మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ పర్యటన.. ఈటల వస్తారా?

రెండు జిల్లాల మంత్రుల అలర్ట్ బల ప్రదర్శనకు గులాబీ, కాషాయ శిబిరాలు రెడీ KTR TOUR EETALA విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర మంత్రి కేటీఆర్ మంగళవారం తన గత సహచరుడు, ప్రస్తుత ప్రత్యర్థి అయిన బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపురం, గూడూరు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సుమారు రూ.49 కోట్లతో ఈ రెండు ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమాలలో కమ్యూనిటీ […]

మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ పర్యటన.. ఈటల వస్తారా?
  • రెండు జిల్లాల మంత్రుల అలర్ట్
  • బల ప్రదర్శనకు గులాబీ, కాషాయ శిబిరాలు రెడీ

KTR TOUR EETALA విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర మంత్రి కేటీఆర్ మంగళవారం తన గత సహచరుడు, ప్రస్తుత ప్రత్యర్థి అయిన బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపురం, గూడూరు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

సుమారు రూ.49 కోట్లతో ఈ రెండు ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమాలలో కమ్యూనిటీ హాల్, కులసంఘ భవనాలు కూడా ఉన్నాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల ఆధిపత్యానికి గండి కొట్టాలనే ఆలోచనతో కేటీఆర్ ఈ నియోజకవర్గంలో పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఈటల వస్తారా?

రాష్ట్ర మంత్రిగా రెండు దఫాలు పనిచేసిన ఈటల రాజేందర్.. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా హుజూరాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్ అధికారిక పర్యటన నిమిత్తం వస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేగా హాజరవుతారా? లేదా? అన్నది జిల్లాలో ఆసక్తికరంగా మారింది. అయితే కేటీఆర్ పాల్గొనేది అధికారిక కార్యక్రమం కావడంతో ఈటల హాజరవుతారని, తన నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తానే దూరంగా ఉండటం కూడా తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని భావిస్తున్నారని సమాచారం. అయితే.. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణులను ముందస్తు అరెస్టులపై నిరసన వ్యక్తమవుతున్నందున ఈటల హాజరు అవుతారా? లేదా? చూడాలి.

రెండు జిల్లాల మంత్రుల పర్యవేక్షణ

వరంగల్ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ పోటీపడి మరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ హడావుడిలో అధికారులు సైతం తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు నియోజకవర్గమంతా గులాబీమయం చేశారు. ప్రత్యర్థి బలంగా ఉన్న నియోజకవర్గం కావడంతో గులాబీ పార్టీ వర్గాలు హడావుడి, హంగామా చేస్తున్నట్లు చెబుతున్నారు.

సకల హంగులూ…హంగామా

బీఆర్ఎస్ పార్టీ అనధికార రాష్ట్ర అధ్యక్షుడే కాకుండా, మంత్రిగా, సీఎం కుమారుడిగా…కాబోయే సీఎంగా ప్రత్యేకతలు ఉన్న కేటీఆర్ కమలాపురం పర్యటన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 29న పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన విషయం తెలిసిందే. 30వ తేదీన కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ అదే కేటీఆర్ రాక సందర్భంగా పర్యటన ఏర్పాట్లను పరిశీలించడం విశేషం. ఒక మంత్రి కోసం ఇద్దరు మంత్రులు పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమవడం కేటీఆర్ ప్రత్యేకత అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

గులాబీ, కాషాయ బలాబలాలు

అధికార పర్యటనే అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేటీఆర్ కార్యక్రమాలను గులాబీ వర్గాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులను సమీకరించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కేంద్రీకరించారు. ఇదే సమయంలో గులాబీ శ్రేణులు కూడా తమ బలాన్ని చాటుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఒక విధంగా కేటీఆర్ పర్యటన గులాబీ, కాషాయ దళాల బలాబలాల ప్రదర్శనకు వేదికగా మారనుందని భావిస్తున్నారు.