75వ గణతంత్ర దినోత్సవం.. భద్రతా వలయంలో ఢిల్లీ
భారత 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధానిలో భధ్రతను మరింత కట్టుదిట్టం చేశారు

విమాన కార్యకలాపాలు, పలు మార్గాల్లో
వాహనాల రాకపోకలపై ఆంక్షలు
సందర్భంగా భారీ బందోబస్తు
విధాత: భారత 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధానిలో భధ్రతను మరింత కట్టుదిట్టం చేశారు. విమాన కార్యకలాపాలు, వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అనేక ఏర్పాట్లు చేశారు.
విమాన కార్యకలాపాలపై పరిమితులు విధించారు. శుక్రవారం ఉదయం ఉదయం 10:20 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల మధ్య ఎటువంటి విమానాలు బయలుదేరడానికి లేదా విమానాశ్రయానికి చేరుకోవడానికి అనుమతి నిరాకరించారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా, ఇండిగో, ఇతర దేశీయ విమానయాన సంస్థలు జనవరి 19-26 మధ్య రిపబ్లిక్ డే ఆంక్షల కారణంగా 700 కంటే ఎక్కువ విమాన సర్వీసులు రద్దు చేశాయి.
సెంట్రల్ ఢిల్లీలో శుక్రవారం వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడనున్నది. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కవాతు మార్గాన్ని నివారించాలని సూచించారు.
జనవరి 26న జరిగే వేడుకలను చూసేందుకు కర్తవ్య పథంలోకి చేరుకోవడానికి ప్రజల సౌకర్యార్థం మెట్రో సేవలు అన్ని మార్గాల్లో ఉదయం 4 గంటలకు ప్రారంభమవుతాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. రైలు సేవలు 30 నిమిషాల ముందు నుంచే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత మిగిలిన రోజు సాధారణ టైమ్‌టేబుల్ అమలు కానున్నది.