Free Electricity | ఉచిత విద్యుత్‌ ముసుగులో సీఎం కేసీఆర్‌ దోపిడీ: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

Free Electricity ఏటా సుమారు రూ.16 వేల కోట్ల ఖర్చు అందులో రూ. 8 వేల కోట్ల మేర అవినీతి పవర్‌ప్లాంట్‌ టెండర్లలోను అవినీతి కంపు మేం అధికారంలోకి రాగానే కేసీఆర్‌పై విచారణ మా ఉచిత విద్యుత్తు హామీపై సందేహాలొద్దు అధికారంలోకి రాగానే 24 గంటల కరెంట్‌ మా మ్యానిఫెస్టోలోనూ ఆ అంశం ఉంటుంది వ్యవసాయానికి 24 గంటల సరఫరాపై కాంగ్రెస్‌ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా? మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌కు సూటి ప్రశ్న మీడియాతో పీసీసీ అధ్యక్షుడు […]

Free Electricity | ఉచిత విద్యుత్‌ ముసుగులో సీఎం కేసీఆర్‌ దోపిడీ: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

Free Electricity

  • ఏటా సుమారు రూ.16 వేల కోట్ల ఖర్చు
  • అందులో రూ. 8 వేల కోట్ల మేర అవినీతి
  • పవర్‌ప్లాంట్‌ టెండర్లలోను అవినీతి కంపు
  • మేం అధికారంలోకి రాగానే కేసీఆర్‌పై విచారణ
  • మా ఉచిత విద్యుత్తు హామీపై సందేహాలొద్దు
  • అధికారంలోకి రాగానే 24 గంటల కరెంట్‌
  • మా మ్యానిఫెస్టోలోనూ ఆ అంశం ఉంటుంది
  • వ్యవసాయానికి 24 గంటల సరఫరాపై
  • కాంగ్రెస్‌ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా?
  • మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌కు సూటి ప్రశ్న
  • మీడియాతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

విధాత: వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా పేరుతో సీఎం కేసీఆర్‌ దోపిడీకి పాల్పడుతున్నారని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికాలో మీట్‌ ఆండ్‌ గ్రీట్‌ కార్యక్రమం సందర్భంగా తాను 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా విషయంపై సాంకేతికంగా వివరించే ప్రయత్నంలో మాట్లాడిన అంశాల వీడియోను ఎడిట్‌ చేసి కేటీఆర్, బీఆరెస్‌ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుట్టలో పడుకున్న పాములు గత రెండు రోజులుగా బయటకు వచ్చి తనను నిందించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. బీఆరెస్ చిల్లర ప్రయత్నంతో రాష్ట్రంలో ఉచిత విద్యుత్తుపై చర్చకు అవకాశం వచ్చిందని రేవంత్‌ చెప్పారు.

ఏటా 8 వేల కోట్ల దోపిడీ

2 వేల కోట్ల యూనిట్లు ఉచితంగా ఇస్తామన్న కేసీఆర్.. ఏడాదికి 16వేల కోట్లు 24 గంటల విద్యుత్తుకు ఖర్చు చేస్తున్నారని, కానీ.. ఉచిత విద్యుత్తు ముసుగులో ఏడాదికి 8 వేల కోట్లు చొప్పున దోచుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పవర్ ప్లాంట్ల విషయంలో కేసీఆర్ 45వేల కోట్లకు టెండర్లు ఇచ్చి అందులో అవినీతికి పాల్పడ్డారన్నారు. ఉచితాన్ని అనుచితంగా కేసీఆర్ అవినీతికి వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

24 గంటల ఉచిత విద్యుత్తు విషయంలో కాంగ్రెస్‌కు ఎలాంటి శషభిషలు లేవన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి తీరతామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న విడుదల చేయనున్న తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాన్ని ప్రకటిస్తామన్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసి ఉచిత విద్యుత్తు హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే తొలి సంతకంతోనే ఆ హామీ నెరవేర్చారని గుర్తు చేశారు.

ఉచిత విద్యుత్తు మాత్రమే కాదు.. రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే అన్నారు. బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటన జరిగిన సందర్భంలో కేసీఆర్ హెచ్ఆర్డీ విభాగం అధ్యక్షుడిగా ఉన్నారని, ఆనాడు ఉచిత విద్యుత్తు సాధ్యం కాదని కేసీఆర్ చెప్పారని రేవంత్‌ అన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలని కాంగ్రెస్ అనేక పథకాలు తీసుకొచ్చిందని తెలిపారు.

రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్తు ఉత్పత్తి సంస్థల పంపిణీ విషయంలో జైపాల్ రెడ్డి చొరవతో జనాభా ప్రాతిపదికన కాకుండా వినియోగం ప్రాతిపదికన పంపకాలు జరపాలని సోనియాను ఒప్పించారని తెలిపారు. తద్వారా తెలంగాణకు 53%, ఏపీకి 47% విద్యుత్తు ఇచ్చేలా ఆనాటి కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.

నేనూ రైతు బిడ్డనే..

వ్యవసాయం అంటే ఏమిటో తనకూ తెలుసని రేవంత్‌రెడ్డి చెప్పారు. నాగలి పట్టడం, గుంటుక కొట్టడం తెలిసిన వాడినన్నారు. ‘కేటీఆర్‌లా అమెరికాలో బాత్‌రూమ్‌లు కడగలేదు. వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉన్న రైతు బిడ్డను. పాస్ పోర్ట్ బ్రోకర్ కొడుకును కాదు’ అని రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

విద్యుత్తు పేరిట దోపిడీ

వాస్తవంగా కేసీఆర్ 24 గంటల విద్యుత్తు పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని అప్పట్లో కేసీఆర్ గొప్పగా చెప్పారని, కానీ.. 2.60 పైసలకే యూనిట్‌ విద్యుత్తు ఇస్తామని, ప్లాంట్ల ఏర్పాటు విరమించుకోవాలని గతంలో కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు.

కేసీఆర్ పాలనలో ఏ ప్లస్ గ్రేడ్ ఉన్న డిస్కంలు సీ మైనస్‌కు పడిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో మొదటి పది స్థానాల్లో ఉంటే.. కేసీఆర్ హయాంలో చివరి పది స్థానాల్లోకి పడిపోయాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కేసీఆర్‌ అవినీతిపై విచారణ చేపట్టి, వారి ఆస్తులను జప్తు చేస్తామని ప్రకటించారు.

మా సవాలును స్వీకరించే దమ్ముందా?

‘కేటీఆర్, హరీశ్‌ను సూటిగా అడుగుతున్నా.. మీకు దమ్ముంటే 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరాపై మా పార్టీ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్ రెడ్డి ఇచ్చిన సవాల్‌ను స్వీకరించాలి. 24 గంటల ఉచిత విద్యుత్తుపై ఏ సబ్ స్టేషన్‌లోనైనా చర్చకు సిద్ధం. ఉచిత విద్యుత్తుపై అసలు నిజం బయట పడుతుందనే బీఆరెస్ నిరసనల డ్రామాలు చేస్తున్నది’ అని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తాను చంద్రబాబు శిష్యుడినని చెబుతున్నారని, మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు.

25.50 లక్షల మోటర్లకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించబోతున్నదని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ‘ఇది నిజం కాదని చెప్పడానికి మీలో ఎవరు వస్తారు?’ అని బీఆరెస్‌ నాయకులను ఆయన ప్రశ్నించారు. ఖమ్మంతో తాము ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తే… నిన్న నిరసనలతో బీఆరెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పోలరైజేషన్ మొదలైందన్న రేవంత్‌.. బీఆరెస్‌ ఎమ్మెల్యేల్లో ఈసారి 70శాతం మంది గెలవరని కేసీఆర్ సర్వేలోనే తేలిందని చెప్పారు. కేసీఆర్ గజ్వేల్‌లో గెలుస్తారన్న గ్యారంటీ లేదని, అందుకే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కేసీఆర్ స్పష్టంగా చెప్పడంలేదని ఎద్దేవా చేశారు.

‘మీరు నిజంగా మగాళ్లు అయితే, దమ్ముంటే సిటింగ్‌లందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని ప్రకటించాలి’ అని కేటీఆర్‌కు రేవంత్‌ సవాల్‌ విసిరారు. 24 గంటల విద్యుత్తుపై గతంలో సీబీఐ విచారణ కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. కాళేశ్వరం అవినీతిపై ఎందుకు విచారణ కోరడంలేదని ప్రశ్నించారు.

కేసీఆర్ పాలనలో మూడు పంటలకు నీళ్లు ఇవ్వలేదని, సొంతంగా మూడు గింజలు కొనలేదనిపైగా.. వరి వేస్తే ఉరే అని చెప్పిన నీచుడు కేసీఆర్ అని మండిపడ్డారు. కేసీఆర్‌ పాలనలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఎలా ఉందో ఆయన మనుమడే స్వయంగా చెప్పాడని అన్నారు. మోదీని నాన్‌ రిలయబుల్‌ ఇండియన్‌గా రేవంత్‌ అభివర్ణించారు.