CM Revanth Reddy: జైలులో పెట్టినా.. కోపం దిగమింగుకుని పనిచేస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి
ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నన్ను రాజకీయ కక్షతో ఫామ్ హౌస్ డ్రోన్ కేసులో అక్రమంగా చర్లపల్లి జైలులో నక్సలైట్లు, ఉగ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్ లో 16రోజులు ఒక్క మనిషిని కూడా చూడకుండా బీఆర్ఎస్ పాలకులు నిర్భంధించారని..అయినా ఆ కోపాన్ని దిగమింగుకుని ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

CM Revanth Reddy: ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నన్ను రాజకీయ కక్షతో ఫామ్ హౌస్ డ్రోన్ కేసులో అక్రమంగా చర్లపల్లి జైలులో నక్సలైట్లు, ఉగ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్ లో 16రోజులు డిటెన్షన్ సెల్ లో ఒక్క మనిషిని కూడా చూడకుండా బీఆర్ఎస్ పాలకులు నిర్భంధించారని..అయినా ఆ కోపాన్ని దిగమింగుకుని ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మేం కక్ష సాధింపులకు పాల్పడితే ఇప్పటికే మీ కుటుంబం అంతా ఆనాడు మమ్మల్ని పెట్టిన జైలులో ఉండేవారన్నారు.
ఎవరైన అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసినందుకు రూ.500 ఫైన్ వెయ్యాలని.. కానీ నన్ను అరెస్ట్ చేసి జైలులో పెట్టారన్నారు. మామూలుగా 7 సంవత్సరాల లోపల శిక్ష ఉంటే రిమాండ్‌కు పంపకుండా, బెయిల్ ఇవ్వాలని.. కాని ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసి..ఎంపీగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నన్ను చర్లపల్లి జైలులో డిటెన్షన్ సెల్ లో నిర్భంధించారని గుర్తు చేశారు. రాత్రి పూట పడుకోనివ్వకుండా చేయడానికి ట్యూబ్ లైట్లు బంద్ చెయ్యకపోతే..పురుగులు తినేందుకు 20, 30 పెద్ద పెద్ద బల్లులు తిరుగుతుంటే ఒక్కరోజు కూడా నేను నిద్ర పోలేదన్నారు. కానిస్టేబుల్ ను లైట్లు బంద్ చేయమని కోరితే నాకు పై నుంచి బంద్ చేయవద్ధన్న ఆదేశాలున్నాయని చెప్పాడన్నారు.
సెల్లో చిన్న బాత్ రూమ్ లో కూర్చుంటే బైటకి కనిపించే లాగా ఉంటుందని.. కావాలంటే ఎమ్మెల్యేలను, మంత్రులను తీసుకువెళ్లి చూపిస్తానన్నారు. 16 రోజులు నిద్ర లేకపోతే.. పొద్దుగాలా బైటకి వదిలినప్పుడు చెట్టు కింద పడుకొని నిద్రపోయేవాడినని రేవంత్ రెడ్డి చెప్పారు. అయినా నేను ఈ రోజు కోపం ప్రదర్శించడం లేదన్నారు. ఇవన్ని కూడా దేవుడనేటోడు ఉంటడు..ఆయన చూస్తడనుకుని.. అంతకు నాలుగింతలు అనుభవిస్తడనుకున్నానన్నారు. సరిగ్గా నేను సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన రోజునే నామీద కక్ష సాధించినోళ్లను దేవుడే దావఖానాలో పడేయించాడన్నారు.
మొదటిసారి నన్ను జైళ్లో పెట్టినప్పుడు నా బిడ్డ పెళ్లి ఉంటే..లగ్న పత్రిక రాసుకునేందుకు ఇంటరీన్ బెయిల్ కూడా ఇవ్వకుండా ఢిల్లీ నుంచి న్యాయవాదులను రప్పించి అడ్డుపడ్డారన్నారు. లగ్న పత్రిక రాయడం పూర్తవ్వగానే మళ్లీ జైలుకెళ్లానన్నారు. నా బిడ్డ పెళ్లి కూడా చూడకుండా అడ్డుపడ్డారన్నారు. రాజకీయ కక్ష సాధింపు మీదా నాదా అంటూ మండిపడ్డారు. నిజంగా నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు బయట ఉండరని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఓ జర్నలిస్టు మీ విలాసవంతమైన ఫామ్ హౌస్ లను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించి నాకు ఇస్తే నేను దాన్ని మీడియాకు విడుదల చేసిన పాపానికి చర్లపల్లి జైలులో నిర్భంధించారన్నారు. ఎన్నికల హామీలు అమలు చేస్తలేమంటున్నారని.. మీకు జైల్లో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తానని హామీ ఇచ్చానని..కాని ఆ హామీ కూడా అమలు చేయలేదన్నారు. ఎందుకంటే నేను విజ్ఞతతో వ్యవహరించాలని అనుకుంటున్నానని తెలిపారు.
ప్రజలు నాకు అధికారం ఇచ్చింది కక్ష సాధింపు కు కాదని..రాష్ట్ర అభివృద్ధి కోసం, పారదర్శక పాలన అందించాలన్న ఆలోచనతో నాకు అధికారం ఇచ్చారన్నారు. నేను వారిలాగా చేయాలని నాకు ఇవ్వలేదన్నారు. నేటి వరకు ఒక్క అక్రమ కేసు కూడా పెట్టలేదన్నారు. కాని సొంత బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కూలి మనుషులను పెట్టి తిట్టించి వీడియోలు ప్రదర్శించారని..అయినా నేను కక్ష సాధింపుకు పాల్పడలేదన్నారు. కక్ష సాధింపులకు సీఎంకు ఉన్న విచక్షణ అధికారాల మేరకు ఆ కుటుంబంలో ఒక్కరు బయట ఉండరన్నారు. ఇప్పటికి ఎక్కడికి పోయినా నన్ను అంతా అడుగుతున్నారని..ఆ కుటుంబాన్ని ఇంకెప్పుడు లోపల వేస్తావు. అసలు నిన్ను సీఎంగా చేసిందే వారిని లోపలేసేందుకని చెబుతున్నారని..అయినా నేను అటువైపు ఆలోచన చేయడం లేదన్నారు.