Elon Musk | ఎలాన్‌ మస్క్‌ ఇండియా టూర్‌ వాయిదా

గత కొద్ది రోజులుగా వార్తల్లో ఉన్న టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ భారత పర్యటన ఆకస్మికంగా వాయిదా పడింది. ఈ పర్యటనలో వాస్తవానికి మస్క్‌.. ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలువురు స్టార్టప్‌ వ్యవస్థాపకులతో సమావేశం కావాల్సి ఉన్నది.

Elon Musk | ఎలాన్‌ మస్క్‌ ఇండియా టూర్‌ వాయిదా

టెస్లా పనుల్లో తీరికలేదన్న సీఈవో
ఏడాది చివరిలో వస్తానని వెల్లడి

టెక్సాస్‌: గత కొద్ది రోజులుగా వార్తల్లో ఉన్న టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ భారత పర్యటన ఆకస్మికంగా వాయిదా పడింది. ఈ పర్యటనలో వాస్తవానికి మస్క్‌.. ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలువురు స్టార్టప్‌ వ్యవస్థాపకులతో సమావేశం కావాల్సి ఉన్నది. టెస్లా పని ఒత్తిడితో బిజీగా ఉన్న కారణంగా భారతదేశ పర్యటన జాప్యం అయ్యే అవకాశం ఉన్నదని మస్క్‌ తెలిపారు. ఈ ఏడాదిలో భారత పర్యటనకు వస్తానని ఎక్స్‌లో శనివారం పేర్కొన్నారు.

2018లో నిర్ణయించిన రికార్డు స్థాయి 56 బిలియన్‌ డాలర్ల నష్టపరిహారంపై తమ ఆమోదాన్ని పునరుద్ఘాటించాలని టెస్లా తన వాటాదారులను కోరినట్టు రాయిటర్స్‌ గతంలో పేర్కొన్నది. అయితే.. ఈ 2024 జనవరిలో డెలావర్‌ జడ్జి దీనిని తిరస్కరించిన సంగతి తెలిసిందే.

దీనితోపాటు.. గత నెల విడుదల చేసిన ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ పాలసీని అమల్లోకి తెచ్చేందుకు మార్గదర్శకాలు ఖరారు చేసేందుకు ఇటీవలే భారత ప్రభుత్వం టెస్లా సహా ఆటోమొబైల్‌ పరిశ్రమవర్గాలతో తొలి విడుత సంప్రదింపుల సమావేశాలు నిర్వహించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకున్నది. దేశంలో ప్రారంభ దశలో ఉన్న ఎలక్ట్రానిక్‌ వెహికల్స్‌ ఉత్పత్తిలో పెట్టుబడులపై ఈ మార్గదర్శకాలు మరింత స్పష్టతనిస్తాయని భావిస్తున్నారు.

భారతదేశంలో 4,150 కోట్ల రూపాయల కనీస పెట్టుబడితో సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటే పరిమిత సంఖ్యలో ఎలక్ట్రానిక్‌ వెహికల్స్‌ను భారత్‌లోకి తక్కువ సుంకాలతో దిగుమతి చేసేందుకు కొత్త ఈవీ విధానం వీలు కల్పిస్తున్న నేపథ్యంలో టెక్సాస్‌కు చెందిన టెస్లా భారతదేశంలో ఈవీ కార్లను దిగుమతి చేసేందుకు వీలు కలుగుతున్నది.

కంప్లీట్లీ బిల్ట్‌ అప్‌ (సీబీయూ) కార్లను 15శాతం ఇంపోర్ట్‌ డ్యూటీతో దిగుమతి చేసేందుకు కొత్త ఈవీ పాలసీ అవకాశం ఇస్తున్నది. పూర్తిగా అసెంబుల్డ్‌ కార్ల దిగుమతి సుంకాలను తగ్గించాలని 2021లో టెస్లా కంపెనీ సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు కోరింది. కారు ధరను బట్టి 40 శాతం నుంచి 15 శాతం సుంకాలు తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు ఆ సుంకాలు 100 శాతం ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నూతన ఈవీ పాలసీలో ఆ విజ్ఞప్తిని ఆమోదించారు. భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను నెలకొల్పాలంటే టారిఫ్‌ కన్సెషన్స్‌ ఇవ్వాలని ముందస్తు షరతు విధించింది.

భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్‌గా ఉన్నది. అంతేకాదు.. ప్రపంచంలోనే అతి వేగంగా పెరుగుతున్న ఆటోమొబైల్‌ మార్కెట్‌గా కూడా ఉన్నది. ప్రస్తుత ఆటోమోటివ్‌ మార్కెట్‌ పరిణామం రూ.12.5 లక్షల కోట్లుగా ఉన్నది. 2030 నాటికి ఇది 24.9 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని భావిస్తున్నారు. దేశ జీడీపీకి ఆటోమోటివ్‌ సెక్టార్‌ 7.1శాతం అందిస్తున్నది.

భారత్‌పై మస్క్‌ కన్ను.. ఇదీ కారణం!

శతకోటీశ్వరుడు ఎలాన్‌ మస్క్‌.. ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం ప్రపంచంలోనే టాప్‌ టెన్‌ సంపన్నుల్లో ఒకరు. ఏప్రిల్‌ 21, 22 తేదీల్లో ఆయన భారతదేశంలో పర్యటించాల్సి ఉన్నది. అమెరికాలో ఎలక్ట్రానిక్‌ వెహికల్స్‌ (ఈవీ)కు డిమాండ్‌ తగ్గుతున్నది. మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీ టెస్లా సైతం అమ్మకాల్లో మందగమనాన్ని చవిచూస్తున్నది. ఈ నేపథ్యంలో అధిక జనాభా కలిగిన కొత్త మార్కెట్‌ భారతదేశంవైపు టెస్లా చూస్తున్నదనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి తోడు భారతదేశంలో శాటిలైట్‌ కమ్యూనికేషన్ల సర్వీసులను ప్రారంభించేందుకు ఇప్పటికే టెలికం మంత్రిత్వ శాఖల నుంచి సూత్రబద్ధ ఆమోదాన్ని పొందిన మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ కంపెనీ.. కేంద్ర హోం శాఖ నుంచి కూడా ఆమోదం లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నది.

వాస్తవానికి ఆయన ప్రతిపాదిత పర్యటనకు ముందు లైసెన్స్‌ మంజూరు చేసే ప్రక్రియ వేగవంతమైంది కూడా! శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను నెలకొల్పే క్రమంలో జీఎంపీసీఎస్‌ లైసెన్స్‌ లేదా శాటిలైట్‌ సర్వీసెస్‌ లైసెన్సు పొందటం తొలి అడుగు. నామ మాత్రపు దరఖాస్తు రుసుంతో ట్రయల్‌ స్పెక్ట్రమ్‌ను పొందడం అనేది కూడా ఈ పక్రియలో భాగం. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీతో ఎలాన్‌ మస్క్‌ సమావేశం కావాల్సి ఉన్నది. టెస్లా, స్టార్‌లింక్‌ మాత్రమే కాదు.. గతంలో ట్విట్టర్‌గా ఉండి.. ఎక్స్‌గా మారిన సోషల్‌ మీడియా వేదిక కూడా మస్క్‌దే. భావ ప్రకటనలో అత్యంత కీలకమైన వేదికగా ఎక్స్‌ ఉన్నది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఎలాన్‌ మస్క్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది. గతంలో అతి తక్కువ రాజకీయ జోక్యం, విస్తత స్థాయి భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇచ్చినప్పటికీ.. ప్రభుత్వ ఆదేశాలకు లోబడి వివిధ ఖాతాలను స్తంభింప చేస్తున్న నేపథ్యంలో రాజకీయంగా కూడా మస్క్‌ పర్యటన ప్రాధాన్యం కలిగి ఉన్నది.