Karimnagar: 4 కోట్ల ప్రజల సంపద.. నలుగురు కుటుంబ సభ్యులే దోచుకుంటున్నారు: మల్లు భట్టి విక్రమార్క
రాష్ట్రంలో 1. 92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి లేక లేక నోటిఫికేషన్ వేస్తే ప్రశ్నా పత్రాలు లీకేజ్ చేశారు విద్యార్థి నాయకుడిగా చెప్పుకుంటున్న సుమన్ ఎమ్మెల్యేగా ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు నిజమైన విద్యార్థి నాయకుడే అయితే లీకేజీ పై మాట్లాడాలి విద్యార్థుల పోరాటానికి అండగా ఉండాలి చెన్నూరు పాదయాత్రలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విధాత బ్యూరో, కరీంనగర్: ఇది కాంగ్రెస్ పార్టీ కోసమో.. ఎన్నికల కోసమో చేస్తున్న యాత్ర కాదు.. పేద ప్రజల […]

- రాష్ట్రంలో 1. 92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి
- లేక లేక నోటిఫికేషన్ వేస్తే ప్రశ్నా పత్రాలు లీకేజ్ చేశారు
- విద్యార్థి నాయకుడిగా చెప్పుకుంటున్న సుమన్ ఎమ్మెల్యేగా ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు
- నిజమైన విద్యార్థి నాయకుడే అయితే లీకేజీ పై మాట్లాడాలి
- విద్యార్థుల పోరాటానికి అండగా ఉండాలి
- చెన్నూరు పాదయాత్రలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
విధాత బ్యూరో, కరీంనగర్: ఇది కాంగ్రెస్ పార్టీ కోసమో.. ఎన్నికల కోసమో చేస్తున్న యాత్ర కాదు.. పేద ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు చేస్తున్న యాత్ర.. తెలంగాణ ఏర్పాటు లక్ష్యాలు నెరవేరనందునే
ప్రజలు పడుతున్న బాధలు ప్రభుత్వం దృష్టికి తేవడానికి చేస్తున్న యాత్ర.. అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని బూరుగుపల్లి, పోతనపల్లి గ్రామాలలో పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు, వృద్ధులు, స్థానికులతో కలిసి ఆయన పాద యాత్ర కొనసాగించారు. రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలకు చెందాల్సిన సంపద, కెసిఆర్ కుటుంబంలోని నలుగురు సభ్యులే దోచుకుంటున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు.
రాష్ట్ర సంపదను రాబందుల్లా దోచుకుంటున్నది ఈ ప్రభుత్వ పెద్దలేనన్నారు. 18 లక్షల కోట్ల సంపద, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి తెచ్చిన మరో 5 లక్షల కోట్లలో పేదలకు దక్కింది ఏమిటని ఆయన ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రంలో 9 ఏళ్లుగా కొలువులు లేవని, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు లేవని, రైతులకు రుణమాఫీ నేటికీ పూర్తి కాలేదని, డబుల్ బెడ్ రూమ్ లు, దళితులకు మూడు ఎకరాల భూమి ఊసే లేకుండా పోయిందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, విద్యార్థి నాయకుడిని అని చెప్పుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్.. ఎమ్మెల్యేగా గెలిచి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారని ప్రశ్నించారు. లేకలేక ఒక నోటిఫికేషన్ వేస్తే ప్రశ్నా పత్రాలు లీక్ చేసి, నిరుద్యోగుల జీవితాలను ఈ ప్రభుత్వం అంధకారం చేసిందన్నారు. బాల్క సుమన్ నిజమైన విద్యార్థి నాయకుడే అయితే ప్రశ్నాపత్రాల లీకేజీ పై బయటకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు చేస్తున్న పోరాటానికి అండగా ఉండాలన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నారు. ’30 ఏళ్లుగా సాగుచేసు కొంటున్న.. పోడు భూముల్లోకి మూడేళ్లుగా అటవీశాఖ అధికారులు అడుగుపెట్టనివ్వడం లేదని.. ధరావత్ లక్ష్మి ఆవేదన వింటే తన గుండె తరుక్కుపోతుందన్నారు.
ప్రజల బాధలు వింటుంటే వారికోసం పోరాటం చేయాలన్న పట్టుదల పెరిగిందన్నారు. కన్నీళ్లకు తావులేని ఇందిరమ్మ రాజ్యం తేవాలనిపిస్తుందన్నారు. ‘ మేం అధికారంలోకి వస్తే… మీ ఇంటికి వస్తాం… మీ సమస్యలు విని.. మీ భూములపై మీకు హక్కులు కల్పించి, పట్టాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని, ఆర్థిక స్వావలంబన సాధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందన్నారు. పావలా వడ్డీ రుణాలు ఇవ్వకుండా మహిళలను మోసం చేసిందన్నారు. సింగరేణి కార్మికులను ఈ ప్రభుత్వం రోడ్డు పాలు చేసిందని ఆయన ఆరోపించారు.
సంస్థలో 1.5 వేల ఉద్యోగాలను 42 వేలకు కుదించిందన్నారు. ఫలితంగా 60 వేల మంది స్థానిక ఉద్యోగులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. సింగరేణి క్వార్టర్స్ రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన మాట కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేక పోయిందన్నారు. సింగరేణిలో కొత్త ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్ట్ కారణంగా చెన్నూరు పరిసరాల్లో పంట పొలాలు వరదలో మునిగిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయిందన్నారు. భీమారం ప్రాంతానికి గొల్లవాగు నుంచి 9500 ఎకరాలకు నీరు అందించేందుకు కాంగ్రెస్ హయాంలో కాలువ నిర్మిస్తే, ఆ కాలువలను నిర్వహించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు.
9 ఏళ్లుగా చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయలేని దుస్థితి నెలకొని ఉందన్నారు. నియోజకవర్గంలో రహదారుల పరిస్థితి అద్వానంగా ఉందని, ప్రజల కష్టాలకు అంతులేకుండా పోయిందని, కావున తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావాలసిన అవసరం ఉందన్నారు.