హెచ్ఐవీ పాజిటివ్ గర్భిణిని తాకేందుకు నిరాకరణ.. పసికందు మృతి
Uttar Pradesh | నెలలు నిండిన గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంటే.. వైద్యులు నిర్లక్ష్యం వహించారు. ఎందుకంటే ఆ గర్భిణి హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారించబడటంతో.. ఆమెను తాకేందుకు డాక్టర్లు నిరాకరించారు. దీంతో ఆరు గంటల పాటు పురిటి నొప్పులు భరించి, బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ బిడ్డ జన్మించిన కొద్ది గంటలకే చనిపోయాడు. వైద్యులు సకాలంలో స్పందించి డెలీవరి చేసి ఉంటే, పసిబిడ్డ బతికేదని బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ […]

Uttar Pradesh | నెలలు నిండిన గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంటే.. వైద్యులు నిర్లక్ష్యం వహించారు. ఎందుకంటే ఆ గర్భిణి హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారించబడటంతో.. ఆమెను తాకేందుకు డాక్టర్లు నిరాకరించారు. దీంతో ఆరు గంటల పాటు పురిటి నొప్పులు భరించి, బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ బిడ్డ జన్మించిన కొద్ది గంటలకే చనిపోయాడు. వైద్యులు సకాలంలో స్పందించి డెలీవరి చేసి ఉంటే, పసిబిడ్డ బతికేదని బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ 20 ఏండ్ల వయసున్న యువతికి నెలలు నిండాయి. దీంతో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో.. ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. డెలివరీకి రూ. 20 వేలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. తమ వద్ద అంత డబ్బు లేకపోవడంతో, చేసేదేమీ లేక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. అయితే గర్భిణి హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారించబడటంతో వైద్యులు ఆమెను తాకేందుకు నిరాకరించారు. గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంటే ఆమె వద్దకు వెళ్లేందుకు సాహసం చేయలేదు.
దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు.. ఆస్పత్రి ఇంచార్జికి ఫోన్ చేసి, జరిగిన విషయాన్ని చెప్పారు. అప్పటికే ఆరు గంటల సమయం గడిచిపోయింది. ఇక ఆస్పత్రికి వచ్చిన డాక్టర్ సంగీత అనేజా.. గర్భిణికి డెలివరీ చేసింది. పుట్టిన కొద్ది గంటలకే పాప చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగానే పసిపాప చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యల తీసుకుంటామని డాక్టర్ సంగీత పేర్కొన్నారు. అయితే గర్భిణికి హెచ్ఐవీ సోకినట్లు కుటుంబ సభ్యులు ఎవరూ చెప్పలేదని సంగీత తెలిపారు. ఆస్పత్రిలో తాము టెస్టులు చేసిన తర్వాత ఈ విషయం తేలిందన్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.