Election Campaign | మొదలైన ప్రధానపార్టీల ఎన్నికల ప్రచారం
Election Campaign విధాత: రాష్ట్రంలో ఎన్నికల సన్నాహకాలు మొదలయ్యాయి. ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలతో పాటు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో ప్రధానంగా దివ్యాంగుల పింఛను రూ. 4,016కు పెంచుతున్నట్టు ప్రకటించారు. బీసీ కుల వృత్తులకు చేయూతనిచ్చే పథకం, భూమిలేని నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ, రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, […]

Election Campaign
విధాత: రాష్ట్రంలో ఎన్నికల సన్నాహకాలు మొదలయ్యాయి. ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలతో పాటు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు.
ఇందులో ప్రధానంగా దివ్యాంగుల పింఛను రూ. 4,016కు పెంచుతున్నట్టు ప్రకటించారు. బీసీ కుల వృత్తులకు చేయూతనిచ్చే పథకం, భూమిలేని నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ, రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కాంగ్రెస్ దేశాన్ని సగం ముంచితే.. బీజేపీ నిండా ముంచిందని ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచి అధికారపార్టీపై విమర్శలు చేస్తున్నది. దీనికి కౌంటర్‌గా కేసీఆర్ మాట్లాడుతూ.. మూడేళ్ల పాటు శ్రమించి ధరణి పోర్టల్‌కు రూపకల్పన చేశామన్నారు.
దీన్ని తొలిగిస్తే రాజ్యం.. మళ్లీ దళారుల భోజ్యం అవుతుందన్నారు. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు యువజన కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని ధరణిని రద్దు చేస్తామన్నారు. కేసీఆర్ ఈ పోర్టల్ తీసుకొచ్చి వేల ఎకరాలు కొట్టేశారని ఆరోపించారు.
కొంతమంది భూస్వాముల కోసమే ఆయన ధరణి తెచ్చారని, 97 శాతం భూవివాదాలకు ఈ పోర్టలే కారణమన్నారు. దీని ఆధారంగానే రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లాలో వేల ఎకరాలను కేసీఆర్ తన బినామీలకు కట్టబెట్టారని అన్నారు. సమస్యల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నది.
ఇక బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే బీజేపీ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయని, కేంద్రం రాష్ట్రానికి కోట్లాది రూపాయలు ఇచ్చినా ప్రభుత్వం వాటిని దుర్వినియోగపరుస్తున్నదని, కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రజలకు అందకుండా చేస్తున్నదనే కేంద్ర మంత్రులు మొదలు, రాష్ట్ర నేతల దాకా ఇవే విషయాలను ప్రస్తావిస్తుంటారు.
అయితే సాధారణ సమయాల్లోనే ఎన్నికల్లో ప్రచారంలో మాత్రం మతం, భావోద్వేగాల చుట్టే తిప్పుతారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని సహా బీజేపీ నేతలు చేసిన ప్రచారం చూస్తే అర్థమౌతుంది. ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న సమయంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ రెండు వర్గాలుగా చీలిపోయారు. అందుకే నిన్న ఈటల రాజేందర్ ను ఢిల్లీకి పిలిపించిన ఆ పార్టీ అధిష్ఠానం చర్చలు జరిపింది.
ఈ నెల 15న కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ లోగానే పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. అందుకే ఈ సమయంలో బీజేపీ భావజాలానికి అనుగుణంగా భావోద్వేగాలు రెచ్చగొట్టే బండి సంజయ్‌ని మారిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. అందుకే మధ్యేమార్గంగా ఈటల రాజేందర్‌ను సంతృప్తిపరచడానికి, నేతలంతా కలిసికట్టుగా పనిచేయడానికి ప్రచార సారథి బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ఉంటుందని కేసీఆర్, కేటీఆర్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ పోటీలో ఉన్నప్పటికీ ఆ పార్టీ ప్రభావం హైదరాబాద్ నగరంలో లేదా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లోనే ఉంటుంది. అందుకే కేసీఆర్ కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా 50-60 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించడానికి ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది. అలాగే కేసీఆర్ కూడా సిట్టింగులందరికీ సీట్లు అంటూనే కొందరిని పక్కనపెట్టి 50-60 మంది అభ్యర్థుల పేర్లను ముందుగానే ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడినవారు, అప్పటికి ఈ రెండు పార్టీల్లో ఉండే అసంతృప్తులు, ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని పార్టీలోకి చేర్చుకుని టికెట్లు ఇవ్వాలనే యోచనలో బీజేపీ ఉన్నది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ -నవంబర్ నెలల్లో రావొచ్చని అంచనా వేస్తున్నారు.
ఈలోగా అధికారపార్టీ సామాజికవర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్టు అర్థమౌతున్నది. కేంద, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలలే ఎజెండాగా.. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ప్రజలకు ఏం చేస్తామన్నది అత్యంత కీలకమైన ఐదు అంశాలతో కూడిన ప్రజల వద్దకు వెళ్తామని రేవంత్‌రెడ్డి అన్నారు.
ఈ హామీలకు సంబంధించిన కాంగ్రెస్ మ్యానిఫెస్టో ను సెప్టెంబర్ 17న విడుదల చేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. ఈలోగానే పార్టీల్లో చేరికలు.. వివిధ పార్టీలతో పొత్తుల అంశాన్ని పూర్తి చేయాలని పార్టీ పెద్దలు అనుకుంటున్నారు. కొన్నిరోజులుగా రాష్ట్రంలో ప్రధాన పార్టీల కార్యక్రమాలు చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నిలకు ప్రచారం మొదలైనట్టే కనిపిస్తున్నది.