Chilkur Balaji Temple : చిలుకూరు ఆలయ ప్రధానార్చకులు సౌందర రాజన్ కన్నుమూత

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు సౌందర రాజన్ (90) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆలయ స్వతంత్రత కోసం చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయి.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Feb 27, 2026, 5:33 pm IST
Read Time: 3 mins
Chilkur Balaji Temple : చిలుకూరు ఆలయ ప్రధానార్చకులు సౌందర రాజన్ కన్నుమూత

విధాత, హైదరాబాద్ : తెలంగాణలోని ప్రసిద్ద చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు సౌందర రాజన్(90) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు శుక్రవారం తుదిశ్వాస విడిచారు. చిలుకూరులోని ఆయన నివాసంలోనే సౌందర్‌ రాజన్‌ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కుమారుడు సీఎస్. రంగరాజన్ చిలుకూరు ఆలయ ప్రధానార్చకులుగా వ్యవహరిస్తున్నారు.

సౌందర రాజన్ హిందు దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం, హుండీలేని ఆధ్యాత్మిక పాలన కోసం కీలకంగా పనిచేశారు. ఆలయంలో హుండీ లేకుండా, విఐపీ దర్శనాలు లేకుండా, అందరికీ సమానంగా స్వామి దర్శనం కల్పించే సంప్రదాయాన్ని ఆయన బాలాజీ ఆలయంలో కొనసాగించారు. చిలుకూరు ఆలయానికి వచ్చే భక్తులకు .. కళ్లు తెరిచి స్వామివారిని చూడండి, కళ్లు మూసుకుని కాదు, స్వామి వారిని ప్రశాంతంగా.. నిదానంగా చూడండి.. స్వామిని కళ్లారా చూడండి.. తనివితీరా మొక్కండి అంటూ ఆయన చెప్పే మాటలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి.

తన కుమారుడు సీఎస్‌ రంగరాజన్‌తో కలిసి ఆలయ సంప్రదాయాలను కాపాడటానికి, ఆలయ స్వతంత్రతను నిలబెట్టడానికి చేసిన కృషి ఆయనను చిరస్మరణీయులను చేసింది. చిలుకూరు బాలాజీ ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే..కోరిన కోరికలు తీరుతాయని, వీసా వస్తుందని.. విదేశీ ప్రయాణం ఖాయం అనే నమ్మకం ఉంది. అందుకే చిలుకూరు బాలాజీ టెంపుల్ శ్రీవారికి.. వీసా దేవుడు అని అంటుంటారు. కోరికలు తీరిన భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తుంటారు.

ఇవి కూడా చదవండి :

Cheetah Meals | ఏడాదిలో రూ.1.27 కోట్ల మేక‌ల్ని తిన్న చీతాలు
Virosh | పెళ్లి తర్వాత తొలిసారి పబ్లిక్ అపియరెన్స్.. ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో విజయ్–రష్మిక సందడి