మరో వివాదంలో మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

జనగామ ఎమ్మెల్యేగా గతంలో ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాజీగా మారినా ఆయనను వివాదాలు వీడడంలేదు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు

మరో వివాదంలో మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
  • దళితబంధు ఇప్పిస్తానని డబ్బులు వసూలు
  • ముత్తిరెడ్డి ఫామ్‌హౌజ్‌ను ముట్టడించిన బాధితులు
  • నాయకత్వం వహించిన బీఆరెస్‌ ఎంపీపీ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ ఎమ్మెల్యేగా గతంలో ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాజీగా మారినా ఆయనను వివాదాలు వీడడంలేదు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. అధికారంలో ఉండగా దళిత బంధు పేరిట పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి దళిత బంధు ఇవ్వలేదని ఆరోపణలు వస్తున్నాయి. వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇవ్వమంటే ముఖం చాటేస్తున్నాడని ఆరోపిస్తూ మద్దూరు, ధూల్మిట్ట గ్రామాలకు చెందిన పలువురు దళితులు శుక్రవారం జనగామ జిల్లా నర్మెట మండలం హనుమంతపూర్ గ్రామంలోని ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ను ముట్టడించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మద్దూరు మండల ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి ఈ ముట్టడికి నాయకత్వం వహించడం విశేషం.

యూనిట్‌కు లక్ష నజరానా

దళిత బంధం ఇప్పిస్తామని మాజీ ఎమ్మెల్యే నమ్మ పలికితే ఒక్కో యూనిట్‌కు లక్ష చొప్పున మొత్తం రెండు మండలాల నుంచి 62 మంది వద్ద రూ. 62 లక్షలు తీసుకున్నాడని ఆరోపించారు. గట్టిగా ప్రశ్నిస్తే ఇప్పుడిస్తాం.. రేపు ఇస్తాం.. అంటూ ముఖం చాటేస్తున్నాడని వాపోయారు. ఈ విషయాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దృష్టికి కూడా తీసుకెళ్లినా ముత్తిరెడ్డి స్పందించలేదని వాపోయారు. డబ్బుల కోసం ఆయన చుట్టూ తిరిగి వేసారి ఫామ్ హౌస్ ను ముట్టడించామని తెలిపారు. ఎన్నికల ముందు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కూతురు తుల్జా భవానితో ముత్తిరెడ్డి వివాదాల్లో చిక్కుకున్నారు. సమాచారం తెలిసి అక్కడికి చేరుకున్న నర్మెట ఎస్సై శ్రీకాంత్ నేతృత్వంలో నిరసనను పోలీసులు అడ్డుకున్నారు.