Dorsey | డోర్సీ వ్యాఖ్యలతో కలకలం.. కేంద్రంలో రాజకీయ దుమారం

Dorsey | దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర’ అని ఆగ్ర‌హం త్వ‌ర‌లో అమెరికా పర్యటనకు ప్రధాని ఈ తరుణంలో పంటికింద రాయిలా వ్యాఖ్య‌లు విధాత‌: వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీ శివార్లలో రైతులు ఆందోళన చేసిన సమయంలో వారికి అనుకూలంగా ఉన్న ట్వీట్లను తొలగించాలని, లేదంటే భారత్‌లో ట్విట్టర్‌ను మూసేస్తామని ఒత్తిళ్లు వచ్చాయని సంస్థ మాజీ సీఈవో Dorsey వెల్లడించిన అంశాలు దేశంలో రాజకీయ దుమారం రేపాయి. వీటిని ఖండించిన కేంద్ర ప్రభుత్వం.. షరామామూలుగానే ‘భారతదేశ […]

Dorsey | డోర్సీ వ్యాఖ్యలతో కలకలం.. కేంద్రంలో రాజకీయ దుమారం

Dorsey |

  • దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర’ అని ఆగ్ర‌హం
  • త్వ‌ర‌లో అమెరికా పర్యటనకు ప్రధాని
  • ఈ తరుణంలో పంటికింద రాయిలా వ్యాఖ్య‌లు

విధాత‌: వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీ శివార్లలో రైతులు ఆందోళన చేసిన సమయంలో వారికి అనుకూలంగా ఉన్న ట్వీట్లను తొలగించాలని, లేదంటే భారత్‌లో ట్విట్టర్‌ను మూసేస్తామని ఒత్తిళ్లు వచ్చాయని సంస్థ మాజీ సీఈవో Dorsey వెల్లడించిన అంశాలు దేశంలో రాజకీయ దుమారం రేపాయి. వీటిని ఖండించిన కేంద్ర ప్రభుత్వం.. షరామామూలుగానే ‘భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రపంచ స్థాయి కుట్ర’ అని అభివర్ణించింది. ఒకరి తర్వాత ఒకరుగా కేంద్ర మంత్రులు ట్విట్టర్‌ మాజీ సీఈవోపై విరుచుకు పడ్డారు. అసలు ట్విట్టరే తప్పుడు వార్తల పుట్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్విట్టర్‌ ఫౌండర్‌ కూడా అయిన జాక్‌ డోర్సీ రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తి కాదు.. ఆయనకు అసత్యాలు పలకాల్సిన అవసరమూ లేదు. అయితే.. ఆయన చేసిన తీవ్ర స్థాయి ఆరోపణలపై మనం ఎలా స్పందిస్తామన్నదే ప్రశ్న. నిజానికి అవి నరేంద్రమోదీ పాలనలో భారత ప్రజాస్వామ్యం ఎంతటి ప్రమాదంలో పడిందో బయటపెడుతున్నది. అంతేకాదు.. అధికారాలను దుర్వినియోగం చేస్తున్నదో, భావ ప్రకటనా స్వేచ్ఛకు ఎలా భంగం కలిగిస్తున్నదో కూడా వెల్లడవుతున్నది.

భావ ప్రకటనా స్వ్చేచ్ఛ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం. ప్రజాస్వామ్యం ప్రజలకు ఇచ్చిన హక్కుల్లో అత్యంత పవిత్రమైనది, ప్రభావవంతమైనది కూడా ఇదే. తమ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇది అవకాశం ఇస్తుంది. సరే సాధారణ ప్రజలు వ్యక్తం చేసే భావాలను పట్టించుకునే ప్రభుత్వాలు ఎక్కడున్నాయి? కానీ.. ఇదే భావ ప్రకటన స్వేచ్ఛను విద్యావంతులు, సమాజ హితం కోరే వారు ఉపయోగించుకుంటే అధికార కేంద్రాలకు కలవరం కలుగుతుంది.

తమ అధికార ముద్రికల్‌ ఎక్కడ అంతరిస్తాయోనన్న ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పుడు భారతదేశంలో జరుగుతన్నది ఇదే. ఒక న్యాయబద్ధమైన ఆందోళనగా రైతుల మహోద్యమం సాగింది. యావత్‌ దేశం అండగా నిలిచింది. అంతకు ముందు మహారాష్ట్ర రైతులు మొదటిసారి నాసిక్‌ నుంచి ముంబై వరకు మహా పాదయాత్ర చేపట్టినప్పుడు దారి పొడవునా వారికి విశేష మద్దతు లభించింది.

ముంబై నగరానికి చేరుకున్నప్పుడు కూడా తాము ఎక్కడి నుంచి వచ్చామో.. గుర్తు చేసుకున్న నగర వాసులు.. తామూ ఒకప్పుడు రైతు బిడ్డలమేనంటూ ఆందోళనకారులకు వారికి ఉన్న మేరకు సహాయం చేశారు. ఇదే రీతిగా రైతుల ఆందోళనకు సైతం మద్దతు లభించింది. అయితే.. రైతు ఆందోళనను అణచివేసేందుకు, విఫలం చేసేందుకు జరగని ప్రయత్నం లేదు.

రోడ్లపై మేకులు దించి.. కాంక్రీట్‌ దిమ్మలు అమర్చి.. ఢిల్లీపై శత్రుదేశం దండెత్తతున్నదా? అనిపించేత స్థాయిలో దిగ్బంధం చేశారు. ఆ సమయంలో జరిగిన లాఠీచార్జీలు, రైతులు పడిన అవస్థలను చూపిస్తూ.. అనేక మంది సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు.. అంతకంతకూ ప్రజల మద్దతును పెంచాయి. ఈ సమయంలోనే ట్విట్టర్‌పై ఒత్తిళ్లు వచ్చాయని జాక్‌ డోర్సీ చెప్పారు.

నిజానికి డోర్సీ చెప్పడంతోనే ఇవి బయటకు రాలేదు. ప్రభుత్వ సంస్థలను యథేచ్ఛగా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం కేంద్ర ప్రభుత్వం వాడుతున్నదన్న ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదు. దేశంలో ఇప్పటి వరకూ ఐటీ, ఈడీ సోదాల్లో అంతా ప్రతిపక్ష నేతలే ఎందుకు బాధితులుగా ఉంటున్నారో?, ఏ ఒక్క బీజేపీ నాయకుడి కార్యాలయాల్లోనూ ఎలాంటి సోదాలు ఎందుకు జరుగటం లేదో గమనిస్తే చాలు విషయం అర్థం అయిపోతుంది.

డోర్సీ చెప్పినటువంటి ఇటువంటి ఒత్తిళ్లు చాలా మంది అనుభవించారు. అనుభవిస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ విషయాలను చెప్పిన వ్యక్తికి ఉన్న ప్రపంచ స్థాయి కారణంగా ఇవి మరింత బలంగా వెళ్లాయి. అందులోనూ ప్రపంచ మీడియానూ ఆకర్షించేవిగా ఆ వ్యాఖ్యలు ఉండటం సహజంగానే కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది కలిగించే విషయం. అందులోనూ త్వరలో అమెరికా పర్యటనకు ప్రధాని నరేంద్రమోదీ వెళ్లబోతున్న తరుణంలో ఇవి పంటికింద రాయిలా తగిలాయనుకోవచ్చు.