EPFO-Paytm | పేటీఎంకు మరో షాక్.. పేమెంట్స్ బ్యాంక్ నుంచి లావాదేవీలు నిలిపివేసిన ఈపీఎఫ్‌ఓ..!
పేటీఎంకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలను నిషేధిస్తున్నట్లు ఈపీఎఫ్‌ఓ ప్రకటించింది.

EPFO-Paytm | పేటీఎంకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలను నిషేధిస్తున్నట్లు ఈపీఎఫ్‌ఓ ప్రకటించింది. పేటీఎం అనుబంధ సంస్థలోని బ్యాంకు ఖాతాలకు లింక్ చేసిన క్లెయిమ్‌లను స్వీకరించకూడదని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయం భారీగానే ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల భవిష్య నిధిలో దాదాపు 30 కోట్ల మందికిపైగా చందాదారులున్నారు. ఈ నెల 29 తర్వాత కొత్త డిపాజిట్ల సేకరణను నిలిపివేయాలని ఆర్‌బీఐ పేటీఎంను ఆదేశించిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి పేటీఎం సంక్షోభంలో చిక్కుకున్నది. ఈపీఎఫ్ఓ చర్యల నేపథ్యంలో పేటీఎం బ్యాంక్ ఖాతాల్లో ఉపసంహరణలు, క్రెడిట్ లావాదేవీలపై ప్రభావం పడుతున్నది. వాస్తవానికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా చెల్లింపులు చేసేందుకు ఈపీఎఫ్‌ఓ గతేడాది అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అనుమతిని వెనక్కి తీసుకున్నది. ఇకపై చందాదారులు తమ ఈపీఎఫ్‌ఓ కార్పస్‌ను యాక్సెస్ చేసేందుకు బ్యాంకు ఖాతా వివరాలను అప్‌డేట్ చేయాల్సి రానున్నది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిబంధనలలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఆంక్షలు విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. దిద్దుబాటు చర్యలకు సమయం సైతం ఇచ్చామని చెప్పారు. ఈ నిర్ణయంతో పేటీఎంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జే వెల్లడించారు. పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై మాత్రమే ఆంక్షలు ఉంటాయని, యాప్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని వివరించారు.