Adani | డైవర్షన్ పాలిట్రిక్స్! మళ్లీ తెరపైకి అదానీ.. సమస్యలను పక్కదారి పట్టించే కుట్ర
Adani | సమస్యలను పక్కదారి పట్టించే కుట్ర ధరల పెరుగుదలతో జనంలో ఆగ్రహం నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగిత ప్రజాస్వామిక సంస్థల విధ్వంసం కేంద్రంపై జనంలో తొలగుతున్న భ్రమ ఇండియా కూటమికి మద్దతు వెల్లువ తాజాగా మళ్లీ తెరపైకి అదానీ వివాదం అన్నింటినీ పక్కకు తోస్తూ మోదీ మాయ అందుకే జమిలి, యూసీసీ, మహిళా కోటా పన్నాగాలు పారబోవంటున్న ప్రతిపక్షాలు (విధాత ప్రత్యేకం) ఒకవైపు ప్రతిపక్షాల ఇండియా కూటమి నానాటికీ బలాన్ని పెంచుకుంటున్నది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఒక […]

Adani |
- సమస్యలను పక్కదారి పట్టించే కుట్ర
- ధరల పెరుగుదలతో జనంలో ఆగ్రహం
- నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగిత
- ప్రజాస్వామిక సంస్థల విధ్వంసం
- కేంద్రంపై జనంలో తొలగుతున్న భ్రమ
- ఇండియా కూటమికి మద్దతు వెల్లువ
- తాజాగా మళ్లీ తెరపైకి అదానీ వివాదం
- అన్నింటినీ పక్కకు తోస్తూ మోదీ మాయ
- అందుకే జమిలి, యూసీసీ, మహిళా కోటా
- పన్నాగాలు పారబోవంటున్న ప్రతిపక్షాలు
(విధాత ప్రత్యేకం)
ఒకవైపు ప్రతిపక్షాల ఇండియా కూటమి నానాటికీ బలాన్ని పెంచుకుంటున్నది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఒక స్థానం నుంచి ఉమ్మడిగా ఒక అభ్యర్థినే నిలబెట్టి, నేరుగా మోదీని ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నది. మోదీ ఈ పదేళ్లలో చెప్పినవాటిలో ఏవీ నెరవేరకపోగా.. సాధారణ ప్రజల జీవనస్థితిగతులు నానాటికీ కుంచించుకుపోతున్నాయి. మరోవైపు గ్యాస్ ధర తగ్గించినా.. నమ్మని ప్రజలు.. ఇప్పటి వరకూ పెంచిందెంత? ఇప్పుడు తగ్గించిందెంత? అనే విషయంలో లెక్కలేసుకుంటూ మోదీ సర్కార్ మోసాన్ని గ్రహిస్తున్నారు.
వీటి మధ్యలో ఉన్నట్టుండి మళ్లీ అదానీ వ్యవహారం పంటి కింద రాయిలా కేంద్రానికి తగులుకున్నది. సరిగ్గా ఈ సమయంలోనే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలంటూ ఒక ట్వీటు.. ఆ వెంటనే ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’పై బిల్లు తెస్తారంటూ లీకు.. తెల్లారే జమిలిపై సంప్రదింపుల కమిటీ ఏర్పాటు గమనిస్తే.. కొన్ని వరుస పరిణామాల మధ్య అంతర్లీనంగా ఉన్న సంబంధం కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
అదే డైవర్షన్ పాలిటిక్స్! అదానీ అంశం పతాక శీర్షికలకెక్కకుండా.. ఇండియా భేటీకి ప్రాధాన్యం దక్కకుండా, ప్రజా సమస్యలు బుట్టదాఖలయ్యేలా.. చర్చలన్నీ ఒక్క దెబ్బకు డైవర్ట్ చేసేలా ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ఉన్నదని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, నిరుద్యోగిత, ఆకాశాన్నంటుతున్న ధరలు, అనేక ప్రాంతాల్లో విస్తరిస్తున్న విద్వేష జ్వాలలు, ప్రజాస్వామిక సంస్థల విధ్వంసం, రాజ్యాంగపు మూల స్వభావాన్నే మార్చేయాలనే మాటలు.. వీటన్నింటిపై చర్చ జరిగితే మోదీ సర్కారుకు రాబోయే ఎన్నికల్లో చుక్కలు కనపడటం ఖాయం. అందులోనూ ప్రతిపక్షాలు మొక్కవోని సంకల్పంతో ముందుకు వస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ పార్టీలను వేరే అంజెండాకు షిఫ్ట్ చేయకపోతే ప్రభుత్వ వైఫల్యాలు జనంలోకి గట్టిగా వెళ్లటమూ తప్పదు.
అందుకే మోదీ ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లుతోపాటు.. ప్రతిపక్షాల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్న ఉమ్మడి పౌరస్మృతి, మహిళా కోటా బిల్లులను తీసుకురావడం పక్కా వ్యూహం ప్రకారం జరిగిందేనని అంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ మూడు అంశాలపై తమ వైఖరిపై చర్చించాల్సిన పరిస్థితిని సృష్టించడమే ప్రత్యేక సమావేశాలు పెట్టి ఈ బిల్లులను తీసుకురావడమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పుడు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా రానున్న కొద్ది నెలలకు రాజకీయ చర్చనీయాంశాన్ని మోదీ సెట్ చేసి పెట్టారన్న చర్చ నడుస్తున్నది.
‘ఇండియా’ను బలహీనపర్చడమే టార్గెట్!
వాస్తవానికి ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఇప్పటికప్పుడు నిర్ణయం తీసుకోగలిగినది కాదు. ఉమ్మడి పౌరస్మృతి విషయం కూడా అంతే. ఇక మహిళా కోటా బిల్లు సంగతి తెలియంది కాదు. అయితే.. ఈ ఉచ్చు వేయడం ద్వారా ప్రతిపక్షాలను ఇరకాటంలో పడేశామని బీజేపీ నాయకత్వం సంబురపడినా.. ప్రతిపక్షాలు మాత్రం తమ లక్ష్యంపై చాలా స్పష్టతతో ఉన్నాయని ఒక వామపక్ష పార్టీ సీనియర్ నేత చెప్పారు.
ఇప్పటికే కూటమిలోని పలు ప్రతిపక్ష పార్టీలు మోదీ ఎత్తును గమనించి, స్పందించాయని ఆయన గుర్తు చేశారు. కేంద్రం ఒకే ఎన్నిక బిల్లు తీసుకొచ్చినప్పటికీ.. పార్లమెంటు ఉభయసభల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అంతే కాకుండా యాభైశాతానికి పైగా రాష్ట్ర అసెంబ్లీలు మద్దతు పలకాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమని ఒక విశ్లేషకుడు చెప్పారు.
గందరగోళంలోకి నెట్టే యత్నం
‘ఇది ప్రతిపక్షాలను, యావత్ దేశాన్ని గందరగోళంలోకి నెట్టేందుకు మోదీ ప్రభుత్వం చేసిన కుట్రపూరిత ప్రయత్నమే. ఈ దేశం విశ్వాసం ఆధారంగా నడుస్తుంది. ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోకుండా, ఎలాంటి చర్చ జరగకుండా ఇటువంటి ప్రతిపాదనలను తీసుకురావడం ద్వారా దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే కుట్ర ఇది’ అని ఒక ప్రతిపక్ష నేత చెప్పారు.
ఈ విషయంలో ప్రతిపక్షాలకు ఒక అజెండా కూడా ప్రభుత్వం ఇవ్వలేదని, తమకు మీడియా ద్వారానే ఈ విషయం తెలిసిందని ఆయన తెలిపారు. ఇండియా కూటమి సమావేశాలను, అదానీ వివాదాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమేనని అనేక మంది చెబుతున్నారు. అదే సమయంలో డిసెంబర్‌లో మోదీ సర్కారు ముందస్తుకు వెళ్లటం కూడా ఖాయంగా కనిపిస్తున్నదని, ఇది కూడా ప్రతిపక్షాలు నిలదొక్కుకోకుండా చూసే ప్రయత్నమేనని అంటున్నారు.
ఎవరిని మోసం చేసేందుకు?
నిరుద్యోగిత, ధరల పెరుగుదల వంటి కీలక అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రం ఈ ఎత్తుగడ వేసిందని శివసేన (ఉద్ధవ్) నేత ప్రియాంక చతుర్వేది విమర్శించారు. జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందాలంటే ఐదు రాజ్యాంగ సవరణలు ఆమోదించాల్సి ఉంటుందని, మూడింట రెండొంతుల మెజారిటీ సాధించాల్సి ఉంటుందని మూడు నివేదికలు పేర్కొన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల కోసం 15వేల కోట్లు అవసరమని పేర్కొన్నదని చెప్పారు. ఇంత జరిగిన తర్వాత ఇంకా కొత్త కమిటీ అవసరమా? అని ఆమె ప్రశ్నించారు. ఇది ఎవరిని మోసగించేందుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.