Amarmani Tripathi | కవయిత్రిని చంపాడు.. సత్ప్రవర్తన కింద బయటకు!

Amarmani Tripathi | మధుమిత శుక్లా హత్య కేసులో యూపీ మాజీ మంత్రి విడుదల ఆదేశాలు జారీ చేసిన యూజీ జైళ్ల శాఖ ‘చికిత్స’ పేరుతో పదేళ్లుగా మెడికల్‌ కాలేజీలోనే విడుదల ఆపాలని సుప్రీంను కోరిన మధుమిత సోదరి గోరఖ్‌పూర్‌: కవయిత్రి మధుమిత శుక్లా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఉత్తరప్రదేశ్‌ మాజీ మంత్రి అమరమణి త్రిపాఠి, ఆయన భార్య జైలు నుంచి విడుదలకానున్నారు. విచిత్రం ఏమిటంటే.. పదహారేళ్ల శిక్షలో పదేళ్లు వారు హాస్పిటల్‌లోనే రాజభోగాలు అనుభవిస్తూ […]

  • By: Somu    latest    Aug 25, 2023 11:35 AM IST
Amarmani Tripathi | కవయిత్రిని చంపాడు.. సత్ప్రవర్తన కింద బయటకు!

Amarmani Tripathi |

  • మధుమిత శుక్లా హత్య కేసులో యూపీ మాజీ మంత్రి విడుదల
  • ఆదేశాలు జారీ చేసిన యూజీ జైళ్ల శాఖ
  • ‘చికిత్స’ పేరుతో పదేళ్లుగా మెడికల్‌ కాలేజీలోనే
  • విడుదల ఆపాలని సుప్రీంను కోరిన మధుమిత సోదరి

గోరఖ్‌పూర్‌: కవయిత్రి మధుమిత శుక్లా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఉత్తరప్రదేశ్‌ మాజీ మంత్రి అమరమణి త్రిపాఠి, ఆయన భార్య జైలు నుంచి విడుదలకానున్నారు. విచిత్రం ఏమిటంటే.. పదహారేళ్ల శిక్షలో పదేళ్లు వారు హాస్పిటల్‌లోనే రాజభోగాలు అనుభవిస్తూ గడిపేయడం. కవయిత్రి మధుమిత శుక్లా 2007 అక్టోబర్‌లో హత్యకు గురయ్యారు.

ఈ కేసులో అమరమణి త్రిపాఠి, ఆయన భార్య దోషులుగా తేలారు. మధుమిత శుక్లా అమర్‌మణి త్రిపాఠితో సంబంధంలో ఉండేవారని ప్రచారం. 2018 నాటి క్షమాభిక్ష విధానం అనుసరించి వారిద్దరినీ జైలు నుంచి విడుదల చేయనున్నట్టు గురువారం ఉత్తరప్రదేశ్‌ జైళ్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది. క్షమాభిక్ష పాలసీకి అనుగుణంగా ఇద్దరూ సత్ప్రవర్తన కలిగి ఉన్నారని పేర్కొన్నది.

విచిత్రం ఏమిటంటే ఆరవై ఆరేళ్ల అమర్‌మణి కానీ, 61 ఏళ్ల మధుమణి కానీ ప్రస్తుతం జైల్లో లేరు. గత పదేళ్లుగా గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీలో సైకియాట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌లో చికిత్స పొందుతూ ఉన్నారు. 2013లో వారిని మెడికల్‌ కాలేజీకి తరలించగా.. ఇప్పటికీ వారు అక్కడే ‘చికిత్స’ పొందుతున్నారు. వీరి విడుదలపై సత్వరమే స్టే ఇవ్వాలన్న వినతిని సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి, త్రిపాఠి, ఆయన భార్యకు నోటీసులు జారీ చేసింది. ముందస్తు విడుదలపై స్టే ఇవ్వాలన్న పిటిషన్‌ను మధుమిత శుక్లా సోదరి నిధి శుక్లా దాఖలు చేశారు.

ఇదీ కేసు..

గర్భిణిగా ఉన్న మధుమితా శుక్లాను.. 2003 మే 9న లక్నోలోని పేపర్‌ మిల్ కాలనీలో కొందరు కాల్చి చంపారు. కవయిత్రితో సంబంధాలు నెరపుతున్నారని చెప్పే అమర్‌మణి త్రిపాఠిని అదే సంవత్సరం సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. తర్వాతి కాలంలో ఆయన భార్యను కూడా అరెస్టు చేశారు. 2007 అక్టోబర్‌లో ఈ కేసు డెహ్రాడూన్‌ కోర్టుకు బదిలీ అయింది.

డెహ్రాడూన్‌ కోర్టు వారిద్దరికీ యావజ్జీవ ఖైదు విధించింది. దీనిని సవాలు చేస్తూ ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు, తదుపరి సుప్రీంకోర్టుకు వెళ్లినా త్రిపాఠి దంపతులకు ఊరట లభించలేదు. 2008 డిసెంబర్‌లో మధుమణిని గోరఖ్‌పూర్‌ జైలుకు తరలించారు.

2012 మార్చిలో అమర్‌మణి త్రిపాఠిని కూడా అదే జైలుకు పంపారు. 2013లో ఇద్దరినీ మెడికల్‌ కాలేజీ దవాఖానకు మానసిక సమస్యలపై చికిత్స నిమిత్తం తరలించగా.. ఇప్పటి వరకూ అక్కడే ఏసీ గదుల్లో, టైమ్‌కు అన్నీ తింటూ గడిపారు. నౌతన్వా నియోజవర్గం నుంచి గెలిచిన త్రిపాఠి.. 2001లో బీజేపీ మంత్రి వర్గంలో పనిచేశారు. కొంతకాలం సమాజ్‌వాదిలో ఉండి.. బహుజన సమాజ్‌ పార్టీలోకి జంప్‌ అయ్యారు.

అమర్‌మణి త్రిపాఠి బయటకు వస్తే తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉంటుందని మధుమిత సోదరి చెబుతున్నారు. అధికారులను తప్పుదోవ పట్టించి ముందే విడుదలయ్యేందుకు ప్రయత్నాల్లో ఉన్నారని తాను ముందు నుంచీ చెబుతున్న విషయాన్ని ప్రస్తావించారు.