El Nino | ఎల్‌నినో వచ్చినట్టేనా!
El Nino! ముగింపునకు వస్తున్న మృగశిర కార్తె ఇంకా పలకరించని తొలకరి చినుకు రోజూ వాయిదా పడుతున్న నైరుతి విస్తరణకు అనుకూల పరిస్థితులు మూడు రోజుల్లో అక్కడక్కడ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం విధాత: ఈ సారి కరువు తప్పేటట్టు లేదు. మృగశిర ముగింపునకు వస్తున్నది. ఇంతవరకు చినుకు లేదు. నేడో రేపో వర్షాలు వస్తాయని వాతావరణ విభాగం ఆశాజనకంగా చెబుతున్నప్పటికీ, ఇప్పటి వరకు ఇచ్చిన వాతావరణ సూచనలు తప్పుతూనే ఉన్నాయి. తుఫాను ప్రభావం బలహీనపడినందున రుతుపవనాలు […]

El Nino!
- ముగింపునకు వస్తున్న మృగశిర కార్తె
- ఇంకా పలకరించని తొలకరి చినుకు
- రోజూ వాయిదా పడుతున్న నైరుతి
- విస్తరణకు అనుకూల పరిస్థితులు
- మూడు రోజుల్లో అక్కడక్కడ వర్షాలు
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం
విధాత: ఈ సారి కరువు తప్పేటట్టు లేదు. మృగశిర ముగింపునకు వస్తున్నది. ఇంతవరకు చినుకు లేదు. నేడో రేపో వర్షాలు వస్తాయని వాతావరణ విభాగం ఆశాజనకంగా చెబుతున్నప్పటికీ, ఇప్పటి వరకు ఇచ్చిన వాతావరణ సూచనలు తప్పుతూనే ఉన్నాయి. తుఫాను ప్రభావం బలహీనపడినందున రుతుపవనాలు ముందుకు కదిలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రాబోయే రెండు లేదా మూడు రోజులలో దక్షిణాది రాష్ట్రాల్లో మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడు రోజులలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
ఎప్పుడూ లేనిది రుతుపవనాలు ఈసారి చిత్తూరు, నెల్లూరు వైపు వచ్చి అక్కడే ఆగిపోయాయి. కర్ణాటకలో కూడా చాలా ప్రాంతాలకు ఇంకా రుతుపవనాలు రాలేదు. రుతుపవనాలు ముందుగా తాకే దక్షిణ కన్నడ జిల్లాలో సాధారణంగా ఈ నెలలో ఈ పాటికి 668 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసి ఉండాలి. కానీ కురిసింది 215 మిల్లీ మీటర్లే.

తెలంగాణలోనూ అదే పరిస్థితి
తెలంగాణలో జూన్‌లో 165 నుంచి 220 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాలి. జూన్ 14వరకు సాధారణంగా 49 మిల్లీమీటర్లు కురవాలి. కురిసింది 12 మిల్లీ మీటర్లు మాత్రమే. ఈ నెల వర్షపాతం లోటు 75 శాతం వరకు ఉండవచ్చునని వాతావరణ విభాగం చెబుతున్నది.
ఎల్‌నినో ప్రభావం తప్పదా?
ఎల్‌నినో ఈ సారి ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపనున్నది. ఎల్‌నినో ఈసారి చాలా ప్రభావవంతంగా ఉండనున్నదని, ఎక్కువకాలం ప్రభావం చూపనున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం వలన అమెరికాలో వరదలు వచ్చే అవకాశం ఉందని, పసిఫిక్ సముద్ర దేశాల్లో తుఫానులు సంభవించే అవకాశం ఉందని, ఆసియా, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో కరువులు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.