కరెంటు షాక్‌కు 5 ఏనుగులు మృతి.. జార్ఖండ్ అటవీ ప్రాంతంలో విషాదం
జార్ఖండ్‌లోని అటవీ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి విషాదకర సంఘటన జరిగింది. 33 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో కరెంటు షాక్ తగిలి 5 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జార్ఖండ్ లోని తూర్పు సింగ్ భూమ్ జిల్లాలోని ముసబాని అటవీ ప్రాంతంలో జరిగింది

రాంచీ: జార్ఖండ్‌లోని అటవీ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి విషాదకర సంఘటన జరిగింది. 33 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో కరెంటు షాక్ తగిలి 5 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జార్ఖండ్ లోని తూర్పు సింగ్ భూమ్ జిల్లాలోని ముసబాని అటవీ ప్రాంతంలో జరిగింది. చనిపోయిన వాటిల్లో రెండు ఆడ ఏనుగులు ఉండగా మూడు మగ ఏనుగులు ఉన్నాయి. ముసబాని అటవీ ప్రాంతమైన పోటాస్ అడవి మధ్యలో తవ్విన గొయ్యి దాటుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.
ఏనుగుల గుంపు కింది నుంచి వెళుతుండగా ఒక్కసారిగా పై నుంచి వెళుతున్న 33కేవీ హైఓల్టేజ్ లైన్ లు తగలడంతో కరెంటు షాక్ తగిలింది. ఈ హై టెన్షన్ లైన్ హెచ్ సీ ఎల్ గనులకు వెళ్తుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి సమయంలో డజన్ ఏనుగుల గుంపు ఆ ప్రాంతమంతా సంచరిస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి హై టెన్షన్ వైరు తగిలి ఏనుగులు చనిపోయి ఉంటాయని భావిస్తున్నారు.
అడవి నుంచి కలపను తెస్తున్న క్రమంలో ఆ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులను తరిమికొడుతుండగా చనిపోయిన ఏనుగులను గ్రామ ప్రజలు గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో కేవలం 11 అడుగుల ఎత్తులో 33 కేవీ హై టెన్షన్ వైర్ వెలుతున్నది. మరోవైపు రెండు రోజుల క్రితం అటవీశాఖ అధికారులు అడవిలో కందకం త్రవ్వారు. దాని లోపల నుంచి తీసిన మట్టిని కూడా అక్కడే ఉంచారు. ఏనుగుల గుంపు గుట్ట లాంటి మట్టి దిబ్బను దాటుతుండగా హై టెన్షన్ వైరు తగిలి 5 ఏనుగులు చనిపోయాయి.
దాదాపు వారం రోజులుగా ముసబాని ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నా అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. కుటుంబ సమేతంగా పంటలను కాపాడుకునేందుకు ఏనుగుల గుంపును తరిమి కొట్టడంతో గ్రామ ప్రజలు అడవి వైపు పరుగులు తీశారు. ఈ సమయంలో అటవీ శాఖ నిర్లక్ష్యం కారణంగా హై టెన్షన్ వైర్ తగిలి ఏనుగులు అకాల మృత్యు వాత పడ్డాయని స్థానికులు వాపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు డిప్యూటీ అటవీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీ ఆదేశించారు.