Maheshwar Reddy | ‘మాస్టర్ ప్లాన్’ మంటలు.. రద్దు చేసే వరకూ దీక్ష విరమించనంటున్న ఏలేటి
Maheshwar Reddy | లాఠీచార్జి కి నిరసనగా బీజేపీ ఆందోళన పోలీసులు, నిరసనకారుల తోపులాట విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాకేంద్రంలో మున్సిపల్ ‘మాస్టర్ ప్లాన్’ మంటలు రగులుతున్నాయి. రద్దు చేసే వరకు దీక్ష కొనసాగుతుందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పట్టుబడుతున్నారు. శనివారం శాంతియుతంగా చేపట్టిన ఆందోళనపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇందుకు నిరసనగా ఆదివారం అదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆపార్టీ […]

Maheshwar Reddy |
- లాఠీచార్జి కి నిరసనగా బీజేపీ ఆందోళన
- పోలీసులు, నిరసనకారుల తోపులాట
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాకేంద్రంలో మున్సిపల్ ‘మాస్టర్ ప్లాన్’ మంటలు రగులుతున్నాయి. రద్దు చేసే వరకు దీక్ష కొనసాగుతుందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పట్టుబడుతున్నారు. శనివారం శాంతియుతంగా చేపట్టిన ఆందోళనపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇందుకు నిరసనగా ఆదివారం అదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆపార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పాయల శంకర్ కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ సందర్భంగా పాయల శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మల్ పట్టణ మాస్టర్ ప్లాన్ తో పాటు 220 జీఓ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన సొంత ఆస్తులను పెంచుకునేందుకు నిర్మల్ పట్టణ మాస్టర్ ప్లాన్ తెర పైకి తీసుకొచ్చారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా దానిని అడ్డుకోవడంలో భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. ఈ కారణంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు ఎక్కడ తనను ముంచుతాయో అని, బీజేపీ కార్యకర్తల చేతులు, కాళ్లు విరిగే విధంగా గూండాల లాగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అమానుష దాడిని ఖండిస్తూ అదిలాబాద్ లో శాంతియుతంగా నిరసన చేపట్టే క్రమంలో పోలీసులు జోగు రామన్న తొత్తులుగా జోగు రామన్న గుండాలు మాపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఎలక్షన్లకు మూడు నెలల సమయం ఉండగానే పోలీసుల వ్యవహార శైలి ఇంతలా ఉంటే, ఎలక్షన్ల సమయంలో అదిలాబాద్ ప్రజలకు రక్షణ ఎవ్వరు ఇవ్వాలని, రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే ఈరోజు మాపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఇదిలాఉండగా, నిరవధిక నిరశన దీక్ష ఆదివారం ఐదో రోజూ కొనసాగింది. మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కుటుంబ సభ్యలు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ వివాదం రగులుతున్నా, ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.