ఆహారధాన్యాల ఉత్పత్తిలో రష్యాను మించిపోయిన ఓ జీవి.. ఏటా 14 కోట్ల టన్నులు దీని వల్లే…
 
                                    
            విధాత: వర్షం కురిసినపుడు తడి నేల మీద మట్టిని చీల్చుకుంటూ మెల్లగా పైకి వస్తున్న వానపాముల (Earth Worms) ను మనం చూసే ఉంటాం. చాలా మందికి వీటిని చూడగానే కాస్త అసహ్యంగానూ అనిపిస్తుంది.
అయితే వీటి వల్ల వ్యవసాయరంగానికి ఎంతో ఉపయోగమని, వానపాముల కృషి వల్లే చాలా మందికి ఆకలి తీరుతోందని కొద్ది మందికే తెలుసు. వ్యవసాయ శాస్త్రవేత్తలకు వీటి ఉపయోగాలు ఇప్పటికే తెలిసినా.. అది ఎంత ఉపయోగం, వానపాముల వల్ల లబ్ధి పొందుతున్నది ఎంత మంది అనే లెక్కలపై దృష్టి పెట్టలేదు.
తాజాగా గార్డియన్‌లో వెలువడిన ఓ పరిశోధనా వ్యాసం ఈ విషయాలను వెల్లడించింది.భూమి మీద అశేష సంఖ్యలో ఉన్న ఈ వానపాములు ఏటా కనీసంలో కనీసం సుమారు 14 కోట్ల టన్నుల ఆహారధాన్యాలను పండిస్తున్నాయి.
ఇది ఎంత పెద్ద మొత్తమో తెలియాలంటే… అత్యధిక వ్యవసాయ భూమి ఉన్న రష్యా 2022లో 15 కోట్ల టన్నులను పండించగా 2023లో సుమారు 12 కోట్ల టన్నుల ఆహారధాన్యాలను ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఈ లెక్కన వానపాములను ఒక దేశంగా భావిస్తే ఆహారధాన్యాల సాగుల అవి నాలుగో స్థానాన్ని ఆక్రమిస్తాయి.
ఇవి ఉత్పత్తి చేసే మొత్తం ధాన్యాలు ప్రపంచ ఉత్పత్తిలో 6.5 శాతంగా ఉంటాయని నేచర్ కమ్యునికేషన్స్ జనరల్ పేర్కొంది. వీటిలో ప్రధానంగా వరి, గోధుమ, మొక్కజొన్న, బార్లీ తదితర ప్రధాన పంటలు ఉన్నాయి. అంతే కాకుండా సోయాబిన్, బీన్స్ వంటి కూరగాయల జాతి మొక్కల సాగులోనూ వీటి వాటా 10 శాతంగా ఉంది.
వ్యవసాయ రంగంలో వానపాముల కృషిని ముందుగా గుర్తించినది ఛార్లెస్ డార్విన్. ఆయన 188ల1లోనే వీటిపై పరిశోధనలు చేశారు.  మొక్కల మొదళ్లలో ఉన్న జీవ, అజీవ పదార్థాలను తినడం ద్వారా వానపాములు విసర్జన చేస్తాయి. వీటిలో మొక్కల పెరుగుదలకు ఎంతో అవసరమైన మూలకాలు ఉంటాయి.  అంతే కాకుండా వర్షాలు వచ్చినపుడు లోపలి నుంచి బయటకు బయట నుంచి లోపలకు కలియతిరగడం ద్వారా భూమిలోపలి మూలకాలు మొక్కకు అందేలా తోడ్పడతాయి.
తద్వారా అధిక దిగుబడులకు కారణమవుతున్నాయి. ఒకవేళ వానపాము అనే జీవి లేకపోతే పర్యావరణ గొలుసు దెబ్బతిని ఇప్పుడు వచ్చే దిగుబడులు చాలా మేర తగ్గిపోయేవి. అయితే ఈ ఉపయోగాలను చూసి వానపాములను ప్రపంచంలో ప్రతిచోటా ఉపయోగిస్తే మంచిదని ఆలోచించకూడదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
వానపాముల ఉనికి లేని చోట వీటిని ప్రవేశపెడితే అక్కడి జీవావరణం దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఇవి ఉన్న చోట కాపాడుకోవాలని.. వీటి సంరక్షణకు రైతులతో కలిసి ప్రయత్నించాలని సూచించారు.
 
                     X
                                    X
                                 Google News
                        Google News
                     Facebook
                        Facebook
                     Instagram
                        Instagram
                     Youtube
                        Youtube
                     Telegram
                        Telegram