Earthquake: మయన్మార్.. థాయ్‌లాండ్ భూకంప మృతులు వేలల్లోనే..!
మయన్మార్, థాయ్ లాండ్ లలో భూకంపాలు సృష్టించిన విలయంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటి దాకా రెండు దేశాల్లో మృతుల సంఖ్య 1000దాటిపోయిందని..ఈ సంఖ్య 10వేలు దాటే అవకాశముందని అమెరికా ఏజెన్సీల కథనం.

Earthquake Myanmar, Thailand:
మయన్మార్, థాయ్ లాండ్ లలో భూకంపాలు సృష్టించిన విలయంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటి దాకా రెండు దేశాల్లో మృతుల సంఖ్య 1000దాటిపోయిందని..ఈ సంఖ్య 10వేలు దాటే అవకాశముందని అమెరికా ఏజెన్సీల కథనం. శుక్రవారం సంభవించిన భారీ భూకంపాల ధాటికి మయన్మార్, థాయ్ లాండ్ లలో వేలాది బహుళ అంతస్తుల భవనాలు పేక మేడల్లా కుప్ప కూలాయి. ఎక్కడ చూసిన భవనాల శిధిలాల గుట్టలతో మయన్మార్ మరుభూమిని తలపిస్తుంది.
ఇప్పటిదాక ఒక్క మయన్మార్ లోనే 1002మంది మరణించినట్లుగా, 2370మందికి గాయాలైనట్లుగా అధికారులు వెల్లడించారు. థాయ్ లాండ్ లో ఇప్పటిదాక 22మంది మరణించగా..ఓ నిర్మాణ భవనం కూలిన ఘటనలో బ్యాంకాక్ లో 100మంది గల్లంతయ్యారు. రెండు దేశాల్లో కలిపి భూకంప మృతుల సంఖ్య 10వేల దాటవచ్చని అంచనా. శిథిలాల కింద చిక్కుకుని అనేక మంది విలవిల్లాడుతున్నారు. రెండు దేశాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో ఆత్యయిక పరిస్థితిని ప్రకటించాయి.
మరోసారి ప్రకంపనలు..
ఓవైపు భూకంపంతో కూలిన భవనాల శిధిలాల నుంచి ప్రజలను రక్షించే సహాయక చర్యలు కొనసాగుతుండగానే మయన్మార్ లో మరోసారి ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 4.2 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రపంచ దేశాల ఆపన్నహస్తం..
ప్రకృతి విపత్తుతో విధ్వంసమైన బాధిత మయన్మార్, థాయ్ లాండ్ లను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. ఇప్పటికే భారత్.. ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద మయన్మార్ కు 15 టన్నుల సహాయక సామాగ్రిని పంపించింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు ఆహార ప్యాకెట్లను అందించింది. అటు అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సాయం అందిస్తున్నాయి. ప్రకటించాయి. భూకంపా బాధిత దేశాలకు సహాయక సామగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు.