచెల్ లీలు బోర్డు డైర‌క్ట‌ర్లుగా నియ‌మితుల‌య్యారు. ఇప్పుడు తెలంగాణ‌లో ధ‌ర‌ణి స‌మ‌స్య రాజ‌కీయ ఎజెండాగా మారిన నేప‌థ్యంలో దీని నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ ఐకామ్‌కు అప్ప‌గించ‌డానికి ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేసిన‌ట్లు సమాచారం.

ధ‌ర‌ణిపై ఆదినుంచి వివాదాలే…

ఎంతో ప‌కడ్బందీగా రూపొందించిన‌ట్లు చెప్పుకొన్న ధ‌ర‌ణి పోర్ట‌ల్ ఆది నుంచీ వివాదాస్ప‌దంగా మారింది. తాము అధికారంలోకి వ‌స్తే ధ‌ర‌ణిని ర‌ద్దు చేస్తామ‌ని బీజేపీ నేత‌లు చెబుతుంటే, కాంగ్రెస్ నాయ‌కులు మార్పులు చేస్తామ‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లకు ధ‌ర‌ణి పోర్ట‌ల్ ఒక రాజ‌కీయ అజెండా అయిపోయింది.

తెలంగాణ ధరణి పోర్టల్ మూడు సంవత్సరాల ప‌నితీరును దీని రూప‌క‌ల్ప‌న‌లో ప్ర‌ధాన భూమిక పోషించిన నాటి ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఎంతో మెచ్చుకుంటున్నారు. ధరణి వెబ్ పోర్టల్ 5.14 కోట్ల హిట్‌లు న‌మోదు చేసుకోవ‌డ‌మేకాదు, ఏడాదిలోనే 10 లక్షల లావాదేవీలను విజ‌య‌వంతంగా పూర్తి చేసింద‌ని చెబుతున్నారు.

“ధరణికి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజల భూమిని గుర్తించడానికి గ్రామ మ్యాప్‌ల వంటి అనేక సమయ పరీక్షా పద్ధతులను ప్రభుత్వం క్రమపద్ధతిలో రద్దు చేసింది. ధరణి పోర్టల్‌లో 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూమికి ఎంట్రీలు లేవు, ఇదంతా పేద ప్రజలకు ఇచ్చిన భూమి. ఈ పోర్టల్‌ను నడుపుతున్న కంపెనీ విదేశీ చేతుల్లోకి వెళ్లడంతో, పేదలు కష్టపడి సంపాదించిన భూమిని కోల్పోయే ప్రమాదం ఉంది” అని అప్ప‌ట్లో ప‌లువురు ఆందోళ‌న‌లు కూడా వ్య‌క్తం చేశారు.

విదేశీయులు నిర్వహిస్తున్న ధరణి పోర్టల్‌ను కొంత‌మంది త‌మ స్వార్థం కోసం ఉప‌యోగించుకుని బినామీలకు, ప్రైవేట్ కంపెనీలకు భూములపై హ‌క్కును క‌ల్పించార‌నే ఆరోప‌ణ‌లు కూడా వినిపించాయి. టెర్రాసిస్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ గాది శ్రీ‌ధ‌ర్ రాజు హైద‌రాబాదుకే చెందిన వ్య‌క్తి కావ‌డంతో అలాంటి భ‌యాలు అక్క‌ర్లేద‌ని అప్ప‌ట్లో ప్ర‌భుత్వ పెద్ద‌లు చెబుతూ వ‌చ్చారు.

డాటాపై నియంత్ర‌ణ ప్ర‌భుత్వానిదే..!

విదేశీ కంపెనీ చేతిలో తెలంగాణ భూముల డాటా ఉన్న‌ప్ప‌టికీ దాని నియంత్ర‌ణ మాత్రం తెలంగాణ ప్ర‌భుత్వం చేతుల్లోనే ఉంది. తెలంగాణ ప్ర‌భుత్వం ఈ పోర్ట‌ల్‌కు సంబంధించిన అన్ని ర‌కాల యాక్సెస్‌ను క‌లిగిఉంది. ఇప్పుడు భూమిపై యాజమాన్య హ‌క్కులు ఉన్నట్లు రుజువు చేయాలంటే కేవ‌లం ధరణి పోర్టల్‌లో పేరు నమోదు అయి ఉంటేనే.

ఇప్పుడు తెలంగాణ‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు ధ‌ర‌ణి ఒక రాజ‌కీయ ఆయుధంగా మారింది. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో కొన్ని లోపాలు భూ య‌జ‌మానుల‌కు శాపాలుగా మారాయి. ధ‌ర‌ణి బాధితుల సంఖ్య తెలంగాణ ప‌ల్లెప‌ల్లెలోనూ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం దీనిని స‌వ‌రించ‌డానికి ముందు నిర్వ‌హ‌ణ సంస్థ‌ను మార్చే ఆలోచ‌న చేసిన‌ట్లు చెబుతున్నారు.

ఐకామ్ సంస్థ ఇప్ప‌టికే దేశ ర‌క్ష‌ణ ప‌రికరాలు, ఆయుధాలేకాదు, టెలి క‌మ్యూనికేష‌న్స్‌కు సంబంధించిన విడి భాగాల త‌యారీలో అంత‌ర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. ఆ సంస్థ‌కు ఇప్పుడు అధికారికంగా ఈ కాంట్రాక్టు ఇవ్వాల‌నే నిర్ణ‌యానికి ప్ర‌భుత్వ పెద్ద‌లు వ‌చ్చార‌ని, ఈ మేర‌కు రెవెన్యూ శాఖ ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు కూడా ఇచ్చేశార‌ని చెబుతున్నారు.