సౌదీలో మొట్టమొదటి మద్యం దుకాణం ప్రారంభం.. వారికి మాత్రమే విక్రయాలు
మద్యపాన విక్రయం, వినియోగాన్ని కచ్చితంగా అమలు చేసే దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి.

మద్యపాన విక్రయం, వినియోగాన్ని కచ్చితంగా అమలు చేసే దేశాల్లో సౌదీ అరేబియా (Saudi Arabia) ఒకటి. ఆ నిబంధనను కాస్త సడలిస్తూ ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ముస్లిమేతర దౌత్యవేత్తలకు మాత్రమే మద్యాన్ని విక్రయించేందుకు రాజధాని రియాద్‌లో ఒక స్టోర్ (Liquor Store) కు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు దౌత్య వేత్తలకు మద్యం కావాలంటే వారు దానిని ప్రత్యేక దౌత్య మార్గాల్లో దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది.
అయితే అక్రమ మార్గాల్లో మద్యం రావడం, నకిలీ బ్రాండ్ర విక్రయాలు పెరగడం, లెక్కల్లోకి రాని సొమ్ము పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోకి వచ్చే మద్యం ఎంత అన్నది రికార్డుల్లో నమోదవుతంది. ఇంతకు ముందు వీటిపై అధికారులకు ఎలాంటి నియంత్రణా ఉండేది కాదు అని ఒక అధికారి పేర్కొన్నారు. ఇస్లాం ఆధారంగా రాచరిక పాలన సాగే సౌదీలో మద్యం సేవించడం, విక్రయించడాన్ని ఒక పాపంగా చూస్తారు.
అందుకే అది నిషిద్ధం. ముస్లిం దేశాలన్నింటికీ నాయకత్వం వహించే సౌదీలో ముస్లింలు పవిత్రంగా భావించే అనేక కట్టడాలున్నాయి. అందుకే ఈ నిబంధనను ఇక్కడ తుచ తప్పకుండా పాటిస్తారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఎవరైనా మద్యం తాగుతూ పట్టుబడితే వారికి 100 కొరడా దెబ్బలు, విదేశీయులైతే దేశ బహిష్కరణ, లేదా జైలు శిక్ష వంటి కఠినమైన చర్యలుంటాయి. ప్రస్తుతం ఉన్న సౌదీ రాజు సంస్కరణ వాది కావడంతో ఎక్కువగా జైలు శిక్షలే విధిస్తున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, పర్యాటకంగా దేశాన్ని అభివృద్ధి చేసే అంశాలపై సౌదీ ఇటీవల ఎక్కువ దృష్టి పెడుతోంది.
అందులో భాగంగానే నిబంధనలను కాస్త సరళీకరిస్తోంది. పక్క దేశాలైన దుబాయ్, యునైటడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పోటీ పడాలంటే కొన్ని విధానాలను మార్చుకోవాలని భావించడంతో ఆ కోణంలోనే మద్యం షాపునకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దుబాయ్, ఖతార్‌లలో చాలా హోటళ్లలో మద్యం విక్రయించడం చట్టబద్ధం కావడంతో పర్యాటకులు, సందర్శకులు సౌదీతో పోలిస్తే దుబాయ్, ఖతార్‌లనే ఎంచుకుంటారు.